G20 Summit | జీ20 సదస్సులో ప్రత్యేక ఆకర్షణగా నటరాజ విగ్రహం.. చోళుల కాలం నాటి విధానంలో తయారీ
G20 Summit | విధాత: వివిధ దేశాల అధిపతులు తరలివచ్చే జీ20 (G-20) సమావేశానికి దిల్లీ అంగరంగ వైభవంగా సిద్ధమయింది. భారతీయ ప్రాచీన సంస్కృతిని ప్రపంచానికి పరిచయం చేయడానికి ఈ సదస్సును ఒక వేదికగా మార్చుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది. అందులో భాగంగా సదస్సుకు ప్రధాన కేంద్రమైన భారత్ మండపం ఆవరణలో భారీ నటరాజ విగ్రహాన్ని (Nataraja Sculptor) ఏర్పాటు చేసింది. ఇది ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన నటరాజ విగ్రహమని సమాచారం. తన జటాజూటాన్ని లయబద్ధంగా కదుపుతూ నాట్యం […]

G20 Summit |
విధాత: వివిధ దేశాల అధిపతులు తరలివచ్చే జీ20 (G-20) సమావేశానికి దిల్లీ అంగరంగ వైభవంగా సిద్ధమయింది. భారతీయ ప్రాచీన సంస్కృతిని ప్రపంచానికి పరిచయం చేయడానికి ఈ సదస్సును ఒక వేదికగా మార్చుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది. అందులో భాగంగా సదస్సుకు ప్రధాన కేంద్రమైన భారత్ మండపం ఆవరణలో భారీ నటరాజ విగ్రహాన్ని (Nataraja Sculptor) ఏర్పాటు చేసింది.
ఇది ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన నటరాజ విగ్రహమని సమాచారం. తన జటాజూటాన్ని లయబద్ధంగా కదుపుతూ నాట్యం చేసే ఈ నటరాజుణ్ని మొదట తంజావూరు రాజ్యంలోని స్వామిమలైలో తయారు చేసినట్లు చరిత్రకారుల అభిప్రాయం. చోళుల సాంస్కృతిక పోషణలో భాగంగా దీనిని తయారు చేయించినట్లు ఆధారాలున్నాయి.
ప్రస్తుతం భారత్ మండపం వద్ద ఏర్పాటు చేసిన ఈ విగ్రహాన్ని చోళుల కాలం నాటి విధానంలోనే తయారు చేశామని దీని రూపకర్త శ్రీ కంద స్థపతి వెల్లడించారు. మొత్తం 27 అడుగుల పొడవు, 21 అడుగుల వెడల్పు, 18 టన్నుల విగ్రహాన్ని ఏడు నెలల తక్కువ కాలంలో పూర్తి చేయడం ఒక రికార్డని ఆయన అన్నారు. ఈ శ్రీ కంద స్థపతి చోళుల కాలంలో నటరాజ విగ్రహాలు తయారు చేసిన స్వామిమలై స్తపతిల వారసులే కావడం మరో విశేషం.
ఇదీ స్వామిమలై చరిత్ర
తమిళులు మురుగున్‌గా కొలుచుకునే కుమారస్వామి కొలువున్న ప్రాంతమే స్వామిమలై. కావేరీ ఒడ్డున ఈ ప్రాంతం కంచుతో అద్భుత శిల్పాలు చేయగల శిల్పులకు ప్రసిద్ధి. అందుకే వీరిని చోళ రాజులు విరివిగా తమ సాంస్కృతిక పోషణలో ఉపయోగించుకున్నారు. ప్రపంచ ప్రసిద్ధి చెందిన బృహదీశ్వర ఆలయంలోనూ వీరి కృషి ఉంది. సుమారు 34 తరాలుగా ఈ విశ్వకర్మ కులం.. తమకే సొంతమైన మైనం కరగని శిల్పాల పోత పద్ధతిని తర్వాతి తరాలకు అందిస్తూ వస్తోంది.
The #Nataraja statue made of Ashtadhatu is installed at the Bharat Mandapam. The 27 feet tall, 18-ton-weight statue is the tallest statue made of Ashtadhatu and is sculpted by the renowned sculptor Radhakrishnan Sthapaty of Swami Malai in Tamil Nadu and his team in a record 7… pic.twitter.com/Gf0ZCpF7Fy
— Indira Gandhi National Centre for the Arts (@ignca_delhi) September 5, 2023
ఇదీ శిల్పం తయారుచేసిన విధానం
నటరాజ విగ్రహాన్ని తయారు చేసిన విధానాన్ని శ్రీ కంద స్థపతి వివరించారు. ‘ముందుగా పారాఫిన్ వ్యాక్స్, రెజిన్‌లను వేరుశనగ నూనెతో కలిపి మిశ్రమాన్ని తయారు చేస్తాం. ఈ మిశ్రమానికి వేడి తగిలినపుడు అది చాలా మృదువుగా మారుతుంది. మొత్తం విగ్రహాన్ని 120 భాగాలుగా విభజించుకుని పని మొదలుపెట్టాం. అనాదిగా వస్తున్న శిల్ప శాస్త్రం ప్రకారం… మొహం, చేతులు, కాళ్లు, కొలతలను తీసుకుని మైనపు పూత పోశాం. ఒక సారి పోతపని పూర్తయ్యాక వాటిమీద కావేరీ నది మట్టితో వాటిని కప్పెట్టి ఉంచాలి.
అనంతరం ఎండలో ఒకసారి ఎండబెట్టాలి. ఈ ప్రక్రియను పలు మార్లు పునరావృతం చేయాల్సి ఉంటుంది. అప్పుడే ఆ పోత అనేది దృఢంగా మారి మెటల తీగలను, రాడ్‌లను తట్టుకుంటుంది. అనంతరం వాటిని వేడి చేయడంతో వ్యాక్స్ మొత్తం కరిగిపోయి.. ఖాళీ గొట్టాల్లాంటి ఆకారం లభిస్తుంది. వాటిలో అష్టధాతువులైన రాగి, ఇత్తడి, లెడ్, టిన్, పాదరసం, ఇనుము, బంగారం, వెండి తగు పాళ్లల్లో నింపి విగ్రహాన్ని తయారు చేశాం.
పంచధాతువులతో కాకుండా అష్టధాతువులతో చేయడంతో ఈ విగ్రహ జీవితకాలం చాలా ఎక్కువ’ అని ఆయన వివరించారు. ‘నటరాజ విగ్రహం అనేది ఒక కాస్మిక్ శక్తికి, సృజనకు ప్రతిరూపం. జీ20 సదస్సులో ఇది ప్రధాన ఆకర్షణగా నిలవనుంది’ అని ఈ విగ్రహ తయారీని పర్యవేక్షించిన ఇందిరా గాంధీ నేషనల్ సెంటర్ ఫర్ ఆర్ట్స్ ఒక ప్రకటనలో పేర్కొంది.