CM KCR | కొంప మునుగుతుందనే కోట దాటారా!
బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలపై తీవ్ర వ్యతిరేకత లిక్కర్ స్కామ్, పేపర్ లీకేజీలతో పార్టీ ఉక్కిరిబిక్కిరి అవకాశం చూసుకుని ప్రతిపక్షాల ఆందోళనలు ప్రజాక్షేత్రంలోకి వెళుతున్న కాంగ్రెస్ నేతలు లోపాలపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తుతున్న బీజేపీ విధాత: సుదీర్ఘకాలం తరువాత ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు (CM KCR) కోట దాటి ప్రజల్లోకి వెళ్లారు. మరీ ముఖ్యంగా ఈ మధ్య కాలంలో ఉప ఎన్నికలకు మినహా మరో అంశంపై సీఎం కేసీఆర్ ప్రజల్లోకి వెళ్లలేదని బీఆర్‌ఎస్ (BRS) క్యాడరే అంటోంది. ‘హమ్మయ్యా మా […]

- బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలపై తీవ్ర వ్యతిరేకత
- లిక్కర్ స్కామ్, పేపర్ లీకేజీలతో పార్టీ ఉక్కిరిబిక్కిరి
- అవకాశం చూసుకుని ప్రతిపక్షాల ఆందోళనలు
- ప్రజాక్షేత్రంలోకి వెళుతున్న కాంగ్రెస్ నేతలు
- లోపాలపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తుతున్న బీజేపీ
విధాత: సుదీర్ఘకాలం తరువాత ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు (CM KCR) కోట దాటి ప్రజల్లోకి వెళ్లారు. మరీ ముఖ్యంగా ఈ మధ్య కాలంలో ఉప ఎన్నికలకు మినహా మరో అంశంపై సీఎం కేసీఆర్ ప్రజల్లోకి వెళ్లలేదని బీఆర్‌ఎస్ (BRS) క్యాడరే అంటోంది. ‘హమ్మయ్యా మా సార్ ఇప్పటికైనా ప్రజల్లోకి వచ్చారు. అదే మాకు చాలు’ అన్న ఆనందంలో ఉన్నది. సీఎం కేసీఆర్ రెండవసారి అధికార పగ్గాలు చేపట్టిన తరువాత తీసుకున్న నిర్ణయాలు కొన్ని వివాదం అయ్యాయి. ముఖ్యంగా ధరణి (Dharani) ప్రాజెక్టు వల్ల కావాల్సినంత వ్యతిరేకత మూటకట్టుకున్నది.
ధరణి వచ్చినా వెసులుబాటు కలగలకపోగా.. సమస్యలు మరింత జటిలమయ్యాయనే అభిప్రాయం సర్వత్రా ఉన్నది. కాంగ్రెస్, బీజేపీలు తాము అధికారంలోకి వచ్చిన వెంటనే ధరణిని రద్దు చేస్తామనే స్థాయికి వెళ్లాయి. మరోవైపు స్థానికంగా అధికార పార్టీ ఎమ్మెల్యేలపై ప్రజల్లో వ్యతిరేకత క్రమంగా తీవ్ర స్థాయికి వెళుతున్నదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఒక్కొక్క ఎమ్మెల్యే పనితీరుపై ముఖ్యమంత్రి కేసీఆర్ సర్వేలు చేయించారని తెలిసింది. ఆ సర్వేల్లో సైతం ప్రభుత్వ వ్యతిరేకత ఉన్నట్లు, కాంగ్రెస్ గ్రాఫ్ పెరుగుతున్నట్లు రిపోర్ట్ రావడంతో అలర్ట్ అయినట్లు తెలుస్తోంది.
అధికార పార్టీని ఉక్కిరి బిక్కిరి చేస్తున్న లిక్కర్ స్కామ్, పేపర్ లీకేజీ
అధికార పార్టీని ఢిల్లీ లిక్కర్ స్కామ్ (Delhi Liquor Scam), టీఎస్‌పీఎస్సీ (TSPSC) పేపర్ లీకేజీ సంఘటనలు ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో ఎన్‌ఫోర్స్‌మెంట్‌డైరెక్టరేట్ (ఈడీ) ఉచ్చు బిగిస్తోంది. ఎమ్మెల్సీ కవితను ఇప్పటికే మూడుసార్లు విచారించారు. పైగా ఆమె ఆడిటర్ బుచ్చి బాబును అరెస్ట్ చేశారు. ఇదే స్కామ్‌లో కవిత వ్యాపార భాగస్వామి పిళ్లైని అరెస్ట్ చేశారు.
మరో వైపు ఏపీకి చెంది ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి కుమారుడిని కూడా అరెస్ట్ చేశారు. ఢిల్లీ డిప్యూటీ సీఎం సిసోడియా ఇప్పటికే జైలులో ఉన్నారు. ఆయనను ఈడీ అడపాదడపా కస్టడీకి తీసుకొని విచారిస్తోంది. లిక్కర్ స్కామ్‌పై విచారణ జరుగుతున్న సమయంలోనే టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ వ్యవహారం బయటకు వచ్చింది. దీంతో ఇంటా బయటా విమర్శలు ఎదుర్కోవాల్సి రావడంతో ఏమి చేయాలో అర్థం కాని పరిస్థితి ఏర్పడింది.
విద్యార్థులు ఆందోళనకు దిగారు. ప్రతిపక్షాలు అధికార పక్షంపై ముప్పేట దాడి మొదలుపెట్టాయి. ఐటీ శాఖను చూస్తున్న మంత్రి కేటీఆర్ (IT Minister KTR) ను బర్తరఫ్ చేయాలన్న డిమాండ్‌ను కాంగ్రెస్, బీజేపీలు చేస్తున్నాయి. ఇప్పట్లో ఈ ఆందోళనలు సద్దుమణిగేలా కనిపించడం లేదు. పైగా తెలంగాణ వచ్చిన తరువాత కూడ సెక్షన్‌లలో ఆంధ్రా అధికారులే దిక్కా? ఒక్క తెలంగాణ అధికారీ లేడా? అని కాంగ్రెస్ సంధించిన ప్రశ్నలు అధికార పార్టీని ఇరకాటంలో పడేస్తున్నాయి.
ఇప్పటికే ప్రజా క్షేత్రంలో కాంగ్రెస్
తెలంగాణ రాష్ర్ట ఏర్పాటు నుంచి అధికారానికి దూరంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ ఈ సారి ఎలాగైనా గెలవాలన్న తపనతో ప్రజాక్షేత్రంలోకి వెళ్లింది. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి (Revanth Reddy), సీఎల్‌పీ నేత భట్టి విక్రమార్క (Bhattivikramarka) పాదయాత్రలు చేస్తుండగా, కాంగ్రెస్ పార్టీ నాయకులు మండల, జిల్లా స్థాయిల్లో ఆందోళనలు చేపట్టారు. వాటికి ప్రజా మద్దతు లభిస్తున్నదనే అభిప్రాయాలు ఉన్నాయి. మరో వైపు బీజేపీ (BJP) నేతలు అధికార పక్షంపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తుతున్నారు.
ప్రతి రోజు ఏదో ఒక చోట నేతలు అధికార పక్షాన్ని, సీఎం కేసీఆర్‌ను, ఆయన కుటుంబాన్ని టార్గెట్ చేసి విమర్శిస్తున్నారు. సీఎం కేసీఆర్ సొంతంగా చేయించుకున్న సర్వేల్లో కూడా ఇదే విషయం వెల్లడి అయినట్ల సమాచారం. దీంతో ప్రజా వ్యతిరేకతను తట్టుకొని, తిరిగి మూడవ సారి అధికారంలోకి రావడం కోసం సీఎం కేసీఆర్ స్వయంగా రంగంలోకి దిగే పరిస్థితి ఏర్పడింది. దీంతో ప్రజా వ్యతిరేకతకు చెక్ పెట్టాలంటే తాను ప్రజల్లోకి వెళ్లడమే ఏకైక మార్గమని సీఎం కేసీఆర్ నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది.
అందుకే ఇటీవల కురిసిన వడగళ్ల వర్షంతో తీవ్రంగా నష్టపోయిన పంట పొలాల పరిశీలనకు కేసీఆర్ వెళ్లారని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. ఈ ఏడాదిలోనే ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో రైతులకు నేరుగా నగదు ఇచ్చి ఆదుకోవడం కోసం పంట నష్టపరిహారం కింద ఏక మొత్త సాయంగా రూ. 10 వేలు ప్రకటించారన్న చర్చ రాజకీయ పరిశీలకుల్లో జరుగుతోంది. గతంలో జీహెచ్‌ఎంసీ ఎన్నికలకు ముందు వరదలు వస్తే వరదల్లో నష్టపోయిన వారికి రూ.10 వేల నగదు ఇచ్చారని, తాజాగా సీఎం కేసీఆర్ ఇదే తీరుగా నష్టపోయిన రైతులకు ఆర్థిక సహాయం అందిస్తున్నారని భావిస్తున్నారు.