ఫాక్స్‌కాన్ చైర్మన్ యంగ్ లియుకు పద్మభూషణ్ ప్రకటించిన కేంద్రం..
తైవాన్ టెక్నాలజీ దిగ్గజం ఫాక్స్‌కాన్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అండ్ చైర్మన్ యంగ్ లియుకు గురువారం కేంద్రం ప్రతిష్టాత్మక పద్మభూషణ్ అవార్డును ప్రకటించింది

Young Liu | తైవాన్ టెక్నాలజీ దిగ్గజం హోన్ హై టెక్నాలజీ గ్రూప్ (ఫాక్స్‌కాన్) చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అండ్ చైర్మన్ యంగ్ లియుకు గురువారం కేంద్రం ప్రతిష్టాత్మక పద్మభూషణ్ అవార్డును ప్రకటించింది. ఫాక్స్‌కాన్ ప్రపంచంలోనే అతిపెద్ద ఎలక్ట్రానిక్స్ తయారీదారు, ప్రముఖ గ్లోబల్ సైన్స్ అండ్ టెక్నాలజీ సొల్యూషన్స్ ప్రొవైడర్. లియు నాలుగు దశాబ్దాలకుపైగా పరిశ్రమ అనుభవంతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందారు. ఆయన మూడు కంపెనీలను స్థాపించారు. 1988లో యంగ్ మైక్రో సిస్టమ్స్ అనే మదర్‌బోర్డ్ కంపెనీని స్థాపించారు. 1995లో పీసీ చిప్‌సెట్‌లపై దృష్టి సారించే నార్త్‌బ్రిడ్జ్, సౌత్‌బ్రిడ్జ్ ఐసీ డిజైన్ కంపెనీని నెలకొల్పారు.
1997లో ఐటీఈ టెక్ అండ్ ఐటీఎక్స్, ఏడీఎస్‌ఎల్ ఐసీ డిజైన్ కంపెనీని సైతం స్థాపించారు. లియు 1986లో యూనివర్శిటీ ఆఫ్ సదరన్ కాలిఫోర్నియా నుంచి కంప్యూటర్ ఇంజినీరింగ్‌లో ఎంఎస్‌లో డిగ్రీని, 1978లో తైవాన్‌లోని నేషనల్ చియావో టంగ్ విశ్వవిద్యాలయం నుంచి ఎలక్ట్రోఫిజిక్స్‌లో బీఎస్ డిగ్రీ పట్టాను అందుకున్నారు. ఫాక్స్‌కాన్ భారతదేశంలోనూ పెట్టుబడులు పెట్టింది. కరోనా మహమ్మారి తర్వాత చైనా కాదని ప్రపంచవ్యాప్తంగా పలుదేశాల్లో పెట్టుబడులను విస్తరిస్తున్నది. కంపెనీ ఆపిల్ కంపెనీతో కలిసి భారత్‌లో ఐఫోన్లను ఉత్పత్తి చేస్తుంది. ఆపిల్‌తో కలిసి తమిళనాడు చెన్నైలో ఐఫోన్లను తయారు చేసి ఎగుమతి చేస్తున్నది.