ఎలక్టోరల్ బాండ్ల వెల్లడి విషయంలో కోర్టు ఉల్లంఘన కేసు పెట్టిన ఎన్జీవో
ఎలక్టోరల్ బాండ్లు సమర్పించాల్సిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ)పై అసోసియేషన్ ఆఫ్ డెమోక్రటిక్ రైట్స్ స్వచ్ఛంద సంస్థ కోర్టు దాఖలు చేసిన కోర్టు ఉల్లంఘన పిటిషన్‌ను సుప్రీంకోర్టు 07-03-2024న విచారణకు స్వీకరించింది

న్యూఢిల్లీ : ఎలక్టోరల్ బాండ్లు సమర్పించాల్సిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ)పై అసోసియేషన్ ఆఫ్ డెమోక్రటిక్ రైట్స్ స్వచ్ఛంద సంస్థ కోర్టు దాఖలు చేసిన కోర్టు ఉల్లంఘన పిటిషన్‌ను సుప్రీంకోర్టు 07-03-2024న విచారణకు స్వీకరించింది. ఈ పిటిషన్‌ను ఏడీఆర్ తరఫున ప్రముఖ లాయర్లు ప్రశాంత్ భూషణ్ దాఖలు చేశారు. రాజకీయ పార్టీలు ఎన్‌క్యాష్ చేసుకున్న ఎలక్టోరల్ బాండ్ల వివరాలను అందించేందుకు 2024 జూన్ 30 వరకు గడువు కావాలని ఎస్‌బీఐ పెట్టుకున్న పిటిషన్‌ను ఏడీఆర్ సవాలు చేసింది.దీనిని విచారణకు స్వీకరిస్తున్నట్టు ప్రకటించిన చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం.. ఈ మేరకు ఒక ఈమెయిల్ విజ్ఞప్తిని పంపాలని, ఈ పిటిషన్‌ను 2024, మార్చి 11న విచారిస్తామని తెలిపింది.
ఎలక్టోరల్ బాండ్స్ వెల్లడికి సుప్రీంకోర్టు విధించిన గడువు బుధవారంతో ముగిసింది. 2018లో తీసుకొచ్చిన ఎలక్టోరల్ బాండ్ల విధానాన్ని ఐదుగురు సభ్యుల సుప్రీంకోర్టు బెంచ్ కొట్టేసిన సంగతి తెలిసిందే. గుర్తు తెలియని వ్యక్తుల ద్వారా రాజకీయ పార్టీలకు పెద్ద మొత్తంలో దీనితో నిధులు అందుతున్నాయని పేర్కొంటూ దీనిని రాజ్యాంగ వ్యతిరేకమని తీర్పు చెప్పింది. ఎస్‌బీఐ కోరినట్టుగా ఎలక్టోరల్ బాండ్ల వివరాల వెల్లడికి జూన్ 30 వరకూ గడువు పొడిగించితే.. రాజకీయ పార్టీలకు అందిన నిధుల వివరాలు లోక్‌సభ ఎన్నికలు పూర్తయ్యేంత వరకూ రహస్యంగానే ఉండిపోతాయని ఏడీఆర్ ఆందోళన వ్యక్తం చేసింది.