CM KCR | అనతి కాలంలోనే అద్భుత విజయాలు: సీఎం కేసీఆర్
CM KCR | ప్రగతి సూచీకలలో తెలంగాణ మేటి సమైక్య పాలనలో విధ్వంసమైన తెలంగాణ పునర్ నిర్మాణం తెలంగాణ ఆచరిస్తోంది..దేశం అనుసరిస్తుందన్న ఖ్యాతి సాధించాం స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో సీఎం కేసీఆర్ ఉద్యోగ, కార్మిక వర్గాలకు నజరనాలు విపక్షాలపై విసుర్లు విధాత, హైద్రాబాద్ ప్రతినిధి : స్వాతంత్రోద్యమ స్ఫూర్తితో శాంతియుత, అహింసా మార్గంలో సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో అనతి కాలంలోనే అద్భుత పాలనతో, తిరుగులేని విజయాలతో ప్రగతి పథంలో దూసుకెలుతుందని సీఎం కేసీఆర్ అన్నారు. సమైక్య పాలనలో […]

CM KCR |
- ప్రగతి సూచీకలలో తెలంగాణ మేటి
- సమైక్య పాలనలో విధ్వంసమైన తెలంగాణ పునర్ నిర్మాణం
- తెలంగాణ ఆచరిస్తోంది..దేశం అనుసరిస్తుందన్న ఖ్యాతి సాధించాం
- స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో సీఎం కేసీఆర్
- ఉద్యోగ, కార్మిక వర్గాలకు నజరనాలు
- విపక్షాలపై విసుర్లు
విధాత, హైద్రాబాద్ ప్రతినిధి : స్వాతంత్రోద్యమ స్ఫూర్తితో శాంతియుత, అహింసా మార్గంలో సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో అనతి కాలంలోనే అద్భుత పాలనతో, తిరుగులేని విజయాలతో ప్రగతి పథంలో దూసుకెలుతుందని సీఎం కేసీఆర్ అన్నారు. సమైక్య పాలనలో ఎటు చూసిన ఆకలి కేకలు, ఆత్మహత్యలతో విధ్వంసమైన తెలంగాణలో అగమ్య గోచర పరిస్థితుల నడుమ అధికారంలోకి వచ్చిన బీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ పునర్నిర్మాణాన్ని ఒక పవిత్రయజ్ఞంగా నిర్వహించిందన్నారు.
విధ్వంసమైపోయిన తెలంగాణను విజయవంతంగా వికాసపథం వైపు నడిపించిందన్నారు. ప్రజల అవసరాలు, ఆకాంక్షలు అర్థం చేసుకున్న ప్రభుత్వం కనుక, దానికి అనుగుణంగా అన్నిరంగాలనూ ప్రక్షాళన చేసిందన్నారు. అనేక రంగాలలో రాష్ట్రాన్ని దేశంలో అగ్రస్థానంలో నిలబెట్టింది. దార్శనిక దృక్పథంతో, పారదర్శక విధానాలతో, అభివృద్ధిలో, సంక్షేమంలో కొత్త పుంతలు తొక్కింది. “తెలంగాణ ఆచరిస్తుంది – దేశం అనుసరిస్తుంది” అనే దశకు చేరుకొని దశాబ్ది ముంగిట సగర్వంగా నిలిచిందన్నారు.
దేశ 77వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా గొల్కొండ కోటపై జాతీయ పతకావిష్కరణ చేసి ప్రసంగించారు. 75 ఏళ్ల స్వతంత్ర భారతం సాధించిన ప్రగతి గణనీయమైనదే అయినా, ఆశించిన లక్ష్యాలను, చేరవల్సిన గమ్యాలను మాత్రం ఇంకా చేరలేదని, ఇందుకు దేశీయ వనరుల సద్వినియోగంలో పాలకుల వైఫల్యమే కారణమన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో నాటి తెలంగాణ నాయకత్వం సమైక్య నాయకులకు కొమ్ముకాస్తూ చేవ చచ్చి చేష్టలుడిగి ప్రవర్తించడం వల్లనే తెలంగాణ తీవ్రమైన వివక్షకు, దోపిడీకి గురైందన్నారు.
పది సంవత్సరాల కిందటి తెలంగాణ సంక్షుభిత జీవనచిత్రాన్ని తలుచుకుంటే ఇప్పటికీ గుండెలు పిండేసినట్లయి దుఃఖం తన్నుకొస్తదన్నారు. నేడు తెలంగాణ జీవన దృశ్యాన్ని చూస్తే.. నిరంతర విద్యుత్తు ప్రసారంతో వెలుగులు వెదజల్లుతున్నదన్నారు. పంట కాల్వలతో, పచ్చని చేన్లతో కళకళలాడుతున్నది. మండే ఎండలలో సైతం చెరువులు మత్తడి దుంకుతున్నయన్నారు.
ప్రపంచంలో ఎక్కడైనా ఒక దేశం గానీ, ఒక రాష్ట్రం గానీ సాధించిన ప్రగతికి ప్రమాణంగా చూసే ప్రబల సూచికలుంటాయి. వాటిలో ముఖ్యమైనవి ఐదు ఆంశాలు తలసరి ఆదాయం, తలసరి విద్యుత్తు వినియోగం, స్వచ్ఛమైన తాగునీటి సరఫరా, ఉన్నతమైన వైద్యారోగ్య ప్రమాణాలు, ఉత్తమ విద్యా ప్రమాణాలన్నారు.
ఈ ఐదింటిలోనూ తెలంగాణ దేశంలోకెల్లా అగ్రస్థానంలో నిలిచిందని సీఎం కేసీఆర్ తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పటిష్టమైన క్రమశిక్షణతో రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని బలోపేతం చేసింది. సంపద పెంచింది. ప్రజలకు పంచింది. దేశంలో స్థిరపడిన పెద్ద రాష్ట్రాలను అధిగమించి నూతన రాష్ట్రం తెలంగాణ 3 లక్షల 12 వేల 398 రూపాయల తలసరి ఆదాయంతో అగ్రస్థానంలో నిలిచింది. అదేవిధంగా తలసరి విద్యుత్తు వినియోగంలో జాతీయ సగటు అయిన 1,255 యూనిట్లను అధిగమించింది. దేశ సగటుకంటే 70శాతం అత్యధికంగా 2,126 యూనిట్ల సగటు వినియోగంతో తలసరి విద్యుత్తు వినియోగంలో తెలంగాణ దేశంలోనే నంబర్ – 1 గా నిలిచిందన్నారు.
ఉద్యోగ, కార్మిక వర్గాలకు కేసీఆర్ వరాలు
స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల ప్రసంగంలో సీఎం కేసీఆర్ ఉద్యోగుల, కార్మిక వర్గాలకు శుభవార్త తెలిపారు. ఇప్పటివరకూ రెండు పీఆర్సీల ద్వారా 73 శాతం ఫిట్మెంట్ అందించామని, కరోనా విజృంభణ ఆర్థిక వ్యవస్థ మీద తీవ్ర ప్రభావం చూపించిన తరుణంలోనూ ఉద్యోగులకు మెరుగైన ఫిట్ మెంట్ నే అందించిన ఘనత తెలంగాణ ప్రభుత్వానిదేనన్నారు. త్వరలోనే కొత్త పీఆర్సీ నియమించి, జీతాలు పెంచుతామని, అప్పటివరకు మధ్యంతర భృతిని చెల్లిస్తామని, ఇదే విషయాన్ని ఇటీవలి అసెంబ్లీ సమావేశాల్లో ప్రకటించానంటు గుర్తు చేశారు.
అలాగే సింగరేణీ కార్మికులకు దసరా, దీపావళీ పండుగల బోనస్‌గా వేయికోట్లు పంపిణీ చేయబోతున్నామని ప్రకటించారు. వీర్‌ఏల సర్ధుబాటుకు 14,594పోస్టులను మంజూరు చేసి, వారికి పేస్కేల్ అందిస్తున్నామన్నారు. పంచాయతీ కార్యదర్శులను క్రమబద్ధీకరించామని గుర్తు చేశారు. పంచాయతీ పారిశుద్ధ్య కార్మికులకు 5లక్షల బీమా సదుపాయాన్ని ప్రకటించారు.
వెలుగు జిలుగుల తెలంగాణ
విద్యుత్తు రంగంలో తెలంగాణది స్ఫూర్తిదాయకమైన విజయగాథ అన్నారు. అనతికాలంలోనే అన్నిరంగాలకూ 24 గంటలపాటు, వ్యవసాయానికి ఉచితంగా నాణ్యమైన విద్యుత్తు సరఫరా చేస్తున్న ఏకైక రాష్ట్రంగా తెలంగాణ ఆవిర్భవించిందన్నారు. విద్యుత్తు రంగంలో వచ్చిన విప్లవాత్మకమైన అభివృద్ధి అన్నిరంగాలనూ ప్రభావితం చేసిందన్నారు.
రెండు దశల్లో 37వేల కోట్ల రుణమాఫీ
రెండోసారి అధికారంలోకి రాగానే మరోసారి పంటరుణాల మాఫీ చేపట్టామని, మొత్తంగా తొమ్మిదిన్నరేళ్ల కాలంలో రెండు దశల్లో రాష్ట్రంలోని రైతులకు చెందిన దాదాపు 37 వేల కోట్ల రూపాయల పంట రుణాలను మాఫీ చేశామన్నారు. దేశం మొత్తంమీద రైతులను ఈ తరహాలో రుణ విముక్తులను చేసిన ప్రభుత్వం మరొకటి లేదన్నారు. రైతు సంక్షేమంలో తెలంగాణకు సాటి రాగల రాష్ట్రం దేశంలో మరొకటి లేదన్నారు.
రైతు సంక్షేమంలో తెలంగాణకు సాటి రాగల రాష్ట్రం దేశంలో మరొకటి లేదన్నారు. అభివృద్ధిలో తెలంగాణ రాష్ట్రం ఇంతటి ఔన్నత్యాన్ని సాధిస్తుంటే, కొంతమంది అల్పబుద్ధిని ప్రదర్శిస్తూ రైతు సంక్షేమ చర్యలకు వక్రభాష్యాలు చెబుతున్నారని విమర్శించారు. వ్యవసాయానికి మూడుగంటల విద్యుత్తు సరఫరా చాలని విపరీత వ్యాఖ్యలు చేస్తున్నారని, వీరి రైతు వ్యతిరేక వైఖరికి ప్రజలే తగు విధంగా సమాధానం చెబుతారన్నారు.
వలసల జిల్లాగా పేరుపడి గోసెల్ల దీసిన పాలమూరుతోపాటు రంగారెడ్డి జిల్లా రైతుల కష్టాలు కడ తేర్చేందుకు ప్రభుత్వం పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు నిర్మాణాన్ని ప్రారంభించింది. 12 లక్షల ఎకరాలకు నీళ్లివ్వడంతోపాటు, 1200 గ్రామాలకు తాగునీరందించే అమృతప్రాయమైన ఈ ప్రాజెక్టును అడ్డుకునేందుకు గ్రీన్ ట్రిబ్యునల్లో కేసులు వేసి విపక్ష నాయకులు తమ వికృత మనస్తత్వాన్ని బయట పెట్టుకున్నారని విమర్శించారు. తమ అల్పమైన రాజకీయ ప్రయోజనాల కోసం పాలమూరు రంగారెడ్డి జిల్లాల ప్రజలను ఉసురు పోసుకోవడానికి సిద్ధపడ్డారన్నారు. అయితే, విద్రోహ మనస్తత్వంతో విపక్షాలు పెట్టిన కేసులు వీగిపోయాయని కేసీఆర్ అన్నారు.
పోడుభూములకు పట్టాలు
దళిత, గిరిజనుల సంక్షేమానికి పోడు సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతూ 1 లక్షా 50 వేల మంది ఆదివాసీ, గిరిజనులకు 4 లక్షల ఎకరాలకుపైగా పోడు భూములపై యాజమాన్య హక్కులు కలిగించిందన్నారు. వారందరికీ రైతుబంధు పథకాన్ని సైతం వర్తింపజేస్తూ పంట పెట్టుబడి సాయం అందించించామన్నారు. పోడు భూముల కోసం జరిగిన ఆందోళనల్లో నమోదైన కేసుల నుంచి విముక్తులను చేసిందన్నారు.
నేటీ నుంచి డబుల్ బెడ్రూం ఇండ్ల పంపిణీ
హైదరాబాద్ మహానగరంలో నిర్మాణం పూర్తిచేసుకొని ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉన్న 1 లక్ష డబుల్ బెడ్రూం ఇళ్లను ప్రభుత్వం నేటి నుంచే అర్హులైన పేదలకు అందజేస్తున్నది. గృహలక్ష్మి పథకం కింద లబ్ధిదారులకు గృహ నిర్మాణానికి మూడు దశల్లో మూడు లక్షల రూపాయల ఆర్ధిక సహాయం అందజేస్తున్నదని సీఎం పేర్కోన్నారు.
అన్ని వర్గాలకు సంక్షేమ ఫలాలు
దళితుల నుంచి బ్రాహ్మణుల వరకు సమాజంలోని అన్నివర్గాల పేదలకూ సంక్షేమ ఫలాలను అందజేస్తూ తెలంగాణ సమ్మిళిత అభివృద్ధిని సాధిస్తున్నదన్నారు. తెలంగాణ దళితబంధు పథకం అమలు చేస్తున్నది. ప్రపంచంలోనే అతిపెద్ద నగదు బదిలీ పథకంగా దళితబంధు దేశానికి దిక్సూచిగా నిలిచిందన్నారు. సహాయులకు జీవన భద్రతకోసం అందించే పెన్షన్ను 200 నుంచి 2016 రూపాయలకు పెంచామన్నారు.
2014 నాటికి ఆసరా లబ్దిదారుల సంఖ్య కేవలం 29 లక్షలు, నేడు ఆసరా పెన్షన్లు అందుకుంటున్న లబ్దిదారుల సంఖ్య 44 లక్షలు, వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులతో పాటు బీడీ కార్మికులు, ఒంటరి మహిళలు, పైలేరియా బాధితులు, డయాలసిస్ రోగులకు కూడా తెలంగాణ ప్రభుత్వం ఆసరా పెన్షన్ సౌకర్యం కల్గించిందని వివరించారు. పెన్షన్ పొందేందుకు వయో పరిమితిని 60 నుంచి 57 ఏండ్లకు తగ్గించిందని, ప్రభుత్వం ఇటీవల దివ్యాంగులపెన్షన్ను 3016 నుంచి 4016 రూపాయలకు పెంచిందన్నారు. తద్వారా దివ్యాంగుల బతుకుల్లో మరింత ధీమాను నింపిందన్నారు.
ప్రభుత్వంలో ఆర్టీసీ సిబ్బంది విలీనం
తెలంగాణ ఏర్పడిన తర్వాత ఆర్టీసీని బలోపేతం చేయడం కోసం, సంస్థ ప్రయోజనాలు, సిబ్బంది సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని ఏడాదికి 1500 కోట్ల రూపాయలను ప్రభుత్వమే బడ్జెట్ లో అందిస్తూ వచ్చిందన్నారు. కానీ, నష్టాలు మాత్రం తప్పడంలేదన్నారు. అయినా ఆర్టీసీ సంస్థను కాపాడాలని, అందులో పనిచేస్తున్న సిబ్బంది సంక్షేమం లక్ష్యం 43 వేల 373 మంది ఆర్టీసీ సిబ్బందిని ప్రభుత్వంలో విలీనం చేయాలని బీఆరెస్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్నారు.
రాష్ట్ర ప్రభుత్వానికి ప్రజల్లో వస్తున్న ఆదరణను చూసి ఆందోళన చెందుతున్న సంకుచిత శక్తులు ఆర్టీసీ బిల్లును అడ్డుకోవడానికి విఫల ప్రయత్నాలు చేశాయని, కానీ, వారి ప్రయత్నాలను వమ్ముచేస్తూ అసెంబ్లీలో ఆర్టీసీ బిల్లు విజయవంతంగా ఆమోదం పొందిందన్నారు. ఆర్టీసీ ఉద్యోగుల కుటుంబాల్లో ఆనందం నిండిందన్నారు.
హైదరాబాద్ నలుమూలలకు మెట్రో
విశ్వనగరంగా దినదినాభివృద్ధి చెందుతున్న హైదరాబాద్ మహానగరంలో ట్రాఫిక్ రద్దీని నివారించి, సిగ్నల్ ఫ్రీ సిటీగా మార్చేందుకు తెలంగాణ ప్రభుత్వం 67 వేల 149 కోట్ల రూపాయల వ్యయంతో స్ట్రాటెజిక్ రోడ్ డెవలప్ మెంట్ ప్రోగ్రాంను అమలు చేస్తున్నదన్నారు. ఎస్సార్టీపీ కింద 42 కీలక రహదారులు, ఫ్లై ఓవర్లు, అండర్ పాస్ లు, ఆర్వోబీల అభివృద్ధిని చేపట్టిందని, పెరుగుతున్న ప్రజా రవాణా అవసరాలకు అనుగుణంగా హైదరాబాద్ మహానగరం నలువైపులకూ మెట్రో రైలును విస్తరించాలని ప్రభుత్వం నిర్ణయించిందని, ఇందుకోసం 69 వేల కోట్ల రూపాయలకు పైగా వ్యయంతో ఓఆర్ఆర్ చుట్టూ ఉన్న అన్ని జంక్షన్ల నుంచి హైదరాబాద్ ను అనుసంధానం చేస్తూ, నేరుగా ఎయిర్ పోర్టుకు చేరుకొనే విధంగా మెట్రో రైలును విస్తరించాలని ప్రణాళిక రూపొందించిందని కేసీఆర్ తెలిపారు.
నేతన్నలకు వరాలు
నేత కార్మికుల సమస్యల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారించిన ప్రభుత్వం వారికోసం అనేక సంక్షేమ పథకాలను అమల్లోకి తెచ్చిందన్నారు. నూలు రసాయనాలపై 50 శాతం సబ్సిడీని అందజేస్తూ నేతన్నకు చేయూతనిస్తున్నదన్నారు. గుంటమగ్గాల స్థానంలో ఫ్రేమ్ మగ్గాలు అందించడం కోసం “తెలంగాణ చేనేత మగ్గం” అనే కొత్త పథకాన్ని అమలు చేయాలని నిర్ణయం తీసుకుందన్నారు. నేతన్నలకు సైతం పైసా భారం లేకుండా 5 లక్షల రూపాయల బీమాను కల్పిస్తున్నదని కేసీఆర్ తెలిపారు.
వైద్యారోగ్య రంగంలో అద్భుత ప్రగతి
రాష్ట్రం ఏర్పాటయ్యే నాటికి తెలంగాణ ప్రాంతంలో కేవలం మూడే వైద్య కళాశాలలు ఉండేవి. బీఆరెస్ ప్రభుత్వం జిల్లాకొక వైద్య కళాశాల, నర్సింగ్ కళాశాలను ఏర్పాటు చేయాలనే విధాన నిర్ణయం తీసుకొని స్వల్పకాలంలోనే 21 వైద్య కశాళాలలను ప్రారంభించి చరిత్ర సృష్టించిందన్నారు. మరో 8 మెడికల్ కాలేజీల ఏర్పాటుకు ఇటీవలనే క్యాబినెట్ ఆమోదముద్ర వేసిందన్నారు. ఇవి కూడా త్వరలోనే ప్రారంభించి, రాష్ట్రంలో ప్రతి జిల్లాలో మెడికల్ కాలేజీ ఏర్పాటు లక్ష్యాన్ని ప్రభుత్వం పరిపూర్తిచేయబోతున్నదన్నారు.
విద్యారంగ వికాసం
దేశవ్యాప్తంగా చూస్తే, గురుకుల విద్యలో తెలంగాణకు సాటిరాగల రాష్ట్రం మరొకటి లేదని, రాష్ట్రంలో నేడు వెయ్యికి పైబడి గురుకుల జూనియర్ కళాశాలలు కొలువుదీరటం బీఆరెస్ ప్రభుత్వం సృష్టించిన నూతన చరిత్ర అన్నారు. డబ్బులేని కారణంగా పేద విద్యార్థులెవరూ ఉన్నత విద్యకు దూరం కావద్దనే ఉదాత్త లక్ష్యంతో ప్రభుత్వం 20 లక్షల రూపాయల ఓవర్సీస్ స్కాలర్ షిప్ ను అందిస్తున్నది. నేడు వేలాదిమంది విద్యార్థులు ప్రభుత్వ ఆర్థిక సహాయంతో వివిధ దేశాలలో ఉన్నతమైన చదువులు చదువుకోవడం ప్రభుత్వ సంకల్ప సిద్ధికి నిదర్శనమన్నారు.
ప్రజలకు చేరువగా పాలన
పరిపాలనను వికేంద్రీకరించి ప్రజలకు చేరువ చేసేందుకు ప్రభుత్వం పాలనా సంస్కరణలు చేపట్టింది. కొత్త జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు,మండలాలు, మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు ఏర్పాటు చేసింది. అన్ని జిల్లాలలో సకల సౌకర్యాలతో సమీకృత కలెక్టరేట్లు నిర్మించింది. గిరిజనుల చిరకాల వాంఛను నెరవేరుస్తూతండాలకు, గూడాలకు గ్రామ పంచాయతీ హోదా కల్పించిందన్నారు.
పారిశ్రామిక, ఐటీ రంగాల్లో తెలంగాణ మేటి
పరిశ్రమలకు అనుమతి మంజూరు ప్రక్రియలో అలసత్వానికి, అవినీతికి అవకాశం లేకుండా తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన టీఎస్ఐపాస్ చట్టం దేశానికే మార్గదర్శకంగా నిలిచిందన్నారు. దీనికితోడు
24 గంటల నిరంతర విద్యుత్తు పారిశ్రామిక రంగంలో నూతనోత్తేజాన్ని నెలకొల్పిందన్నారు. నేడు తెలంగాణ జాతీయ, అంతర్జాతీయ పెట్టుబడులకు గమ్యస్థానంగా, పరిశ్రమలకు స్వర్గధామంగా మారిందని, 2 లక్షల 51 వేల కోట్ల పెట్టుబడులతో రాష్ట్రానికి కొత్త పరిశ్రమలు వచ్చాయన్నారు.
పేదరికం తగ్గుముఖం
“సంపద పెంచు – ప్రజలకు పంచు” అనే సదాశయంతో “తెలంగాణ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాల ఫలితంగా తెలంగాణ రాష్ట్రంలో పేదరికం తగ్గుతున్నదనీ, తలసరి ఆదాయం పెరుగుతున్నదనీ” నీతి ఆయోగ్ తాజాగా విడుదల చేసిన బహుముఖీయ పేదరిక సూచీ స్పష్టం చేసిందన్నారు. జాతీయ స్థాయిలో నమోదయిన సగటు పేదరికంతో పోల్చిచూస్తే తెలంగాణలో పేదరికం అందులో మూడోవంతుగా నమోదైందన్నారు. ఈ నివేదిక ప్రకారం 2015-16 నాటికి. తెలంగాణలో 13.18 శాతంగా ఉన్న పేదరికం, 2019-21 నాటికి 5.88 శాతానికి దిగివచ్చిందన్నారు. అంటే, ఏకంగా 7.3 శాతం పేదరికం కనుమరుగైందని సీఎంకేసీఆర్ అన్నారు.
అనాథల పిల్లల బాధ్యత ప్రభుత్వానిదే
60 ఏండ్ల సమైక్య రాష్ట్రంలో అనాథ పిల్లల సంరక్షణ కోసం ఒక విధానమంటూ లేకపోవడం అత్యంత విషాదకరమని సీఎం కేసీఆర్ అన్నారు. పరిపాలనలో మానవీయ పరిమళాలు వెదజల్లుతున్న తెలంగాణ ప్రభుత్వం అనాథల పిల్లల సంరక్షణ బాధ్యతను సంపూర్ణంగా స్వీకరించిందన్నారు. వారిని “స్టేట్ చిల్డ్రన్” గా పేర్కొంటూ ఉన్నతమైన, ఉదాత్తమైన పద్ధతిలో అర్పణ్ పాలసీని రూపొందించిందన్నారు.
ఇకపై అనాథ పిల్లలను రాష్ట్ర ప్రభుత్వమే అక్కున చేర్చుకుంటుందని, అనాథలైన ఆడపిల్లలకు పూర్తి రక్షణ కల్పించడంతోపాటు, వారికి విద్యాబుద్ధులు నేర్పించి, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించేవరకూ ప్రభుత్వమే బాధ్యత వహిస్తుందన్నారు. అనంతరం వివిధ రంగాల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన వారికి అవార్డులను, ప్రశంసపత్రాలను సీఎం కేసీఆర్ అందించారు. ఈ కార్యక్రమంలో సీఎస్ శాంతికుమారి, డీజీపి అంజన్‌కుమార్ సహా మంత్రులు, ఎమ్మెల్యేలు, వివిధ ప్రభుత్వ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.