పొత్తుపై కాంగ్రెస్‌కు సీపీఎం అల్టిమేటం.. ఆ రెండు సీట్లు ఇస్తేనే..
మిర్యాల గూడ, వైరా స్థానాలకు తమకు కేటాయిస్తేనే కాంగ్రెస్‌తో పొత్తు ఉంటుందని తమ్మినేని వీరభద్రం కాంగ్రెస్ పార్టీకి అల్టిమేటమ్ జారీ చేశారు.

- పొత్తుపై కాంగ్రెస్‌కు సీపీఎం అల్టిమేటం.. ఆ రెండు సీట్లు ఇస్తేనే..
- కాంగ్రెస్‌కు సీపీఎం అల్టిమేటమ్
- రెండ్రో జుల గడువిచ్చిన తమ్మినేని
విధాత: మిర్యాల గూడ, వైరా స్థానాలకు తమకు కేటాయిస్తేనే కాంగ్రెస్‌తో పొత్తు ఉంటుందని, లేకుంటే ఎవరి దారి వారిదేనని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం కాంగ్రెస్ పార్టీకి అల్టిమేటమ్ జారీ చేశారు.ఈ మేరకు రెండు రోజులు గడువు ఇస్తున్నామని తెలిపారు. నవంబర్ 2వ తేదీన పార్టీ స్టేట్ సెక్రటేరియట్ సమావేశం ఉంటుందని, ఆ మరుసటి రోజు రాష్ట్ర కమిటీ సమావేశం ఉందని, ఈ సమావేశానికి పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు కూడా హజరవుతున్నారని తెలిపారు. ఈ సమావేశాల సమయానికి పొత్తులపై కాంగ్రెస్ పార్టీ తేల్చాలన్నారు. లేదంటే ఈ సమావేశాల్లో తమ పార్టీ ఏ స్థానాల్లో పోటీ చేయాలో నిర్ణయం తీసుకొని ఒంటరిగా పోటీ చేస్తామని వెల్లడించారు.
మరో వైపు తమ పార్టీ నాయకులు టికెట్ ఇవ్వకపోతే ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తామని అంటున్నారని కాంగ్రెస్ నేతలు చెపుతున్నారని, తమకు కేటాయించిన సీట్లలో పొత్తు ధర్మానికి కట్టుబడి తమ నాయకులు ఇండిపెండెంట్‌గా పోటీ చేయకుండా చూడాల్సిన బాధ్యత కూడా కాంగ్రెస్ నాయకత్వానిదేనని అన్నారు. పొత్తుల ప్రతిపాదనపై కాంగ్రెస్ పార్టీనే తమతో అప్రోచ్ అయిందని అన్నారు. ఆనాడు తాము భద్రాచలం, మిర్యాలగూడ, పాలేరు, మధిర, ఇబ్రహీంపట్నం స్థానాలను కోరామన్నారు.
అయితే భద్రాచలం సిట్టింగ్ ఎమ్మల్యే కాబట్టి ఇవ్వలేమన్నారు. దీనికి అంగీకరించి, పాలేరు ఇవ్వమని కోరామన్నారు. మిర్యాలగూడతో పాటు పాలేరు ఇస్తామని చెప్పి వారు అభ్యర్థిని ప్రకటించుకొని, వైరా ఇస్తామని చెప్పారన్నారు. చివరకు ఆదివారం ఉదయం భట్టి విక్రమార్క ఫోన్ చేసి వైరా కూడా ఇవ్వలేమని, హైదరాబాద్‌లో ఏదో ఒక సీటు ఇస్తామని చెప్పారన్నారు. తమకు వైరా ఇస్తామని అంగీకరించలేదన్నారు. దీంతో పునరాలోచనలో పడ్డామన్నారు. అందుకే మిర్యాలగూడతో పాటు చివరకు వైరా సీటు ఇస్తేనే పొత్తు ఉంటుందని, తేల్చుకోవాల్సింది కాంగ్రెస్ పార్టీనే అని తమ్మినేని వీరభద్రం తేల్చి చెప్పారు.