Delhi: జడ్జి ఇంట్లో అగ్ని ప్రమాదం.. బయటపడ్డ నోట్ల కట్టలు
డిల్లీ హైకోర్టు జడ్జి యశ్వంత్ వర్మ ఇంట్లో అగ్నిప్రమాదంలో మంటలు అర్పే ప్రయత్నంలో కట్టలకొద్దీ డబ్బు బయటపడిన ఘటన సంచలనంగా మారింది. ఈ ఘటనను సీరియస్ గా తీసుకున్న సుప్రీం కోర్టు కొలీజియం జడ్జి యశ్వంత్ వర్మ పై బదిలీ వేటు వేసింది.

Fire At Delhi HC Judge House :
జడ్జి ఇంట్లో అగ్నిప్రమాదంలో మంటలు అర్పే ప్రయత్నంలో కట్టలకొద్దీ డబ్బు బయటపడిన ఘటన ఢిల్లీలో సంచలనంగా మారింది. ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మ బంగ్లాలో 14వ తేదీన అగ్నిప్రమాదం జరిగింది. అగ్నిప్రమాదం జరిగిన సమయంలో జస్టిస్ వర్మ ఇంట్లో లేకపోవడంతో కుటుంబ సభ్యులు అందించిన సమాచారం మేరకు అగ్నిమాపక దళ సిబ్బంది హుటాహుటిన వెళ్లి మంటలు ఆర్పేందుకు ప్రయత్నించారు. మంటలు అర్పుతున్న సిబ్బందికి ఇంట్లో అనుకోకుండా భారీ ఎత్తున డబ్బు కనిపించింది. దీంతో వారు ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చారు. వారు వచ్చి అక్కడున్న డబ్బును స్వాధీనం చేసుకొన్నారు. అదంతా లెక్కల్లో చూపని నగదుగా గుర్తించారు.
ఈ వ్యవహారం సంచలనంగా మారడం..న్యాయ వ్యవస్థ పనితీరును ప్రశ్నార్ధకం చేసేదిగా ఉండటంతో సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ సంజీవ్‌ఖన్నా నేతృత్వంలోని కొలీజియం తీవ్రంగా స్పందించింది. వెంటనే జడ్జి యశ్వంత్ వర్మ ను మరో హైకోర్టుకు బదిలీ చేసింది. గతంలో వర్మ అక్కడే పనిచేసి 2021లో దిల్లీకి రావడం గమనార్హం. జడ్జి ఇంట్లో అక్రమ నగదు ఘటన న్యాయవర్గాల్లో సంచలనం సృష్టించింది.
న్యాయవర్గాల్లో సంచలనం
ఐదుగురు సభ్యులున్న కొలీజియంలో కొందరు జస్టిస్ వర్మ వ్యవహారాన్ని తీవ్రంగా పరిగణించారు. కేవలం ఈ జడ్జిని బదిలీ చేస్తే సరిపోదని, దీని వల్ల న్యాయశాఖ ఇమేజ్ తిరిగిరాదన్న అభిప్రాయాన్ని వ్యక్తంచేశారు. వర్మను రాజీనామా చేయాలని కోరడమో లేదా ఆయనపై సీజేఐ అంతర్గత విచారణ చేపట్టడమో చేయాలన్న అభిప్రాయాన్ని వ్యక్తంచేశారు. కాగా 2008 ఆగస్టు 13న కూడా నాటి పంజాబ్-హరియాణా హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ నిర్మల్‌జిత్ కౌర్ ఇంటి ఎదుట రూ.15 లక్షలు విలువ చేసే నోట్లు ఉన్న బాక్స్‌ను కొందరు వ్యక్తులు వదిలి వెళ్లారు.
ఈ విషయంపై పోలీసులకు ఫిర్యాదు అందింది. ఆ తర్వాత ఈ కేసును సీబీఐకు అప్పగించారు. దర్యాప్తు అనంతరం 2011 మార్చిలో ఉత్తరాఖండ్ హైకోర్ట్ జడ్జి జస్టిస్ నిర్మల్ యాదవ్‌పై అభియోగాలు నమోదు చేశారు. ఆమె 2009 వరకు పంజాబ్-హరియాణా కోర్టులో పనిచేశారు. ఓ కేసులో తీర్పు నిమిత్తం నిర్మల్ యాదవ్‌కు ఇవ్వాల్సిన డబ్బును పొరబాటున జస్టిస్ నిర్మల్‌జిత్ కౌర్ ఇంటి వద్ద పెట్టినట్లు తేలింది. ఈ నేపథ్యంలో జస్టిస్ యశ్వంత్ వర్మ ఇంట్లో భారీగా లభ్యమైన నగదు ఎక్కడిది…అక్రమమా?..సక్రమమా? తేలాల్సి ఉంది.