Fish Prasadam: జూన్ 8 ఉదయం చేప ప్రసాదం పంపిణీ!

బత్తిని కుటుంబ సభ్యుల వెల్లడి
విధాత; హైదరాబాద్ : ఈ సంవత్సరం మృగశిర కార్తీ జూన్ 8 ఆదివారం ఉదయం10 గం లకు ప్రవేశిస్తుందని.. ఆ రోజునే చేప ప్రసాదం పంపిణి చేస్తామని బత్తిని గౌడ్స్ కుటుంబ సభ్యులు తెలియచేశారు. చేప ప్రసాదం పంపిణీపై బషీర్ బాగ్ లోని ప్రెస్ క్లబ్ లో దివంగత బత్తిని హరినాథ్ గౌడ్ తనయుడు బత్తిని అమర్నాథ్ గౌడ్, ఇతర కుటుంబ సభ్యులు హాజరై మీడియాకు వివరాలు వెల్లడించారు. బత్తిని అమర్నాథ్ గౌడ్ మాట్లాడుతూ ఎప్పటి లానే ఈ సంవత్సరం జూన్ 8 తేదీ ఆదివారం ఉదయం 10 గంటలకు మృగశిరా కార్తీ ఘడియలు ప్రవేశించిన వెంటనే చేప ప్రసాదం నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో ఇవ్వబడుతుందని తెలిపారు. దుద్ బౌలి ఇంటి వద్ద 7న సత్యనారాయణ వ్రతం, పూజ అనంతరం చేప ప్రసాదం తయారీ జరుగుతుందని..రెండు రోజుల పాటు నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో 8, 9తేదీలలో 24 గంటల పాటు పంపిణీ కొనసాగుతుందని వెల్లడించారు. రెండు రోజుల తరువాత చేప ప్రసాదం అందని వారికీ 10వ తేదీ నుండి రెండు, మూడు రోజులు దుద్ బౌలి, కావడి గూడా ఇంటి వద్ద పంపిణీ చేస్తామన్నారు. దేశ, విదేశాల నుండి లక్షలాది మంది చేప ప్రసాదం కోసం వస్తుంటారని..అందుకోసం ఎవ్వరీకీ ఎటువంటి అసౌకర్యం కలుగకుండా పంపిణి సజావుగా సాగడానికి ఈ సంవత్సరం కూడా ప్రభుత్వం తరుపున ఏర్పాట్లు చేపడుతున్నారని వివరించారు.
బత్తిని శంకర్ గౌడ్ మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో మంత్రి పొన్నం ప్రభాకర్ పర్యవేక్షణలో చేప ప్రసాదం పంపిణీకి పూర్తి సహకారాన్ని అందిస్తూ సంబంధిత ప్రభుత్వ శాఖలు సమన్వయ సహకారంతో ఏర్పాట్లు చేస్తున్నారని తెలిపారు. కోవిడ్ జాగ్రతల తో ప్రసాదం పంపిణీ కొనసాగుతుందన్నారు. ఎప్పటిలాగనే జీహెచ్ఎంసీ, వాటర్ వర్క్స్, ఆర్టీసీ, మున్సిపాలిటీ, పోలీస్, విద్యుత్తు శాఖ తో పాటు మత్య్స శాఖా కావాల్సిన చేపల్ని సిద్ధంచేస్తున్నారని తెలిపారు.
మత్య్స శాఖా మొదటి విడతగా లక్ష 25 వేల చేపపిల్లలు
దాదాపు రెండు శతాబ్దాలుగా తమ కుటుంబం ఆస్తమా, ఉబ్బసం, దమ్ము, దగ్గు వంటి శ్వాస సంబంధ వ్యాధుల నివారణకు మృగశిరా కార్తీ ప్రవేశించిన ఘడియల్లో ఓ పదార్థాన్ని చేప ద్వారా రోగి నోట్లో వేస్తామని అమర్నాథ్ గౌడ్, శంకర్ గౌడ్ లు తెలిపారు. వ్యాధి తీవ్రతను బట్టి రోగి నాలుగు నుండి ఐదు సంవత్సరాలు చేప ప్రసాదం తీసుకుంటే పూర్తిగా నయం అవుతోందని చెప్పారు. ఈ చేప ప్రసాద పంపిణీ సేవ తమ కుటుంబ పెద్దలకు నూట తొంబై సంవత్సరాల క్రితం ఓ మునీశ్వరుడు బోధించారని. అప్పటినుండి నిస్వార్థంగా ఉచితంగా లక్షలాదిమంది శ్వాస సంబంధిత రోగులకు ఇస్తున్నామన్నారు. అగ్రవాల్ సేవాదళ్ స్వచ్చంద సంస్థలు రోగులకు భోజనం, కాఫీ, టీలు, మజ్జిగ, మంచినీరు అందిస్తున్నారని పేర్కొన్నారు. అత్యవసర వైద్య సదుపాయంతో పాటు క్యూ లైన్ లో రోగులు ఏవిధంగా ఇబ్బంది పడకుండా వాళ్ళ వాలంటీర్లు సేవలందిస్తారన్నారని తెలిపారు.