18 ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌పై కేంద్రం నిషేధం

కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ సంచలన నిర్ణయం తీసుకుంది. అశ్లీల కంటెంట్‌ను ప్ర‌సారం చేస్తున్న 18 ఓటీటీ చానెల్స్‌ను కేంద్రం నిషేధించింది

  • By: Somu    latest    Mar 14, 2024 12:28 PM IST
18 ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌పై కేంద్రం నిషేధం

కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ సంచలన నిర్ణయం తీసుకుంది. అశ్లీల కంటెంట్‌ను ప్ర‌సారం చేస్తున్న 18 ఓటీటీ చానెల్స్‌ను కేంద్రం నిషేధించింది. వీటితోపాటు 19 వెబ్‌సైట్లు, 10 యాప్‌లు ( 7 గూగుల్ ప్లేస్టోర్ నుండి, 3 యాపిల్ యాప్‌స్టోర్‌నుండి), ఇంకా 57 సామాజిక మాధ్య‌మ ఖాతాలు కూడా నిషేధిత జాబితాలో ఉన్నాయి.


ఈ ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌కు, వెబ్‌సైట్ల‌కు కేంద్రం ఇప్పటికే పలుమార్లు హెచ్చరికలు జారీ చేసింది. అశ్లీల, న‌గ్న‌త్వ‌, అస‌భ్య‌క‌ర విష‌యాల‌ను వెంటనే తొలగించాలని సూచించింది. సృజ‌నాత్మ‌క భావ‌వ్య‌క్తీక‌ర‌ణ పేరిట‌, ఇటువంటి కంటెంట్‌ను ప్ర‌సారం చేయ‌డం బాధ్య‌తాయుతం కాద‌ని కేంద్ర స‌మాచార‌,ప్ర‌సార శాఖామంత్రి అనురాగ్ ఠాకూర్ తెలిపాను.


అయితే, కేంద్రం హెచ్చరికలను ఆయా సంస్థ‌లు బేఖాత‌రు చేయ‌డంతో కేంద్ర మంత్రి ఆదేశాల మేరకు ఆయా సంస్థలపై నిషేధం విధించిన‌ట్లు మంత్రిత్వ శాఖ తన ప్రకటనలో తెలిపింది. ముఖ్యంగా 10 యాప్స్‌ని వెంటనే బ్లాక్ చేయాలని ఆదేశించింది. ఇందులో గూగుల్‌ ప్లే స్టోర్‌లో 7 యాప్స్, యాప్‌స్టోర్‌లో మూడు యాప్స్‌ ఉన్నాయి.


కేంద్రం నిషేధం విధించిన ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌లో డ్రీమ్స్‌ ఫిల్మ్స్‌, అన్‌కట్‌ అడ్డా, వూవీ, యేస్మా, ట్రై ఫ్లిక్స్‌, ఎక్స్‌ ప్రైమ్‌, నియోన్‌ ఎక్స్‌ వీఐపీ, బేషరమ్స్‌, హంటర్స్‌, రాబిట్‌, ఎక్స్‌ట్రా మూడ్‌, మూడ్‌ఎక్స్‌, మోజ్‌ఫ్లిక్స్‌, హాట్ షాట్స్‌ వీఐపీ, ఫ్యూజీ, ప్రైమ్‌ ప్లే, చికూఫ్లిక్స్‌ (Dreams Films, Voovi, Yessma, Uncut Adda,Tri Flicks, X Prime, Neon X VIP, Besharams, Hunters, Rabbit, Xtramood, Nuefliks, MoodX, Mojflix, Hot Shots VIP, Fugi, Chikooflix, Prime Play) తదితర ఓటీటీలు ఉన్నాయి.


ఈ అన్ని ర‌కాల ఓటీటీలు, వెబ్‌సైట్లు, సోష‌ల్‌మీడియా ఖాతాల్లో అస‌భ్య‌, అశ్లీల‌, జుగుప్సాక‌ర‌మైన ప‌ద్ధ‌తుల్లో స్త్రీల‌కు చిత్రీక‌రించార‌ని, అర్థంప‌ర్థం, వావివ‌రుసాలేని రీతిలో విడియోలు, ఫోటోలు, రాత‌లూ ఉన్నాయ‌ని తెలిపిన కేంద్రం, ప్రాథ‌మికంగా ఐటీ యాక్ట్ సెక్ష‌న్ 67, 67ఏ, ఐపీసీ 292, ఇంకా మ‌హిళ‌ల అస‌భ్య ప్రాతినిధ్య నిరోధ‌క చ‌ట్టం 1986ల‌ను ఉల్లంఘించిన‌ట్లు, Technology Act, 2000లోని నిబంధనల ప్రకారం నేరంగా పరిగణించినట్లు వెల్లడించింది.