Meerpet | దళిత బాలికపై సామూహిక లైంగిక దాడి.. ఖండించిన రేవంత్ రెడ్డి, గవర్నర్
Meerpet | గంజాయి బ్యాచ్‌పై చర్యలు తీసుకోవాలని ఆందోళన ఘటనను తీవ్రంగా ఖండించిన రేవంత్ రెడ్డి నేతల అరెస్టు.. ఉద్రిక్తత గవర్నర్ విచారం విధాత: మీర్‌పేట నందనవనంలో దళిత బాలికపై సామూహిక లైంగిక దాడికి పాల్పడిన నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ నందనవనం ప్రధాన రహదారిపై కాంగ్రెస్, బీజేపీ సహా విపక్షాలు, ప్రజాసంఘాల ఆధ్వర్యంలో స్థానికులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా పెద్ద ఎత్తున ట్రాఫిక్ స్తంభించింది. నందనవనంలోని ఇందిరమ్మ కాలనీలో అసాంఘిక కార్యకలాపాలు, […]

Meerpet |
- గంజాయి బ్యాచ్‌పై చర్యలు తీసుకోవాలని ఆందోళన
- ఘటనను తీవ్రంగా ఖండించిన రేవంత్ రెడ్డి
- నేతల అరెస్టు.. ఉద్రిక్తత
- గవర్నర్ విచారం
విధాత: మీర్‌పేట నందనవనంలో దళిత బాలికపై సామూహిక లైంగిక దాడికి పాల్పడిన నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ నందనవనం ప్రధాన రహదారిపై కాంగ్రెస్, బీజేపీ సహా విపక్షాలు, ప్రజాసంఘాల ఆధ్వర్యంలో స్థానికులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా పెద్ద ఎత్తున ట్రాఫిక్ స్తంభించింది. నందనవనంలోని ఇందిరమ్మ కాలనీలో అసాంఘిక కార్యకలాపాలు, డ్రగ్స్, గంజాయి విక్రయాలు సాగుతున్నాయని ఆరోపించారు.
పోలీసులు ప్రతిపక్ష పార్టీల నాయకులను అరెస్టు చేసే క్రమంలో తోపులాటతో కొంత ఉద్రిక్తత నెలకొంది. అరెస్టు చేసిన కాంగ్రెస్ నాయకులను పోలీసులు సమీప పోలీస్ స్టేషన్‌లకు తరలించారు. మేయర్ పారిజాత రెడ్డి, అధికార ప్రతినిధి బొజ్జ సంధ్యారెడ్డి తదితరులను పోలీసులు అరెస్ట్ చేశారు. గంజాయి బ్యాచ్ చేతిలో లైంగిక దాడికి గురైన బాలికను పోలీసులు ఆసుపత్రికి తరలించారు.
కాగా.. ఎనిమిది మంది నిందితుల్లో మహేశ్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని మిగతా వారి కోసం గాలిస్తున్నామని ఎల్బీనగర్ డిసీపీ సాయిశ్రీ తెలిపారు. నిందితులంతా స్థానికులేనని, కేసులో రౌడిషీటర్ ఆబేద్ లాల్ పై అనుమానం ఉందన్నారు.బాలిక స్టేట్‌మెంట్ మేరకు ముగ్గురు మాత్రమే దాడికి పాల్పడ్డారని, ఈ ప్రాంతంలో గంజాయి అరికట్టేందుకు చర్యలు చేపడుతామన్నారు. ముందు జాగ్రత్త చర్యగా మీర్‌పేటలో పోలీస్ పికెట్ ఏర్పాటు చేశామన్నారు.
విశ్వనగరం మత్తుపదార్ధాలకు అడ్డాగా మారింది
మీర్ పేటలో బాలికపై గంజాయి బ్యాచ్ లైంగిక దాడిని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తీవ్రంగా ఖండిస్తు ట్వీట్ చేశారు. విశ్వనగరం చేశానని సీఎం కేసీఆర్ గప్పాలు కొట్టే మన హైదరాబాద్ బీఆర్ఎస్ పాలనలో గంజాయికి, మత్తు పదార్థాలకు అడ్డాగా మారిందన్నారు.
నిన్న సింగరేణి కాలనీలో, నేడు మీర్ పేటలో ఆడబిడ్డలపై అఘాయిత్యాల కలచివేస్తున్నాయన్నారు. పోలీసు వ్యవస్థను రాజకీయ ప్రయోజనాలకు వాడుకుంటున్న బీఆరెస్ ప్రభుత్వం ప్రజల మానప్రాణాలను గాలికి వదిలేశారని విమర్శించారు. ఇలాంటి పాలన పై “తిరగబడదాం – తరిమికొడదాం” అని పిలుపునిచ్చారు.
గవర్నర్ విచారం
మీర్‌పేటలో బాలికపై లైంగిక దాడి ఘటనపై గవర్నర్ తమిళ సై విచారం వ్యక్తం చేశారు. బాధితురాలికి మెరుగైన చికిత్స అందించాలని, ఘటనపై 48గంటల్లో నివేదిక ఇవ్వాలని సీఎస్, డీజీపి, రాచకొండ సీపీకి ఆదేశాలిచ్చారు.