Elon Musk’s Neuralink | మెదడులో చిప్‌.. ఇకపై చేయి అవసరం లేకుండానే స్మార్ట్‌ ఫోన్‌ వాడొచ్చు..

Elon Musk's Neuralink | ఎలాన్‌ మస్క్‌ ప్రయత్నాలకు ఎఫ్‌డీఏ ఆమోదం త్వరలో అద్భుతాలు సృష్ఠించనున్న న్యూరా లింక్‌ పక్షపాతం వంటి వ్యాధులతో బాధ పడే వారికి గ్రేట్‌ న్యూస్‌ మనసులో వచ్చిన ఆలోచనలని ఎదుటివాళ్లతో మాటల ద్వారా పంచుకుంటాం. కానీ మనసులో పుట్టిన తలంపు మాత్రంగా అవతలివాళ్లతో కమ్యూనికేట్‌ చేయగలిగితే…? మనసులో ఆలోచనలే యంత్రాలను కంట్రోల్‌ చేయగలిగితే…? కాళ్లూ చేతులూ కదిలించకుండానే.. వస్తువులను ఆపరేట్‌ చేయగలిగితే…? చేతి వేళ్ల అవసరం లేకుండానే స్మార్ట్‌ ఫోన్‌ ఉపయోగించగలిగితే…? […]

  • By: krs    latest    Jun 01, 2023 12:35 AM IST
Elon Musk’s Neuralink | మెదడులో చిప్‌.. ఇకపై చేయి అవసరం లేకుండానే స్మార్ట్‌ ఫోన్‌ వాడొచ్చు..

Elon Musk’s Neuralink |

  • ఎలాన్‌ మస్క్‌ ప్రయత్నాలకు ఎఫ్‌డీఏ ఆమోదం
  • త్వరలో అద్భుతాలు సృష్ఠించనున్న న్యూరా లింక్‌
  • పక్షపాతం వంటి వ్యాధులతో బాధ పడే వారికి గ్రేట్‌ న్యూస్‌

మనసులో వచ్చిన ఆలోచనలని ఎదుటివాళ్లతో మాటల ద్వారా పంచుకుంటాం. కానీ మనసులో పుట్టిన తలంపు మాత్రంగా అవతలివాళ్లతో కమ్యూనికేట్‌ చేయగలిగితే…?
మనసులో ఆలోచనలే యంత్రాలను కంట్రోల్‌ చేయగలిగితే…?
కాళ్లూ చేతులూ కదిలించకుండానే.. వస్తువులను ఆపరేట్‌ చేయగలిగితే…?
చేతి వేళ్ల అవసరం లేకుండానే స్మార్ట్‌ ఫోన్‌ ఉపయోగించగలిగితే…?
ఇదేదో సైన్స్‌ ఫిక్షన్‌ సినిమా లాగా అనిపిస్తోంది కదా.

కానీ అలాంటి అద్భుత ప్రపంచం త్వరలోనే మన ముందు ఆవిష్కృతం కాబోతోంది. మానవ మెదడుకూ, సాంకేతికతకూ మధ్య అడ్డుగోడలు పూర్తిగా తొలగిపోనున్నాయి. మన మెదడు, సాంకేతిక పరిజ్ఞానం అనుసంధానమై అసాధ్యమైన విషయాలకు బాటలు వేయబోతున్నది. ఇందుకు పునాది న్యూరా లింక్‌ మైండ్‌ చిప్‌ రూపంలో పడింది.

విధాత: మన మెదడులో ఇంప్లాంట్‌ చేయగలిగిన అతి చిన్న కంప్యూటర్‌ చిప్‌ న్యూరాలింక్‌ కు ఇటీవలే ఎఫ్‌డిఎ ఆమోదం లభించింది. ఈ టెక్నాలజీని జంతువుల్లో అధ్యయనం చేసి సక్సెస్‌ అయ్యారు. ఇప్పుడు హ్యూమన్‌ క్లినికల్‌ ట్రయల్స్‌ కోసం దీనికి ఎఫ్‌డిఎ ఆమోదం లభించింది.

మెదడులో చిప్ అమర్చిన కోతులు.. చేతులు ఉపయోగించకుండా బేసిక్ వీడియో గేమ్స్ ఆడడం, స్క్రీన్ పై కర్సర్ ను కదిలించడం ఆ వీడియోలో కనిపించింది. దీని వెనుక ఉన్న విజనరీ ఎలాన్‌ మస్క్‌. మన ముందుకు తీసుకువచ్చిన కంపెనీ టెస్లా అండ్‌ స్పేస్‌ ఎక్స్‌. ఈ అపురూపమైన బ్రెయిన్‌ చిప్‌ టెక్నాలజీ త్వరలోనే అద్భుతాలు సృష్టించనున్నది.

న్యూరా లింక్‌ అంటే..?

మన మెదడులో విద్యుదయస్కాంత తరంగాలు ఉంటాయి. వీటి ద్వారా వచ్చే ఎలక్ట్రిక్‌ సిగ్నల్స్‌ ద్వారానే మన శరీరంలోని ఇతర భాగాల కదలికలు, పనితీరును మన మెదడు కంట్రోల్‌ చేస్తూ ఉంటుంది. న్యూరాలింక్‌ అతి చిన్న కంప్యూటర్‌ చిప్‌. దీన్ని మానవ మెదడులో అమరుస్తారు. ఇది మన మెదడు లాగానే ఎలక్ట్రిక్‌ తరంగాల ద్వారా పనిచేస్తుంది. ఇది మన ఆలోచనలు, డిజిటల్‌ ప్రపంచం మధ్య వారధిగా ఉంటుంది.

ఇది ఎందుకు?

మన మెదడే సర్వశక్తిమంతమైన కంప్యూటర్‌ గా చెబుతుంటారు. అలాంటి హ్యూమన్‌ బ్రెయిన్‌ ని కంప్యూటర్లతో ఎందుకు అనుసంధానించాలి.. అనేదే పెద్ద ప్రశ్న. ఎలోన్‌ మస్క్‌ మన మెదడు కు ఉన్న పరిమితులను తొలగించాలనుకున్నాడు. బ్రెయిన్‌ ని కంప్యూటర్లకు కనెక్ట్‌ చేయడం ద్వారా మానవ మేధస్సు మరింత విస్తారం అయ్యేందుకు ఆస్కారం ఉంది.

ఒక్క మాటలో చెప్పాలంటే మన ఇంటెలిజెన్సీ స్థాయిని మరో మెట్టు పైకి పంపించడమన్నమాట. అంటే టెక్నాలజీతో నడిచే కంప్యూటర్‌ ఎంత వేగంగా పనిచేస్తుందో మన బ్రెయిన్‌ కూడా అంత వేగంగా పనిచేయగలుగుతుందన్నమాట. అత్యంత వేగంగా కొత్త విషయాలను నేర్చుకోవడం, తక్షణమే సమాచారాన్ని అందుబాటులో ఉంచుకోగలగడం దీనివల్ల సాధ్యమవుతుంది.

అన్నింటి కన్నా ఆసక్తికరమైన అంశం ఏంటంటే, మన ఆలోచనల ద్వారానే కమ్యూనికేట్‌ చేయగలుగుతాం. టెక్నాలజీకి, మానవ మెదడుకు మధ్య ఒక సింబయోటిక్‌ (సహజీవన) రిలేషన్‌ షిప్‌ ను సృష్టించడం ద్వారా మెదడు సామర్థ్యాన్ని పూర్తిగా మేల్కొల్పవచ్చు.

మనిషి ఇంటెలిజెన్సీ, ఆర్టిఫిషియల్‌ ఇంటలిజెన్సీ కలిసికట్టుగా పనిచేయడానికి న్యూరాలింక్‌ బాటలు వేస్తుంది. ఆల్గారిథమ్స్‌, హార్డ్‌ వేర్‌ ఇంప్రూవ్‌ అయిన కొద్దీ డిజిటల్‌ ఇంటలిజెన్సీ బయలాజికల్‌ ఇంటలిజెన్సీని మించిపోతుందని అయిదేళ్ల క్రితం మస్క్‌ చెప్పారు. ఇప్పుడది న్యూరాలింక్‌ రూపంలో కనిపిస్తున్నది.

చిప్‌ ఎలా పనిచేస్తుంది?

ఈ న్యూరాలింక్‌ చిప్‌ మన ఆలోచనలను డిజిటల్‌ ప్రపంచంతో కనెక్ట్‌ చేస్తుంది. ఇందుకోసం ఒక చిన్న ప్రొసిజర్‌ ద్వారా మన మెదడులోకి ఈ చిన్న చిప్‌ ను అమరుస్తారు. ఈ చిప్‌ లో ఎలక్ట్రోడ్స్‌ ఉంటాయి. ఇవి మన మెదడులోని నాడీ కణాల నుంచి వచ్చే విద్యుత్‌ సంకేతాలను సెన్స్‌ చేస్తాయి. ఈ విద్యుత్‌ సంకేతాల ద్వారానే మెదడు కమ్యూనికేట్‌ చేస్తుంది.

మెదడులో అమర్చిన న్యూరాలింక్‌ చిప్‌ ఈ విద్యుత్‌ సంకేతాల మెసేజ్‌ లను చదివి, వాటిని కంప్యూటర్‌ కు పంపిస్తుంది. మన శరీరానికి బయట ఉండే వాటిని కంట్రోల్‌ చేయడానికి కంప్యూటర్‌ ఈ మెసేజ్‌ లను ఉపయోగిస్తుంది. న్యూరాలింక్‌ కు బ్రెయిన్‌ కనెక్ట్‌ అయి వున్న ఇతర వ్యక్తులతో మీరు ఈ విధానం ద్వారా మాట్లాడవచ్చు.

ఒక్క మాటలో చెప్పాలంటే మన మెదడు, కంప్యూటర్‌ ఒకదానితో ఒకటి మాట్లాడుకుంటాయన్నమాట. మన మెదడు చెప్పిన దాన్ని కంప్యూటర్‌ గ్రహించి, దాన్ని ఇంకో వ్యక్తి మెదడులో ఉన్న చిప్‌ కి పంపిస్తుంది. ఆ చిప్‌ ద్వారా మన మనసులోని ఆలోచన, మనం మాట్లాడాలనుకన్న విషయం ఆ వ్యక్తి గ్రహిస్తాడన్నమాట.

వ్యాధుల చికిత్సలో..

ఈ న్యూరాలింక్‌ చిప్‌ కొన్ని రకాల న్యూరలాజికల్‌ వ్యాధుల చికిత్సలో కూడా ఉపయోగపడుతుందని సైంటిస్టులు భావిస్తున్నారు. పక్షవాతం, అల్జీమర్స్‌ వ్యాధి వంటి వాటికి ఈ టెక్నాలజీ ద్వారా మంచి పరిష్కారం చూపించవచ్చని ఆశిస్తున్నారు. చిప్ ను అమర్చడం ద్వారా మనుషుల్లో దృష్టి లోపాన్ని నివారించే దిశగా, పక్షవాతం వంటి సమస్యల కారణంగా కదలికలు కోల్పోయిన వారిలో మళ్లీ కదలికలు తీసుకువచ్చే దిశగా పరిశోధనలు విజయవంతంగా సాగుతున్నాయి.

వివిధ కారణాల వల్ల డిజబిలిటీస్‌ కి లోనైన వాళ్లలో కోల్పోయిన కదలికలను తిరిగి తెప్పించగలమని అనుకుంటున్నారు. 2021లో ఎలెన్‌ మస్క్‌ న్యూరాలింక్‌ గురించి ప్రస్తావిస్తూ, ‘‘ఆరోగ్యవంతుడైన సాధారణ వ్యక్తి స్మార్ట్‌ ఫోన్‌ ని తన వేళ్లతో ఎంత వేగంగా ఉపయోగించగలడో, పక్షవాతం వచ్చిన వ్యక్తి న్యూరాలింక్‌ సహాయంతో అంతకన్నా వేగంగా తన మెదడు ద్వారా ఫోన్‌ ని వినియోగించగలడ’’ని ట్వీట్‌ చేశారు. ఆరోజు తొందరలోనే ఉందని ఆశిద్దాం.