109కి చేరిన జేఎన్.1 కేసులు.. తెలంగాణలో ఇద్దరికి నిర్ధారణ
దేశ వ్యాప్తంగా కరోనా ప్రమాద ఘంటికలు మోగుతున్నాయి. కొవిడ్ సబ్ వేరియంట్ జేఎన్.1 కేసులు రోజురోజుకు పెరిగిపోతున్నాయి

న్యూఢిల్లీ : దేశ వ్యాప్తంగా కరోనా ప్రమాద ఘంటికలు మోగుతున్నాయి. కొవిడ్ సబ్ వేరియంట్ జేఎన్.1 కేసులు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. డిసెంబర్ 26వ తేదీ నాటికి జేఎన్.1 కేసుల సంఖ్య 109కి చేరినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. గుజరాత్‌లో 36, కర్ణాటకలో 34, గోవాలో 14, మహారాష్ట్రలో 9, కేరళలో 6, రాజస్థాన్, తమిళనాడులో నాలుగు చొప్పున, తెలంగాణలో రెండు కేసులు నమోదు అయ్యాయి. పాజిటివ్‌గా నిర్ధారించబడ్డ వ్యక్తుల్లో చాలా మంది ఐసోలేషన్‌లో ఉన్నారు.
ఇక గడిచిన 24 గంటల్లో కొత్తగా 529 కరోనా కేసులు నమోదు అయ్యాయి. దీంతో యాక్టివ్ కేసుల సంఖ్య 4,093కు చేరినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. మరో ముగ్గురు కూడా మరణించారు. మృతుల్లో కర్ణాటక నుంచి ఇద్దరు, గుజరాత్ నుంచి ఒక్కరు ఉన్నారు.
కేసుల పెరుగుదలతో కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం..
కొవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు కొవిడ్ గైడ్‌లైన్స్ జారీ చేసింది. కరోనా పాజిటివ్‌గా నిర్ధారించబడితే తప్పనిసరిగా ఏడు రోజుల పాటు హోమ్ ఐసోలేషన్‌లో ఉండాల్సిందేనని స్పష్టం చేసింది. ఇక బహిరంగ ప్రదేశాల్లో ప్రజలు తప్పకుండా మాస్క్ ధరించాలని, సామాజిక దూరం పాటించాలని సూచించారు.
జ్వరం, దగ్గు, జలుబు వంటి కరోనా లక్షణాలు ఉన్న పిల్లల్ని పాఠశాలలకు పంపకుండా ఇంట్లోనే ఉంచాలని తల్లిదండ్రులకు సూచించారు. వృద్ధులు, పలు ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న వారు ముందు జాగ్రత్త చర్యగా వ్యాక్సిన్ తీసుకోవాలని సూచించారు. కరోనా వైరస్ కట్టడి చర్యల్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు కర్ణాటక ఆరోగ్య శాఖ మంత్రి తెలిపారు. మరోవైపు 30,000 డోసుల కరోనా వ్యాక్సిన్‌ను పంపిణీ చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కర్ణాటక కోరింది.