ఏటూరు నాగారం ఏజెన్సీ స్నేహితుల అలాయి బలాయి

ఏటూరు నాగారం  ఏజెన్సీ స్నేహితుల అలాయి బలాయి

విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: వరంగల్ నగరానికి ఎక్కడో 120 కిలోమీటర్ల దూరంలో ఎలాంటి సౌకర్యాలు లేని ఏజెన్సీ ప్రాంతంలో పుట్టి వరంగల్ నగరానికి చేరి వివిధ రంగాల్లో అభివృద్ధి చెందిన మూడు తరాల ప్రజల ఆత్మీయ సమ్మేళనం చాలా ఆనందంగా జరిగింది. ఆదివారం రాత్రి హన్మకొండ జిల్లా కేంద్రం గోపాలపురంలో జరిగిన ఏటూరునాగారం డివిజన్ ప్రాంతవాసుల ఆత్మీయ సమ్మేళనంలో గత 40 ఏండ్లుగా విడిపోయి వివిధ రంగాల్లో జీవిస్తున్న వారు ఒక దగ్గర కలిసి అలాయి బలాయి తీసుకొని ఆనంద పడ్డారు. పెళ్లిళ్లు కాకముందు విడిపోయి కుటుంబాలతో పిల్లల పరిచయం చేసుకొని అందరు సంతోషంగా గడిపారు.

ప్రముఖులకు సన్మానం

ఏటూరునాగారం ప్రాంతవాసులైన కాకతీయ మెడికల్ కళాశాల హెచ్ ఓడీ డాక్టర్ బిక్షపతిరావు, ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ జగన్నాథరావు, అందరి గురువు కేఎస్ రావు, రిటైర్డ్ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ భాగ్య, రిటైర్డ్ ఎస్ఇ శ్రీనివాస్, సామాజిక విశ్లేషకులు, న్యాయవాది సాయిని నరేందర్ లను ఆత్మీయంగా సన్మానించారు. ఈ సమ్మేళనానికి వర్ధన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేష్, చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ సతీమణి రేవతి హాజరై అభినందనలు తెలిపారు. ఆనాడు ఏటూరునాగారంలో పాఠాలు చెప్పిన గురువులు రాజశేఖర్, దశరథం, కిషన్ రావు హాజరై మరోసారి అందరికీ దీవెనలు అందించారు. వారి విద్యార్థుల ఎదుగుదలను చూసి ఎంతో ఆనందపడ్డారు. ఏటూరునాగారం వాస్తవ్యుడైన వై రాజు బృందం మిమిక్రి, పాటలతో అందరిని ఆడించి, అలరించడం కార్యక్రమంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

ఆయన కళను అభినందిస్తూ సహచరి, కుటుంబంతో పాటు ఆయనను సత్కరించారు. ఫొటో గ్రాఫర్ సిరిపురం శ్రీనివాస్ ఓపికతో అందరి ఫొటోలు, వీడియోలు కవర్ చేసినందుకు ఆయనకు అందరూ ప్రత్యేక అభినందనలు తెలిపారు. కార్యక్రమ నిర్వహణ టీమ్ కు సమయానుకూలంగా విలువైన సూచనలిచ్చి కార్యక్రమ ప్రణాళిక, అమలులో పెద్ద దిక్కుగా వ్యవహరించిన కాకులమర్రి చిట్టిబాబును ఆర్గనైజర్లు అందరూ కలిసి సత్కరించారు. కార్యక్రమ నిర్వహణలో ఎంతో కష్టపడి స్టేజితో సహా అన్ని ఏర్పాట్లను చేసి గంగసాని సుబ్బారెడ్డి, గంగసాని కృష్ణారెడ్డి, గంగసాని సందీప్ లను సత్కరించి అభినందనలతో పాటు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మానవీయ సంబంధాలు కనుమరుగవుతున్న నేటి రోజుల్లో ఇలాంటి ఆత్మీయ సమ్మేళనాలు జరుపుకోవడం సమాజానికి ఎంతో మేలు చేస్తుందని అందరూ అభిప్రాయపడ్డారు. దాదాపు 300 మంది ఏటూరు నాగారానికి చెందిన వారు ఈ సమావేశంలో పాల్గొన్నారు.