కాంగ్రెస్‌లో కంటోన్మెంట్ కల్లోలం
సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ నియోజకవర్గం ఉప ఎన్నిక మూడు ప్రధాన పార్టీల్లో గందరగోళం రేపుతుంది.

- శ్రీగణేశ్..నివేదితలు కాంగ్రెస్‌లో చేరినట్లుగా ప్రచారం
- కాంగ్రెస్ నుంచి ప్రచారం మొదలుపెట్టిన వెన్నెల
విధాత: సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ నియోజకవర్గం ఉప ఎన్నిక మూడు ప్రధాన పార్టీల్లో గందరగోళం రేపుతుంది. నవంబర్ 30న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన బీఆరెస్ ఎమ్మెల్యే లాస్య నందిత రోడ్డు ప్రమాదంలో ఇటీవల దుర్మరణం పాలైంది. దీంతో ఇక్కడ లోక్‌సభ స్థానాల ఎన్నికలతో పాటు ఉప ఎన్నిక జరగుతుంది. బీఆరెస్ సిటింగ్ స్థానమైన కంటోన్మెంట్ ఉప ఎన్నికల్లో ఏ పార్టీ నుంచి ఎవరు పోటీకి దిగుతారన్నది గందరగోళంగా మారింది. లాస్య నందితపై పోటీ చేసి రెండో స్థానంలో నిలిచిన బీజేపీ అభ్యర్థి శ్రీ గణేశ్ అనూహ్యంగా కాంగ్రెస్ పార్టీలో చేరినట్లు సోషల్ మీడియాలో వార్తలు వెలువడ్డాయి.
ఇదే సమయంలో గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి మూడో స్థానంలో నిలిచిన గద్దర్ కూతురు వెన్నెల ఉప ఎన్నికలో మరోసారి తన అదృష్టాన్ని పరిక్షించుకునేందుకు సిద్ధమై తన ఎన్నికల ప్రచారాన్ని కూడా ప్రారంభించారు. కాంగ్రెస్ తరుపునా తన ప్రచారం కొనసాగిస్తుండగానే శ్రీ గణేశ్ కాంగ్రెస్‌లో చేరినట్లుగా ప్రచారం చోటుచేసుకోవడం ఆమెను గందరగోళంలో పడేసింది. సరిగ్గా ఇదే సమయంలో లాస్య నందిత సోదరి నివేదిత కూడా కాంగ్రెస్‌లో చేరినట్లుగా వార్తలు వెలువడ్డాయి. దీంతో అసలు కాంగ్రెస్ అభ్యర్థి ఎవరన్నదానిపై అయోమయం నెలకొంది.
నిజానికి శ్రీ గణేశ్, నివేదితలు కాంగ్రెస్‌లో చేరారా లేదా అన్నదానిపై అధికారికంగా ఎలాంటి సమాచారం మాత్రం వెల్లడి కాలేదు. అసలు లాస్య సోదరి నివేదిత ఏ పార్టీ నుంచి పోటీ చేస్తారన్నదానిపై కూడా స్పష్టత లేకుండా పోయింది. ఇది ఇలా ఉండగా తన సిటింగ్ స్థానమైన కంటోన్మెంట్‌లో బీఆరెస్ పార్టీ తన అభ్యర్థిని బరిలోకి దించనుందా లేక లాస్య కుటుంబం నుంచి నిలబడే అభ్యర్థికి మద్దతునిచ్చి ఏకగ్రీవానికి సహకరిస్తుందా అన్నది ఆసక్తికరంగా మారింది. మరోవైపు బీఆరెస్ నుంచి కంటోన్మెంట్ అభ్యర్థిగా ఆ పార్టీ సోషల్ మీడియా ఇంచార్జి క్రిశాంక్ టికెట్ రేసులో ఉన్నట్లుగా ప్రచారం వినిపిస్తున్నది.