పదేళ్ల పాలనలో వందేళ్ల విధ్వంసం

తెలంగాణ ఉద్యమ సమయంలో సింగరేణి కార్మికులు కీలకపాత్ర పోషించారని, కానీ.. స్వరాష్ట్రంలో నిర్లక్ష్యానికి గురయ్యారని ముఖ్యమంత్రి ఏ రేవంత్‌రెడ్డి అన్నారు

పదేళ్ల పాలనలో వందేళ్ల విధ్వంసం
  • తెలంగాణ రాష్ట్రం ఏర్పడే నాటికి
  • ఏటా 6వేల కోట్లే అప్పుల చెల్లింపునకు
  • పదేళ్లలో ఏటా 70 వేల కోట్లు పెంచారు
  • ‘మిగులు’ రాష్ట్రాన్ని దివాలా తీయించారు
  • నీళ్ల పేరుతో నిధులను దోచుకున్నారు
  • మార్చి 31లోగా రైతుబంధు నిధులు
  • ఇంత సంక్షోభంలోనూ ఒకటినే వేతనాలు
  • కాంగ్రెస్‌, బీఆరెస్‌, బీజేపీ మేనిఫెస్టోలపై
  • అసెంబ్లీలో ప్రత్యేకంగా చర్చిద్దామా?
  • అనర్హులకు 22వేల కోట్ల రైతుబంధు నిధులు
  • కాళేశ్వరం కాలువలే తవ్వలేదు.. నీళ్లెక్కడ?
  • రాష్ట్రంలో 11 లక్షల బోర్లు కొత్తగా వేశారు
  • వాటితోనే 40 లక్షల ఎకరాల సాగు
  • మరి కాళేశ్వరం నీళ్లు ఎక్కడివి?
  • మీడియా సమావేశంలో సీఎం రేవంత్‌రెడ్డి
  • సింగరేణి కార్మికులకు కోటి ప్రమాద బీమా

విధాత: తెలంగాణ ఉద్యమ సమయంలో సింగరేణి కార్మికులు కీలకపాత్ర పోషించారని, కానీ.. స్వరాష్ట్రంలో నిర్లక్ష్యానికి గురయ్యారని ముఖ్యమంత్రి ఏ రేవంత్‌రెడ్డి అన్నారు. సింగరేణిని ప్రైవేటుపరం చేయడాన్ని బీఆరెస్ అడ్డుకోకపోగా ప్రోత్సహించిందని ఆరోపించారు. సింగరేణి ఉద్యోగులకు కోటి రూపాయల ప్రమాద బీమా పథకాన్ని సోమవారం సచివాలయంలో ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. గత పాలకులు సృష్టించిన సమస్యలను ఒక్కొక్కటిగా పరిష్కరిస్తున్నామని తెలిపారు. రాష్ట్రంలో పేదలకు ఉపయోగపడే పనులు చేస్తూ ముందుకెళుతున్నామని చెప్పారు.


రాష్ట్రం ఏర్పడిన కొత్తలో ఏడాదికి రూ.6వేల కోట్లు అప్పులు చెల్లించగా.. ఈ బీఆరెస్‌ ప్రభుత్వ హయాంలో ఏడాదికి రూ.70 వేల కోట్లు కట్టాల్సిన పరిస్థితి తెచ్చారని రేవంత్‌రెడ్డి వివరించారు. మిగులు బడ్జెట్ ఉన్న రాష్ట్రాన్ని కేసీఆర్ చేతిలో పెడితే.. రూ.70వేల కోట్లు చెల్లించాల్సిన పరిస్థితికి దివాలా తీయించారని మండిపడ్డారు. 80వేల పుస్తకాలు చదివినాయన ప్రతియేటా 70వేల కోట్లు చెల్లించాల్సిన దుస్థితికి తీసుకుపోయారని ఎద్దేవా చేశారు. పదేళ్లలో వందేళ్లకు సరిపడా విధ్వసం చేశారని ఆరోపించారు. లక్షా 30వేల కోట్ల ఆదాయం వస్తే అందులో 70వేల కోట్లు అప్పులు చెల్లించడానికే పోతున్నాయని, మిత్తి చెల్లించడానికి అప్పులు చేయాల్సి వస్తున్నదని తెలిపారు.


పైన పటారం లోన లొటారం అన్నట్టుగా బీఆరెస్‌ హయాంలో పరిస్థితి ఉన్నదని విమర్శించారు. ఒక రాష్ట్రాన్ని ఇంత వేగంగా దివాలా తీయించిన వ్యక్తి మరొకరు ఉండరని అన్నారు. ఉద్యోగులకు ఒకటో తారీఖున ఇవ్వాల్సిన జీతాలను కేసీఆర్‌ 25వ తేదీ వరకూ ఇస్తే.. తాము వచ్చిన మొదటి నెలలోనే నాలుగో తేదీన వేతనాలు వేశామని, రెండో నెలలో ఒకటో తేదీనే ఇచ్చామని చెప్పారు. ‘రైతుబంధు ఇవ్వటం లేదని కేటీఆర్‌, హరీశ్‌రావు మాట్లాడుతున్నారు. వారు డిసెంబర్‌ నుంచి అక్టోబర్‌ వరకు ఇచ్చుకుంటూ వస్తే.. మేం జనవరి నుంచి మార్చి 31లోపు పూర్తి చేస్తామని చెప్పాం.. చేస్తాం’ అని అన్నారు. 15 రోజుల్లో కూడా చెల్లించవచ్చని, కానీ, జీతాలు, పెన్షన్లు, విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లు, ఇతర సంక్షేమ పథకాలకు కూడా చెల్లించాల్సి వస్తున్నదని చెప్పారు.


ఆర్థిక ప్రణాళికను అమలు చేస్తూ అందరికీ ఇచ్చుకుంటూ వస్తున్నామని చెప్పారు. ఇంత ఆర్థిక సంక్షోభంలో ఉన్నా ప్రతి నెలా మొదటి తారీఖునే ఉద్యోగులకు జీతాలు ఇస్తున్నామని తెలిపారు. మార్చి 31లోగా రైతుబంధు ఇస్తామని చెబుతున్నా.. నిస్సిగ్గుగ్గా బీఆరెస్ తమ ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నదని రేవంత్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. నిస్సహాయులెవరనేదానికి కొలబద్దగానే తెల్ల రేషన్‌ కార్డులు తీసుకున్నామని చెప్పారు. తెల్ల రేషన్‌ కార్డులు లేనివారికి కార్డులు అందిస్తామని చెప్పారు. బీఆరెస్‌ పాలకులు ఎక్కడికక్కడ వదిలేసిన సంసారాన్ని చక్కదిద్దుతున్నామన్నారు.


కాళేశ్వరంతో పెరిగింది ఎక్కడ?


రాష్ట్రంలో వ్యవసాయ పరిస్థితిని గురించి మాట్లాడుతూ, ‘చెరుకు పోయింది. మిర్చి పోయింది. పత్తి పోయింది. మక్కలు పోయాయి. వరి అన్నారు. తర్వాత వరి వేస్తే ఊరే అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడే నాటికి 18 లక్షల బోర్లు ఉంటే.. ఈ పదేళ్లలో 29 లక్షల బోర్లు అయ్యాయి. 11 లక్షల బోర్లు పెరిగాయి. ఒక్క బోరు కింద 3, 4 ఎకరాలు అనుకున్నా.. 40 లక్షల ఎకరాలు పెరిగింది. ఇక కాళేశ్వరం వల్ల పెరిగింది ఎక్కడ?’ అని ప్రశ్నించారు.


కాళేశ్వరం కింద కాల్వలు ఎక్కడ తవ్వారు? కాలువలు తవ్వితేనే కదా నీళ్లు వచ్చేది? అన్నారు. మేడిగడ్డ కుంగింది.. అన్నారం పగిలింది అంటుంటే మేడిగడ్డలో నీళ్లు అన్నారంలో ఎత్తిపోయాలని హరీశ్‌రావు అంటున్నారన్న ముఖ్యమంత్రి.. అసలు ఆయన మెదడు ఉండే మాట్లాడుతున్నారా? అని ప్రశ్నించారు. ‘ఎలా కుంగిపోయిందో సమాధానం చెప్పరు. చూసొద్దామంటే రారు’ అని ఎద్దేవా చేశారు. కాలం కలిసొచ్చి వర్షాలు పడి, చెరువుల నిండాయని అన్నారు. వర్షాలను కూడా ఆయనే కురిపించారా? అని కేసీఆర్‌ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు.


కేటీఆర్‌ మేనేజ్‌మెంట్‌ కోటా నాయకుడు


రేవంత్‌రెడ్డి సీఎం అవురని ముందే తెలిస్తే 30 సీట్లు కూడా వచ్చేవి కావని కేటీఆర్‌ చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ.. కేటీఆర్‌ ఔట్‌సోర్సింగ్‌.. మేనేజ్‌మెంట్‌ కోటా వచ్చాడని అన్నారు. తాను కాంగ్రెస్‌ అధ్యక్షుడిగా 80 సభల్లో పాల్గొన్నానని, పార్టీని గెలిపించానని చెబుతూ, ఇంకా ప్రకటించేది ఏమున్నదన్నారు. బీఆరెస్‌కు కేసీఆర్‌ స్లీపింగ్‌ ప్రెసిడెంట్‌ అయితే.. ఈయనను వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా పెట్టారు కదా? రిజల్ట్‌ ఏమైంది? అని ప్రశ్నించారు.


అందరూ అమెరికాకు పారిపోయిడని అనగానే.. మళ్లీ వెనక్కు వచ్చి, కప్పిపుచ్చుకోవడానికి ఏదో ఒక మాట్లాడుతున్నారని అన్నారు. కేటీఆర్‌ మాటలను తామెప్పుడు సీరియస్‌గా తీసుకోబోమని చెప్పారు. అవినీతిపై విచారణల గురించి ప్రస్తావిస్తూ పరిపాలన కూడా చేయాల్సి ఉన్నదని, ఒక్కొటిగా బయటకు తీస్తామని చెప్పారు. అవినీతిపై మాట్లాడినవారిని గొర్రెలన్నారని, ఇప్పుడు ఏసీబీకి ఇవ్వగానే ఒక్క గొర్రె కూడా పలకడం లేదని చురకలంటించారు.


ఆదాయం వస్తుందని చెప్పి రుణాలు తెచ్చారు


మిషన్‌ భగీరథ 50వేల కోట్లు, కాళేశ్వరానికి లక్ష కోట్లు అప్పు తెచ్చారు. ఈ పథకాలతో ఆదాయం వస్తుందని, డీపీఆర్‌లో చెప్పి రుణాలు తెచ్చారు. కానీ.. వీటికి రుణాలు ప్రభుత్వ ఖజానా నుంచే చెల్లించాల్సిన పరిస్థితి నెలకొందని చెప్పారు. కార్పొరేషన్ల మీద అడ్డగోలుగా రుణాలు తీసుకుంటున్నారని తెలిసే, కేంద్ర ప్రభుత్వం అన్ని రుణాలను ఎఫ్‌ఆర్బీఎం పరిధిలోకి తెచ్చి, బీఆరెస్‌ ప్రభుత్వ వ్యవహారాన్ని బయటపెట్టిందన్నారు.


అనర్హులకూ రైతుబంధు వెళ్లింది


గత ప్రభుత్వం అనర్హులకు కూడా రైతు బంధు పథకాన్ని వర్తింప జేసిందని, దీని ద్వారా 22వేల కోట్ల రూపాయలు అనర్హులకు వెళ్లాయని చెప్పారు. ఇందులో లేఔట్లకు, ఇండ్లు కట్టుకున్న కాలనీలకు, చివరకు రోడ్లకు కూడా రైతుబంధు ఇచ్చారని విమర్శించారు. తాము బాధ్యతాయుతంగా వ్యవహరిస్తామని చెప్పారు. రేషన్‌కార్డులు, ప్రజావాణి దరఖాస్తులు తీసుకుని, వారికి పథకాలు అందుబాటులోకి వచ్చేలా చూసేందుకు కింది స్థాయిలో అధికారాలు ఇచ్చామని, హెల్ప్‌ డెస్కులు ఏర్పాటు చేశామని రేవంత్‌రెడ్డి తెలిపారు.


ఆర్థిక నియంత్రణ పాటిస్తున్నాం


ఆర్థిక నియంత్రణ పాటిస్తూ.. అన్ని వర్గాలను సంతృప్తిపరిచేలా తమ ప్రభుత్వం బడ్జెట్‌ను ఖర్చు చేస్తున్నదని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వెల్లడించారు. ఇందుకు తమను అభినందించాల్సింది పోయి.. కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌ అబద్ధాలు చెబుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది నలుగురి ఘోషనే తప్ప వాళ్ల పార్టీ వాళ్లు కూడా ఆమోదించడం లేదన్నారు. ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం హామీలు నెరవేర్చే దిశగా ముందుకు వెళుతున్నామని సీఎం స్పష్టం చేశారు.


నియామకాలను గాలికి వదిలేసిన బీఆరెస్‌ సర్కార్‌


ఉద్యోగ నియామకాల్లో చిక్కు ముడులు విప్పుతూ 60 రోజుల్లో 25 వేల ఉద్యోగాలు భర్తీ చేశామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చెప్పారు. నిర్లక్ష్య ధోరణితో బీఆరెస్ గాలికి వదిలేస్తే తాము నియామకాలు చేపట్టామని తెలిపారు. మార్చి 2న మరో 6 వేల పైచిలుకు ఉద్యోగాలు భర్తీ చేయబోతున్నామని చెప్పారు. గ్రూప్స్‌ పరీక్షల కోసం సిద్ధమయ్యేవారికి శిక్షణ ఇచ్చేందుకు ప్రతి నియోజకవర్గంలో అంబేద్కర్‌ నాలెడ్జ్‌ సెంటర్లు ఏర్పాటు చేస్తామని సీఎం వెల్లడించారు. హైదరాబాద్‌లోని ఫూలే భవన్‌ నుంచి అక్కడి విద్యార్థులకు విద్యారంగ నిపుణులతో ఆన్‌లైన్‌ క్లాసులు నిర్వహిస్తామని చెప్పారు. నిరుద్యోగులకు విశ్వాసం కల్పించే ప్రయత్నం చేస్తున్నామని తెలిపారు.


నీళ్ల ముసుగులో నిధుల దోపిడి


బీఆరెస్ పాలనలో నీళ్ల ముసుగులో నిధుల దోపిడీ జరిగిందని రేవంత్‌ స్పష్టం చేశారు. కృష్ణా జలాలపై బీఆరెస్‌ నేతలు మళ్లీ అవే అబద్దాలు చెబుతున్నారని సీఎం రేవంత్‌రెడ్డి విమర్శించారు. ‘ఈ వేదికగా బీఆరెస్, బీజేపీలకు సవాలు విసురుతున్నా.. మీ 2014, 2018 ఎలక్షన్ మ్యానిఫెస్టోలు.. 2023లో మా ఆరు గ్యారెంటీల హామీలపై ప్రత్యేక శాసనసభ సమావేశాలు పెట్టి చర్చిద్దాం.. ఇందుకు బీఆరెస్, బీజేపీ సిద్ధమా?’ అని ప్రశ్నించారు. రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామన్న మోదీ మాట ఏమైంది? స్విస్‌ బ్యాంకుల నుంచి నల్లధనం తెచ్చి ప్రతి ఒక్కరి ఖాతాలో 15 లక్షలు వేస్తామన్న హామీ ఏమైంది? అని నిలదీశారు.


కాంగ్రెస్‌ ప్రభుత్వంపై బీఆరెస్‌, కాంగ్రెస్‌ అక్కసు


కాంగ్రెస్‌ ప్రభుత్వంపై బీఆరెస్‌, కాంగ్రెస్‌ అక్కసు వెళ్లగక్కుతున్నాయని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. ‘మూడోసారి మోదీని ప్రధాని చేస్తే ఏం చేస్తారు? రైతులను కాల్చి చంపుతారా? కేంద్ర మంత్రిగా ఉండి తెలంగాణకు కిషన్ రెడ్డి ఏం చేశారు? హైదరాబాద్‌లో వరదలు వచ్చినపుడు నిధులు తెచ్చారా?’ అని ప్రశ్నించారు. బీజేపీ నేతలకు, కేసీఆర్‌కు తేడా ఏమీ లేదని విమర్శించారు. ఏ ముఖం పెట్టుకుని ఎన్నికల్లో ఓట్లు అడుగుతారని ఇరు పార్టీల నేతలను నిలదీశారు.


తెలంగాణ ప్రజల సమస్యలపై చర్చించేందుకు కేంద్ర మంత్రిగా ఉన్న కిషన్‌ రెడ్డి ఈ రోజు వరకూ ప్రభుత్వాన్ని కలిసే ప్రయత్నం చేయలేదని, తాను చొరవ చూపినా కలవటానికి అవకాశం ఇవ్వలేదని రేవంత్‌రెడ్డి ఆరోపించారు. సమస్యల పరిష్కారం విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికి సహకరించాలని కిషన్‌ రెడ్డి ఎందుకు అనుకోవడం లేదని ప్రశ్నించారు. మోదీ పదేళ్లలో ప్రజలను ఏదో ఒక రూపంలో మోసం చేస్తూనే వస్తున్నారని విమర్శించారు.


నేడు ఉచిత కరెంటు, సబ్సిడీ గ్యాస్‌ పథకాలు


మంగళవారం సాయంత్రం 5 గంటలకు 200 యూనిట్ల ఉచిత కరెంటు, రూ.500 గ్యాస్ పథకాలను ప్రారంభిస్తున్నామని సీఎం చెప్పారు. ఈ కార్యక్రమాలకు బీఆరెస్‌ నాయకులను ఆహ్వానిస్తున్నా ఎందుకు రావడం లేదని ప్రశ్నించారు. బాధ్యత లేకుండా, ప్రజలను మభ్యపెట్టేందుకు బీఆరెస్‌, బీజేపీ ప్రయత్నిస్తున్నాయని ఆరోపించారు. రాజకీయకాంక్షతో ఎన్నికల్లో లబ్ధి పొందాలనే దురాశ తప్ప బీజేపీ, బీఆరెస్‌కు వేరే ఆలోచనలేదని ఎద్దేవా చేశారు.


కాంగ్రెస్‌ ప్రభుత్వం బరువు, బాధ్యతలతో ప్రజలకు సేవచేస్తున్నదని చెప్పారు. శక్తినంతా కూడదీసుకుని ఆర్థిక పరిస్థితిని చక్కదిద్దుతున్నామని అన్నారు. మమ్మల్ని ప్రశ్నించే హక్కు బీజేపీ, బీఆరెస్‌కు లేదని స్పష్టం చేశారు. గ్యారంటీల అమలు నిరంతర ప్రక్రియ అని ముఖ్యమంత్రి పునరుద్ఘాటించారు. అర్హులు ఎప్పుడైనా పథకాలకు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. ఆరు గ్యారంటీలపై అపోహలు వద్దని అన్నారు.