Celebrity Club | శామీర్‌పేటలో కాల్పులు.. కార్తీకదీపం సీరియల్‌ హీరోపై ఆరోపణలు

Celebrity Club కార్తీకదీపం సీరియల్‌ హీరోపై ఆరోపణలు తాను బెంగళూరులో ఉన్నానన్న మనోజ్‌ విధాత : మేడ్చ‌ల్ మ‌ల్కాజ్‌గిరి జిల్లా ప‌రిధిలోని శామీర్‌పేట‌లో సెల‌బ్రెటీ క్ల‌బ్‌లోని ఓ విల్లాలో శ‌నివారం ఉద‌యం కాల్పులు క‌ల‌క‌లం సృష్టించాయి. ఈ కాల్పుల నుంచి త‌ప్పించుకున్న వ్య‌క్తి నేరుగా శామీర్‌పేట పోలీస్ స్టేష‌న్‌కు వెళ్లి ఫిర్యాదు చేశాడు. కాల్పులు జ‌రిపింది కార్తీక దీపం న‌టుడు మ‌నోజ్ అని మీడియాలో వార్త‌లు వ‌చ్చాయి. కానీ కాల్పులు జ‌రిపింది తాను కాదని, ప్ర‌స్తుతం తాను […]

Celebrity Club | శామీర్‌పేటలో కాల్పులు.. కార్తీకదీపం సీరియల్‌ హీరోపై ఆరోపణలు

Celebrity Club

  • కార్తీకదీపం సీరియల్‌ హీరోపై ఆరోపణలు
  • తాను బెంగళూరులో ఉన్నానన్న మనోజ్‌

విధాత : మేడ్చ‌ల్ మ‌ల్కాజ్‌గిరి జిల్లా ప‌రిధిలోని శామీర్‌పేట‌లో సెల‌బ్రెటీ క్ల‌బ్‌లోని ఓ విల్లాలో శ‌నివారం ఉద‌యం కాల్పులు క‌ల‌క‌లం సృష్టించాయి. ఈ కాల్పుల నుంచి త‌ప్పించుకున్న వ్య‌క్తి నేరుగా శామీర్‌పేట పోలీస్ స్టేష‌న్‌కు వెళ్లి ఫిర్యాదు చేశాడు. కాల్పులు జ‌రిపింది కార్తీక దీపం న‌టుడు మ‌నోజ్ అని మీడియాలో వార్త‌లు వ‌చ్చాయి. కానీ కాల్పులు జ‌రిపింది తాను కాదని, ప్ర‌స్తుతం తాను బెంగ‌ళూరులో ఉన్నానని న‌టుడు మ‌నోజ్ వివ‌ర‌ణ ఇచ్చాడు.

జ‌రిగింది ఇదీ..!

హైద‌రాబాద్ న‌గ‌రానికి చెందిన సిద్ధార్థ్ దాస్‌కు స్మితా గ్రంథితో కొన్నేండ్ల క్రితం వివాహ‌మైంది. వీరికి ఇద్ద‌రు సంతానం. అయితే సిద్ధార్థ్‌, స్మితా మ‌ధ్య మ‌న‌స్ప‌ర్థ‌లు త‌లెత్త‌డంతో 2019 నుంచి దూరంగా ఉంటున్నారు. కూక‌ట్‌ప‌ల్లి ఫ్యామిలీ కోర్టులో స్మిత విడాకుల కోసం పిటిష‌న్ దాఖ‌లు చేశారు. సిద్ధార్థ్ దాస్ విశాఖ‌లోని హిందూజా థ‌ర్మ‌ల్ ప‌వ‌ర్ ప్లాంట్‌లో మేనేజ‌ర్‌గా ప‌ని చేస్తున్నారు.

స్మిత సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని కాగా, మ‌నోజ్ అనే వ్య‌క్తి ఆమెకు ప‌రిచ‌యం అయ్యాడు. అత‌ను కూడా సాఫ్ట్‌వేర్ ఉద్యోగి. దీంతో ఇద్ద‌రూ క‌లిసి శామీర్‌పేట‌లోని సెల‌బ్రెటీ క్ల‌బ్‌లోని ఓ విల్లాలో స‌హ‌జీవ‌నంలో ఉన్నారని అంటున్నారు. పిల్ల‌లు కూడా స్మితతోనే ఉంటున్నారు.

పిల్ల‌ల‌కు మ‌నోజ్ వేధింపులు

స్మిత ఇద్ద‌రు పిల్ల‌ల‌ను మ‌నోజ్ వేధింపుల‌కు గురి చేస్తున్నాడని సమాచారం. దీంతో ఆమె కుమారుడు చైల్డ్ వెల్ఫేర్ క‌మిటీకి ఫిర్యాదు చేశాడు. త‌నను హింసించిన‌ట్టే త‌న చెల్లిని కూడా మ‌నోజ్ హింసిస్తున్నాడ‌ని, త‌మ‌కు న్యాయం చేయాల‌ని ఫిర్యాదులో పేర్కొన్నాడు. తామిద్ద‌రం తల్లి స్మితతో కానీ, ఆమె బంధువుల వ‌ద్ద కానీ ఉండలేమని కుమారుడు స్ప‌ష్టం చేశాడు.

ఈ విష‌యం తెలుసుకున్న సిద్ధార్థ్ దాస్ త‌న పిల్ల‌ల‌ను చూసేందుకు శ‌నివారం ఉద‌యం స్మిత ఉంటున్న విల్లాకు వ‌చ్చాడు. ఈ సమయంలో మ‌నోజ్, సిద్ధార్థ్ మ‌ధ్య తీవ్ర వాగ్వాదం జ‌రిగింది. మ‌నోజ్ ఎయిర్‌గ‌న్‌తో దాస్‌పై కాల్పులు జ‌రిపాడు. అక్క‌డ్నుంచి త‌ప్పించుకున్న దాస్.. శామీర్‌పేట పీఎస్‌కు వెళ్లి ఫిర్యాదు చేశాడు. కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు ప్రారంభించారు. స్మితతో పాటు మ‌నోజ్‌ను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారని సమాచారం.

మీడియాపై మండిప‌డ్డ కార్తీక దీపం న‌టుడు

ఈ ఘ‌ట‌న‌పై కార్తీక‌దీపం సీరియ‌ల్ న‌టుడు మ‌నోజ్ కుమార్ స్పందించారు. శామీర్‌పేట‌లో కాల్పులు జరిపింది తానే అని కొన్ని మీడియా సంస్థ‌లు ప్రచారం చేస్తున్నాయని, కానీ.. ఈ ఘటనతో తనకు ఎటువంటి సంబంధం లేదని మ‌నోజ్ వివరణ ఇచ్చారు. తాను ప్ర‌స్తుతం బెంగళూరులో ఉన్నానని చెప్పారు. త‌న‌కు ఈ కేసుకు ఎలాంటి సంబంధం లేదని, ఇటువంటి ఫేక్ వార్త‌ల‌ను నమ్మొద్దని కోరుతూ మ‌నోజ్ ఓ వీడియోను విడుదల చేశారు