Congress Vs Bjp: వరంగల్‌లో కాంగ్రెస్ Vs బీజేపీ క్రెడిట్ వార్! మామునూరు ఎయిర్ పోర్టు క్రెడిట్ కోసం ఫైట్

- మోడీకి పూలాభిషేకం చేసిన బీజేపీ
- రేవంత్ రెడ్డికి పాలాభిషేకం చేసిన కాంగ్రెస్
విధాత, వరంగల్: మామునూరు ఎయిర్ పోర్టు (Mamoonuru Airport) పునరుద్ధరణ కోసం కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చిన నేపథ్యంలో బిజెపి, కాంగ్రెస్ మధ్య క్రెడిట్ వార్ నెలకొంది. క్రెడిట్ కోసం ఇరు పార్టీల శ్రేణులు శనివారం పోటాపోటీగా చేసిన కార్యక్రమాలు గొడవకు దారి తీసింది. పోలీసులు ఇరుపక్షాలను శాంతింప జేశారు. వరంగల్ ఎయిర్ పోర్టు పునరుద్ధరణకి కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసినందుకు బీజేపీ శ్రేణులు మోడీకి పూలాభిషేకం చేసేందుకు మామునూరు ఎయిర్ పోర్టు వద్దకు చేరుకున్నారు. ఇదే సమయంలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఎంపీ కడియం కావ్య, ఎమ్మెల్యే నాగరాజుల చిత్రపటాలకు పాలాభిషేకం చేసేందుకు అక్కడికి చేరుకున్నారు.
ఇరువర్గాలు ఒకేసారి చేరుకోవడంతో పరస్పరం నినాదాలు, జిందాబాద్ లు చేసుకోవడంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఒకరి నొకరు నెట్టేసుకోవడంతో ఇరువర్గాల మధ్య గొడవ జరిగింది. పరిస్థితిని గమనించిన స్థానిక పోలీసులు కాంగ్రెస్ బీజేపీ శ్రేణులను వేరుచేసి శాంతింపజేశారు. దీంతో సమస్య కాస్త సద్దుమణిగింది. బీజేపీ కృషి వాళ్లే ఎయిర్ పోర్టును పునరుద్ధరించారని ఆ పార్టీ నాయకులు చెబుతుండగా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ వహించి ఎయిర్ పోర్టు నిర్మాణానికి భూమి, నిధులు కేటాయించడం ఫలితంగా ఎయిర్పోర్టు పునరుద్ధరణకు కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తుందని కాంగ్రెస్ నాయకులు చెబుతూ నాయకులు పరస్పరం పోటీ పడుతున్నారు.