Dharani Adalat । ధరణి అదాలత్‌పై దామోదర అలక.. అంతర్యమేమిటో!

తనకు సమాచారం లేదని అసంతృప్తి అధిష్ఠానానికి ఫిర్యాదు చేసే యోచన హైకమాండ్‌ నుంచి అనుమతి లేనిదే రాష్ట్రంలో ధరణి అదాలత్‌ నిర్వహిస్తారా? రాజనర్సింహ అలక వెనుక మతలబేంటి? విధాత: కాంగ్రెస్‌ పార్టీ (Congress Party) లో ప్రజాస్వామ్యం కాస్త ఎక్కువేనన్న విషయం అందరికీ తెలిసిందే. ఎంత పెద్ద నేత అయినా సరే ఒక విధాన పరమైన నిర్ణయాన్ని ప్రకటించే ముందు అధిష్ఠానం అనుమతి తీసుకోనిదే చేయరని పార్టీ నేతలు చెబుతుంటారు. అయితే.. అధిష్ఠానం అభిప్రాయం మేరకు వెలువడిన […]

Dharani Adalat । ధరణి అదాలత్‌పై దామోదర అలక.. అంతర్యమేమిటో!
  • తనకు సమాచారం లేదని అసంతృప్తి
  • అధిష్ఠానానికి ఫిర్యాదు చేసే యోచన
  • హైకమాండ్‌ నుంచి అనుమతి లేనిదే
  • రాష్ట్రంలో ధరణి అదాలత్‌ నిర్వహిస్తారా?
  • రాజనర్సింహ అలక వెనుక మతలబేంటి?

విధాత: కాంగ్రెస్‌ పార్టీ (Congress Party) లో ప్రజాస్వామ్యం కాస్త ఎక్కువేనన్న విషయం అందరికీ తెలిసిందే. ఎంత పెద్ద నేత అయినా సరే ఒక విధాన పరమైన నిర్ణయాన్ని ప్రకటించే ముందు అధిష్ఠానం అనుమతి తీసుకోనిదే చేయరని పార్టీ నేతలు చెబుతుంటారు. అయితే.. అధిష్ఠానం అభిప్రాయం మేరకు వెలువడిన నిర్ణయాల్లోనూ తప్పులు వెతికి.. అదే అధిష్ఠానానికి ఫిర్యాదు చేసేవారూ కాంగ్రెస్‌లో ఉంటారు.

అందుకు దామోదర రాజనర్సింహ (Damodara Rajanarsimha) నిదర్శనంగా నిలుస్తున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. తనకు తెలియకుండా ఈ కార్యక్రమం చేపట్టారనే అసంతృప్తిలో ఉన్న రాజ నర్సింహ తన ప్రస్తుత ఢిల్లీ పర్యటనలో ఈ అంశంపై అధిష్ఠానంతో చర్చిస్తారని తెలుస్తున్నది.

ధరణిపై స్పష్టతతో కాంగ్రెస్‌

అనేక అసంతృప్తులు, వ్యతిరేకతల మధ్య పీసీసీ పీఠం ఎక్కిన రేవంత్‌రెడ్డి.. (Revanth Reddy) పార్టీని రాష్ట్రంలో అధికారంలోకి తీసుకొస్తానని చెబుతున్నారు. ఈ బాధ్యతను అధిష్ఠానమే ఆయనకు అప్పగించదనే ప్రచారమూ ఉన్నది. రేవంత్‌ పీసీసీ అధ్యక్షుడు అయిన తర్వాత వరంగల్‌లో భారీ బహిరంగ సభ నిర్వహించారు.

ఈ సభకు రాహుల్‌ గాంధీ హాజరయ్యారు. ఆ రోజు వెలువరించిన వరంగల్‌ డిక్లరేషన్‌ (Warangal Declaration)లో తమ పార్టీ అధికారంలోకి రాగానే ధరణిని రద్దు చేస్తామని ప్రకటించారు. ధరణి సమస్యలపై రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమించాలని పార్టీ నేతలకు రాహుల్‌ దిశానిర్దేశం కూడా చేశారు.

అధిష్ఠానం అనుమతితో ధరణి అదాలత్‌లు

రాహుల్‌ ఆదేశాల మేరకు రాష్ర్టంలో ధరణి సమస్యలపై కాంగ్రెస్‌ పార్టీ వివిధ రకాల ఆందోళనలు చేపట్టింది. ఇదే సమయంలో అధిష్ఠానం ఆదేశాల మేరకు రేవంత్‌రెడ్డి పాదయాత్ర మొదలు పెట్టారు. రేవంత్‌ పాదయాత్రలో ప్రతి గ్రామంలో ధరణి సమస్యలపై ఫిర్యాదులనేకం వస్తున్నాయి. దీంతో రేవంత్‌రెడ్డి ఈ విషయాన్ని అధిష్ఠానం దృష్టికి తీసుకువెళ్లారు. ఈ సమస్యలపై ధరణి అదాలత్‌లు నిర్వహిస్తామని చెప్పగా అధిష్ఠానం కూడా సమ్మతి తెలియజేసింది.

ఈ నేపథ్యంలో గత శుక్రవారం పెద్దపల్లి జిల్లా సుల్తాన్‌పూర్‌లో కాంగ్రెస్‌ పార్టీ ధరణి అదాలత్‌ నిర్వహించింది. ఈ కార్యక్రమానికి ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మాణిక్‌రావు ఠాక్రేతో పాటు, ఏఐసీసీ సీనియర్‌ నేత జైరాం రమేశ్‌, కొప్పుల రాజు, సీఎల్‌పీ నేత మల్లు భట్టి విక్రమార్క, సీనియర్‌ నేతలు శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్‌, సిరిసిల్ల రాజయ్య, మహేశ్‌కుమార్‌ గౌడ్‌ తదితరులంతా పాల్గొన్నారు. ఆ తరువాత గాంధీ భవన్‌ వేదికగా జైరామ్‌ రమేశ్‌ ప్రెస్‌మీట్‌ పెట్టి మరీ రాష్ర్ట వ్యాప్తంగా ధరణి అదాలత్‌లు నిర్వహిస్తామని ప్రకటించారు.

ధరణి అదాలత్‌లు ప్రకటించిన తరువాత…

ధరణిపై రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో అదాలత్‌లు నిర్వహిస్తామని ప్రకటించిన తరువాత కాంగ్రెస్‌ పార్టీలో వ్యతిరేకత మొదలైంది. ధరణి అదాలత్‌ల నిర్వహణపై తనకు సమాచారం లేదని మాజీ డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ అలకబూనారు. ఈ విషయంలో ఢిల్లీలో పార్టీ పెద్దలను కలిసి చర్చించాలని ఆయన అనుకుంటున్నారని సమాచారం.

వాస్తవానికి ధరణి అదాలత్‌లతో రైతాంగంలో పార్టీ పట్ల కొంత సానుకూల వాతావరణ ఏర్పడిందని నేతలు చెబుతున్నారు. ఈ వాతావరణాన్ని చెడగొట్టాలనే ఉద్దేశాలు ఎవరికైనా ఉన్నాయా? అనే అనుమానాన్ని పలువురు నాయకులు వ్యక్తం చేస్తున్నారు. దీని వెనుక అధికార పార్టీ నేతల ప్రోద్బలం ఏమైనా ఉన్నదా? అనే సందేహాలు కూడా కాంగ్రెస్‌ నేతల్లో వెలువడుతున్నాయి.