Congress | రైతుల కోసం.. ఐదు హామీలు: కమల్‌నాథ్‌

Congress మధ్యప్రదేశ్‌ కాంగ్రెస్‌ ప్రకటన ఇన్‌పుట్‌ ఖర్చులు తగ్గించేందుకు క్రిషక్‌ న్యాయ్‌ యోజన తెస్తాం మాజీ సీఎం కమల్‌నాథ్‌ ప్రకటన భోపాల్‌: మధ్యప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధమవుతున్న కాంగ్రెస్‌.. ఐదు ప్రధాన అంశాలను హామీలుగా ముందుకు తెచ్చింది. రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, పీసీసీ చీఫ్‌ కమల్‌నాథ్‌ బుధవారం మీడియాతో మాట్లాడుతూ తాజా హామీలను వెల్లడించారు. నాలుగు నెలల తర్వాత ఏర్పడబోయే కాంగ్రెస్‌ ప్రభుత్వం.. రైతులకు ఇన్‌పుట్‌ ఖర్చులను తగ్గించేలా ‘క్రిషక్‌ న్యాయ్‌ యోజన’ తీసుకురానున్నట్టు ప్రకటించారు. ఈ […]

Congress | రైతుల కోసం.. ఐదు హామీలు: కమల్‌నాథ్‌

Congress

  • మధ్యప్రదేశ్‌ కాంగ్రెస్‌ ప్రకటన
  • ఇన్‌పుట్‌ ఖర్చులు తగ్గించేందుకు
  • క్రిషక్‌ న్యాయ్‌ యోజన తెస్తాం
  • మాజీ సీఎం కమల్‌నాథ్‌ ప్రకటన

భోపాల్‌: మధ్యప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధమవుతున్న కాంగ్రెస్‌.. ఐదు ప్రధాన అంశాలను హామీలుగా ముందుకు తెచ్చింది. రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, పీసీసీ చీఫ్‌ కమల్‌నాథ్‌ బుధవారం మీడియాతో మాట్లాడుతూ తాజా హామీలను వెల్లడించారు. నాలుగు నెలల తర్వాత ఏర్పడబోయే కాంగ్రెస్‌ ప్రభుత్వం.. రైతులకు ఇన్‌పుట్‌ ఖర్చులను తగ్గించేలా ‘క్రిషక్‌ న్యాయ్‌ యోజన’ తీసుకురానున్నట్టు ప్రకటించారు.

ఈ పథకంలో 37 లక్షల మంది రైతులకు లబ్ధి కలిగేలా 5 హెచ్‌పీ వ్యవసాయ బోర్లకు ఉచిత విద్యుత్తు, పాత వ్యవసాయ విద్యుత్తు బకాయిల రద్దు, వ్యవసాయానికి 12 గంటల నిరంతరాయ సరఫరా, వివిధ ఆందోళనల్లో రైతులపై ప్రస్తుత ప్రభుత్వం పెట్టిన కేసుల ఎత్తివేతతోపాటు.. వ్యవసాయ రుణాల మాఫీ కొనసాగింపు భాగంగా ఉంటాయని తెలిపారు.

రాష్ట్రంలోని బీజేపీ ప్రభుత్వం వ్యవసాయ రుణాలపై వడ్డీని మాత్రమే మాఫీ చేస్తామని ప్రకటించిందన్న కమల్‌నాథ్‌.. అది పాక్షిక ఉపశమనమే అవుతుందని చెప్పారు. తీసుకున్న అప్పుపై వడ్డీ అలా కొనసాగుతూనే ఉంటుందని అన్నారు. అందుకే తాము రుణామాఫీ పూర్తిస్థాయిలో చేస్తామని తెలిపారు. 70శాతం రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ వ్యవసాయం పైనే అధారపడి ఉన్నదని చెప్పారు. వ్యవసాయం కుదేలైతే.. మొత్తం రాష్ట్ర ఆర్థిక వ్యవస్థపై పెను ప్రభావం పడుతుందని అన్నారు.

రైతుల ఆదాయాన్ని పెంచితే ఇక వారు అప్పులు ఊబిలో చిక్కుకునే అవకాశం ఎక్కడుంటుందని ప్రశ్నించారు. రైతుల ఆదాయం రెట్టింపు అయిందని ప్రధాని సమక్షంలో ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌ అబద్ధాలు చెప్పారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కానీ అదే మోదీ ప్రభుత్వంలోని పార్లమెంటరీ కమిటీ.. గత ఏడాది డిసెంబర్‌లో విడుదల చేసిన నివేదికను గమనిస్తే.. రైతుల ఆదాయం గణనీయంగా తగ్గిపోయిన నాలుగు రాష్ట్రాల్లో మధ్యప్రదేశ్‌ కూడా ఉన్నదని చెప్పారు.

ఇప్పుడు అనేక హామీలు గుప్పిస్తున్న ముఖ్యమంత్రి.. గడిచిన ఐదేళ్లలో ఇచ్చిన హామీలను ఎందుకు అమలు చేయలేదని ప్రశ్నించారు. పెద్ద ఎత్తున ఇన్వెస్టర్ల సమ్మిట్‌ ఏర్పాటు చేసిన ప్రభుత్వం.. 33 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చినట్టు ప్రకటించిందని, కానీ.. వాటిలో కనీసం ఐదు శాతానికి కూడా ఒప్పందాలు కుదరలేదని ఎద్దేవాచేశారు.

ఇన్వెస్టర్లలో నమ్మకం కుదకపోవడం వల్లే పెట్టుబడులు రాలేదని చెప్పారు. పెట్టుబడులను ఆకర్షించాలేగానీ.. డిమాండ్‌ చేయలేమని అన్నారు. ప్రభుత్వంపై నమ్మకం ఉంటేనే పెట్టుబడులు వస్తాయని తెలిపారు.