Alamatty Hight Raise Dispute | ఆలమట్టి డ్యామ్‌ ఎత్తు పెంచే పనిలో కర్ణాటక ప్రభుత్వం.. ఆందోళనలో తెలంగాణ రైతాంగం

కర్ణాటకలోని అత్యంత కీలకమైన భారీ ప్రాజెక్ట్‌ ఆలమట్టి డ్యామ్‌ ఎత్తు పెంచాలని ఆ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం రెండు తెలుగు రాష్ట్రాల రైతాంగంలో తీవ్ర ఆందోళన రేపుతున్నది

Alamatty Hight Raise Dispute | ఆలమట్టి డ్యామ్‌ ఎత్తు పెంచే పనిలో కర్ణాటక ప్రభుత్వం.. ఆందోళనలో తెలంగాణ రైతాంగం

హైదరాబాద్, సెప్టెంబర్‌ 22 (విధాత):

Alamatty Hight Raise Dispute | కర్ణాటకలోని అత్యంత కీలకమైన భారీ ప్రాజెక్ట్‌ ఆలమట్టి డ్యామ్‌ ఎత్తు పెంచాలని ఆ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం రెండు తెలుగు రాష్ట్రాల రైతాంగంలో తీవ్ర ఆందోళన రేపుతున్నది. ఆలమట్టి డ్యామ్ ఎత్తు పెంచితే దిగువన ఉన్న తెలంగాణ తీవ్రంగా నష్టపోతుందని నీటిపారుదల నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇదే వాదనను కేంద్ర జల్ శక్తి మంత్రిత్వశాఖ వద్ద తెలంగాణ వినిపించనుంది. రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి సోమవారం ఢిల్లీలో జల్ శక్తి శాఖ మంత్రిని కలిసి ఈ విషయమై ఫిర్యాదు చేయనున్నారు. ఆలమట్టి ఎత్తు పెంచితే తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్ లోని కృష్ణా నది పరివాహక ప్రాంతాలు ఎడారిగా మారే అవకాశం ఉందని రైతులు ఆందోళన చెందుతున్నారు.

ఆలమట్టి ఎత్తు పెంపునకు కర్ణాటక సర్కార్ నిర్ణయం

ఆలమట్టి డ్యామ్ ఎత్తును ప్రస్తుతం ఉన్న 519.6 మీటర్ల నుంచి 524.256 మీటర్లకు పెంచాలని కర్ణాటక మంత్రివర్గం నిర్ణయించింది. ఎత్తు పెంపుతో అదనంగా 100 టీఎంసీల నీటిని నిల్వ చేసుకునే అవకాశం కర్ణాటకకు లభిస్తుంది. తద్వారా ఆ రాష్ట్రంలోని 5.94 లక్షల హెక్టార్ల భూమికి సాగునీటిని అందించే వెసులుబాటు కలుగుతుంది. ప్రస్తుతం ఈ డ్యామ్ నీటి నిల్వ సామర్థ్యం 123.08 టీఎంసీలు. సముద్రంలో వృథాగా వెళ్లే నీటిని వాడుకొనేందుకు ఈ డ్యామ్ ఎత్తు పెంచాలని ప్రతిపాదిస్తున్నామని కర్ణాటక చెబుతోంది. అందుకే దిగువ రాష్ట్రాలైన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ కూడా ఈ ప్రతిపాదనను వ్యతిరేకించే అవకాశం ఉండకపోవచ్చని అంటున్నది. ఎత్తు పెంపునకు 1,33,867 ఎకరాల భూమి అవసరం. ఇందులో 75,563 ఎకరాలు ముంపునకు గురి అవుతోంది. 51,837 ఎకరాలు కాలువల కోసం అవసరం. 6,469 ఎకరాల భూమి పునరావాసం కోసం కావాలి. 20 గ్రామాలతో పాటు బాగల్ కోట్ లోని 11 వార్డులను కూడా తరలించాల్సిన అవసరం ఏర్పడుతున్నది. వ్యవసాయ భూమికి ఎకరానికి రూ. 40 లక్షలు, సాధారణ భూమికి ఎకరానికి రూ. 30 లక్షలు పరిహారం ఇవ్వాలని ప్రభుత్వం డిసైడ్ చేసింది. ఆలమట్టి డ్యామ్ ఎత్తు పెంపును ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కూడా తీవ్రంగా వ్యతిరేకించింది. రాజకీయ, న్యాయ పోరాటం చేసింది. ఆలమట్టి డ్యామ్ ఎత్తు పెంపుపై సుప్రీంకోర్టులో కూడా కేసును దాఖలైంది.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఏం జరిగింది?

ఆలమట్టి డ్యామ్ ఎత్తు పెంపు అంశం 1996లో బయటకు వచ్చింది. అప్పట్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబునాయుడు ఉన్నారు. ఈ డ్యామ్ ఎత్తు పెంచితే ప్రస్తుతం నిల్వ చేస్తున్న 123 టీఎంసీలతో పాటు అదనంగా మరో 100 టీఎంసీల నీటిని కర్ణాటక నిల్వ చేసుకునేవీలుంది. ఇప్పటికే ఆలమట్టి, తదుపరి నారాయణపుర డ్యామ్‌లు నిండితేనే దిగువకు అంటే తెలంగాణకు నీళ్లు విడుదల చేస్తున్నారు. ఇప్పుడు ఎత్తు పెంచితే మరో వంద టీఎంసీలు దాటే వరకూ దిగువకు నీటి విడుదల ఆగిపోతుంది. కృష్ణా పరివాహక ప్రాంతంలో ప్రతి ఐదేళ్లలో నాలుగు ఏళ్లకు ఒకసారి సరైన వరదలు వచ్చే పరిస్థితులు లేవు. ఈ డామ్ ఎత్తు పెంచితే కర్ణాటక రాష్ట్రం కృష్ణా నదీ జలాల్లో తనకు కేటాయించిన వాటా కంటే ఎక్కువగా వాడుకొనే అవకాశం ఉంటుంది. 2000 సంవత్సరం నాటికి అప్పర్ కృష్ణ ప్రాజెక్టును పూర్తి చేయడానికి వనరుల సమీకరించడానికి అప్పటి కర్ణాటక ప్రభుత్వం కృష్ణ భాగ్య జల నిగమ్ లిమిటెడ్ ఏర్పాటు చేసింది. దీంతో అప్పటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అప్రమత్తమైంది. 1996లో అప్పటి ప్రధాని పీవీ నరసింహారావు దృష్టికి ఏపీ సీఎం చంద్రబాబు ఈ విషయాన్ని తీసుకెళ్లారు. ఆలమట్టి ఎత్తు పెంపును నిలిపివేయాలని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ తీర్మానం చేసింది. రూ. 36 బిలియన్ల అంచనా వ్యయంతో ఆలమట్టి ఆనకట్ట వద్ద 1,170 మెగావాట్ల జల విద్యుత్ ఉత్పత్తికి 1996 జనవరిలో కేంద్ర జలవిద్యుత్ సంస్థ ఇచ్చిన సూత్రప్రాయ అనుమతిని ఏపీ వ్యతిరేకించింది. యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వంలో దేవెగౌడ ప్రధానిగా ఉన్న సమయంలో 1996 ఆగస్టులో కృష్ణా పరివాహాక రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో యునైటెడ్ స్టీరింగ్ కమిటీ పశ్చిమ బెంగాల్, బీహార్, అసోం, తమిళనాడు ముఖ్యమంత్రులతో ప్యానెల్ ను ఏర్పాటు చేసింది. ఇది అస్సాం, బీహార్, తమిళనాడు, పశ్చిమ బెంగాల్ అధికారులతో ఆరుగురు సభ్యుల నిపుణుల కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీకి డీపీ ఘోషల్ కన్వీనర్‌గా ఉన్నారు. ఈ కమిటీ 1997 జనవరిలో తన నివేదికను సమర్పించింది. ఆలమట్టి ఎత్తు పెంచాల్సిన అవసరం లేదని ఈ కమిటీ సూచించింది. +519.6 మీటర్ల ఎఫ్‌ఆర్‌ఎల్‌తో ఆలమట్టి ఆనకట్ట దాదాపు 123 టీఎంసీల నిల్వను అందిస్తుంది. ఇది నారాయణపుర వద్ద 37.8 టీఎంసిల నిల్వతో పాటు, ఎగువ కృష్ణ ప్రాజెక్ట్ కింద ప్రస్తుతం ఊహించిన 173 టీఎంసీల వార్షిక అవసరాన్ని తీర్చడానికి సరిపోతుంది” అని నిపుణుల కమిటీ తెలిపింది. ఆలమట్టి ఎత్తు పెంపును నిరసిస్తూ అప్పట్లో సుప్రీంకోర్టులో దాఖలైన పిటిషన్లపై విచారణ నిర్వహించిన ఉన్నత న్యాయస్థానం డ్యామ్ ఎత్తును 519.6 మీటర్లకే పరిమితం చేసింది. ఈ డ్యామ్ ఎత్తు పెంపుపై సుప్రీంకోర్టు స్టే విధించింది.

మరోసారి తెరపైకి ఆలమట్టి ఎత్తు పెంపు అంశం

ఆలమట్టి డ్యామ్ ఎత్తు పెంచాలని కర్ణాటక ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతో తెలంగాణ ఆందోళన చెందుతోంది. డ్యామ్ ఎత్తు పెంపును మహారాష్ట్ర కూడా వ్యతిరేకిస్తోంది. ఈ డ్యామ్ ఎత్తు పెంచితే తెలంగాణకు నీళ్లు వచ్చే పరిస్థితి తగ్గిపోతోంది. ఇప్పటికే కృష్ణా నదిపై తెలంగాణ చేపట్టిన ప్రాజెక్టులు పూర్తి కాలేదు. ఆలమట్టి ఎత్తు పెంచితే కృష్ణా పరివాహక ప్రాంతాలు ఎడారిగా మారిపోయే అవకాశం ఉందని తెలంగాణ నీటిపారుదల నిపుణులు స్పష్టంచేస్తున్నారు. కృష్ణా నదిపై పాలమూరు రంగారెడ్డి, ఎస్ఎల్బీసీతో పాటు ఇతర ప్రాజెక్టులు అసంపూర్తిగా ఉన్నాయి. కృష్ణా జలాల పున:పంపిణీ జరగాలని తెలంగాణ కోరుతోంది. ఉమ్మడి ఏపీ రాష్ట్రం వాటాను తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ తాత్కాలికంగా పంచుకున్నాయి. కృష్ణా జలాల పంపిణీని ట్రిబ్యునల్‌ ఇంకా పూర్తి చేయాల్సి ఉంది. ఈలోపుగా పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేస్తే ఆ ప్రాజెక్టులకు నీటిలో వాటా దక్కనుంది. మరో వైపు ఖరీఫ్ సీజన్‌లో నాగార్జున సాగర్ ప్రాజెక్టు నుంచి ఆగస్టు మొదటి వారంలో నీటిని విడుదల చేస్తున్నారు. 1996కు పూర్వం జూన్, జూలై మాసాల్లోనే నీటిని విడుదల చేసే పరిస్థితి ఉండేది. ఎగువ రాష్ట్రాలు ప్రాజెక్టులు కట్టడంతోపాటు కృష్ణా నదిలో వరదలు తగ్గిపోవడం కూడా ఇందుకు కారణం. ఇప్పుడు ఆలమట్టి ఎత్తు పెంచితే పరిస్థితి తెలంగాణకు కృష్ణా వరద జలాలు రావడం మరింత ఆలస్యమయ్యే అవకాశం ఉంది. ఆలమట్టిపై తెలంగాణ రాష్ట్రం తన వాదనలను కేంద్రం వద్ద ఉంచనుంది. ఆలమట్టిపై గతంలో ఏం జరిగింది, సుప్రీంకోర్టు ఏం చెప్పింది…కర్ణాటక ప్రభుత్వం ఏం చేస్తోందనే విషయాలను కేంద్ర జల్ శక్తి మంత్రిత్వశాఖ ముందు ప్రస్తావించనున్నారు. మరో వైపు ఆలమట్టి ఎత్తు పెంపు అంశాన్ని తెలంగాణలో విపక్షాలు ప్రభుత్వంపై దాడి చేసేందుకు అస్త్రంగా ఎంచుకున్నాయి.