బీఆరెస్ ఎంపీ రంజిత్‌రెడ్డి ఇంటికి వెళ్లిన సీఎం రేవంత్‌రెడ్డి
సీఎం రేవంత్‌రెడ్డి శుక్రవారం బీఆరెస్ ఎంపీ రంజిత్ రెడ్డి ఇంటికి వెళ్లడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది

- చేవెళ్ల కాంగ్రెస్ ఎంపీ టికెట్ చాన్స్
- చేవెళ్ల బీఆరెస్ ఎమ్మెల్యే కాలే యాదయ్య కూడా కాంగ్రెస్‌లోకి
- సీఏం రేవంత్ రెడ్డితో భేటీ అయిన దానం
- త్వరలో కాంగ్రెస్‌లోకి
విధాత, హైదరాబాద్ : సీఎం రేవంత్‌రెడ్డి శుక్రవారం బీఆరెస్ ఎంపీ రంజిత్ రెడ్డి ఇంటికి వెళ్లడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. బీఆరెస్ నుంచి టికెట్ ఇచ్చేందుకు కేసీఆర్ సుముఖత వ్యక్తం చేసినప్పటికి రంజిత్‌రెడ్డి పోటికి నిరాకరించారు. దీంతో చేవెళ్ల బీఆరెస్ టికెట్‌ను కాసాని జ్ఞానేశ్వర్‌కు కేటాయించారు. అయితే రంజిత్‌రెడ్డి కాంగ్రెస్ నుంచి పోటీకి ఆసక్తి చూపిన నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా ఆయన ఇంటికి వెళ్లి పార్టీలోకి ఆహ్వానించారు. కాంగ్రెస్ పార్టీ సర్వేలో టికెట్ రేసులో ఉన్న పట్నం సునితామహేందర్‌రెడ్డి కంటే రంజిత్‌రెడ్డికే విజయవకాశాలున్నాయన్న నివేదిక రావడంతో రంజిత్‌రెడ్డిని పార్టీలో చేర్చుకునేందుకు రేవంత్‌రెడ్డి మొగ్గుచూపారని పార్టీ వర్గాల కథనం.
రంజిత్‌రెడ్డితో పాటు చేవెళ్ల బీఆరెస్ ఎమ్మెల్యే కాలే యాదయ్య కూడా కాంగ్రెస్‌లో చేరుతారని సమాచారం. ఎమ్మెల్యే కాలే యాదయ్య 2014లో కాంగ్రెస్ నుంచి గెలిచి బీఆరెస్‌లో చేరిపోయారు. 2018, 2023ఎన్నికల్లో బీఆరెస్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డితో కాలే యాదయ్య భేటీ కావడంతో ఆయన కూడా కాంగ్రెస్‌లో చేరుతారన్న ప్రచారం బలపడింది.
రంగారెడ్డి జిల్లా బీఆరెస్ పార్టీ నుంచి మాజీ మంత్రి ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి, ఆయన సతీమణి వికారాబాద్ జిల్లా చైర్ పర్సన్ సునీత మహేందర్ రెడ్డి, రంగారెడ్డి జిల్లా చైర్ పర్సన్ అనితా హరినాథ్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డిలు కాంగ్రెస్‌లో చేరారు. వారి బాటలోనే ఎంపీ రంజిత్ రెడ్డి, ఎమ్మెల్యే కాలే యాదయ్యలు కూడా కాంగ్రెస్‌లో చేరితే ఈ జిల్లాలో బీఆరెస్ దాదాపుగా ఖాళీ అయినట్లేనంటున్నారు రాజకీయ విశ్లేషకులు.
సీఎం రేవంత్‌రెడ్డితో భేటీయైన బీఆరెస్ ఎమ్మెల్యే దానం
సీఎం రేవంత్‌రెడ్డితో బీఆరెస్ ఎమ్మెల్యే దానం నాగేందర్ భేటీ అయ్యారు. శుక్రవారం సీఎం రేవంత్‌రెడ్డి నివాసానికి వెళ్లిన దానం నాగేందర్ కాంగ్రెస్‌లో తన చేరికకు సంసిద్ధత తెలిపినట్లుగా సమాచారం. సీఎం రేవంత్‌రెడ్డితో దానం భేటీలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి ఎన్. ఉత్తమ్‌కుమార్‌రెడ్డిలు కూడా ఉన్నారు. గ్రేటర్ హైదరాబాద్‌లో కాంగ్రెస్‌కు ఒక్క ఎమ్మెల్యే కూడా లేకపోవడంతో సీఎం రేవంత్‌రెడ్డి గ్రేటర్ బీఆరెస్ ఎమ్మెల్యేలను కారు దించి కాంగ్రెస్‌లో చేర్చుకునే ప్రయత్నాలు ముమ్మరం చేశారు. తద్వారా బొటాబొటీగా ఉన్న తన ప్రభుత్వ మెజార్టీని కూడా పెంచుకుని అధికారాన్ని మరింత సుస్థిరం చేసుకునే ఆలోచనలో ఉన్నారు.
త్వరలోనే కాంగ్రెస్‌లోకి
దానం నాగేందర్ రెండు మూడురోజుల్లోనే కాంగ్రెస్‌లో చేరనున్నట్లుగా, ఇందుకు సంబంధించి కాంగ్రెస్ పెద్దలతో ఆయన చర్చలు పూర్తయినట్లుగా తెలుస్తుంది. నాగేందర్ అసిఫ్‌నగర్ నుంచి 1994, 1999లో కాంగ్రెస్ ఎమ్మెల్యేగా, 2004లో టీడీపీ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఎన్నికల అనంతరం కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. ఆ తర్వాత వచ్చిన ఉప ఎన్నికల్లో ఓడిపోయారు. 2009లో ఖైరతాబాద్ కాంగ్రెస్ ఎమ్మెల్యేగా గెలిచారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్సార్ ప్రభుత్వంలో ఆయన కార్మిక, ఉద్యోగ కల్పన, శిక్షణ, ఫ్యాక్టరీలు, పారిశ్రామిక శిక్షణా సంస్థలు, ఆరోగ్య శాఖ మంత్రిగా పని చేశారు. 2014లో ఖైరతాబాద్‌లో బీజేపీ అభ్యర్థి చింతల రామచంద్రారెడ్డి చేతిలో ఓడారు. 2018లో బీఆరెస్‌లో చేసి ఖైరతాబాద్‌లో పోటీ చేసి చింతల రామచంద్రారెడ్డిపై గెలిచారు. 2023లో ఖైరతాబాద్ నుంచి మరోసారి బీఆరెస్ ఎమ్మెల్యేగా విజయం సాధించారు.