KTR | రైతు బంధు ఇస్తున్నాం.. పంట నష్టపరిహారం అంటే ఎలా?

KTR | పంటల నష్టం అంచనాకు రాం రాం కేంద్రం అడిగినా.. ఇవ్వని వైనం ఫ‌స‌ల్ బీమా లేదు, రాష్ట్ర సాయం రాదు ఆందోళ‌న‌లో న‌ష్ట‌పోయిన రైతాంగం భారీ వ‌ర్షాల‌కు తెలంగాణ వ్యాప్తంగా రూ. 1500 కోట్ల పంట న‌ష్టం? 16 మంది మృతి, ప‌శుసంప‌ద‌కూ న‌ష్టం న‌ష్టం లెక్క‌లు తీయ‌ట్లేద‌ని తేల్చిన కేటీఆర్‌ హైకోర్టుకు సైతం అదే విష‌యం చెప్పిన స‌ర్కారు విధాత: ఇటీవల రాష్ట్ర వ్యాప్తంగా కురిసిన భారీ వర్షాలకు తెలంగాణ రైతాంగం తీవ్రంగా […]

KTR | రైతు బంధు ఇస్తున్నాం.. పంట నష్టపరిహారం అంటే ఎలా?

KTR |

  • పంటల నష్టం అంచనాకు రాం రాం
  • కేంద్రం అడిగినా.. ఇవ్వని వైనం
  • ఫ‌స‌ల్ బీమా లేదు, రాష్ట్ర సాయం రాదు
  • ఆందోళ‌న‌లో న‌ష్ట‌పోయిన రైతాంగం
  • భారీ వ‌ర్షాల‌కు తెలంగాణ వ్యాప్తంగా రూ. 1500 కోట్ల పంట న‌ష్టం?
  • 16 మంది మృతి, ప‌శుసంప‌ద‌కూ న‌ష్టం
  • న‌ష్టం లెక్క‌లు తీయ‌ట్లేద‌ని తేల్చిన కేటీఆర్‌
  • హైకోర్టుకు సైతం అదే విష‌యం చెప్పిన స‌ర్కారు

విధాత: ఇటీవల రాష్ట్ర వ్యాప్తంగా కురిసిన భారీ వర్షాలకు తెలంగాణ రైతాంగం తీవ్రంగా నష్టపోయింది. మోరంచ వాగులో ఊరంతా మునిగిపోయింది. జంపన వాగులో కొండాయి కోలుకోలేనంతగా దెబ్బతిన్నది. ఇండ్లు నీట మునిగి పోయాయి. వరంగల్ త్రి సీటీ అంతా నీట ముగినింది. ఇండ్లలోకి వచ్చిన వరద నీటితో సర్వం కోల్పోయారు. గ్రేటర్ హైదరాబాద్ శివారులో అనేక బస్తీలు నీట మునిగాయి. భారీ వ‌ర్షాల‌కు 16 మంది చని పోయారు. పశుసంపదకు కూడా త్రీవంగా నష్టం జరిగింది.

ఇలా రాష్ట్రంలోని అనేక ప్రాంతాలలో ఈ వరదల వల్ల భారీ నష్టం వాటిల్లింది. ఈ వర్షాల వ‌ల్ల‌ జరిగిన నష్టాన్ని అంచనా వేయడానికి రాష్ట్రానికి వచ్చిన కేంద్ర బృందం పంట నష్టం అంచనాలు అడిగితే తెలంగాణ ప్ర‌భుత్వం తాము లెక్కలు తీయడం లేదని చెప్పి పంపింది. పంట నష్టం మిన‌హాయించి రోడ్లు, ఇళ్లు, ఇత‌ర ఆస్తుల న‌ష్టాన్ని రూ. 4,460 కోట్ల వరకు లెక్క‌క‌ట్టి కేంద్రానికి రాష్ట్ర ప్ర‌భుత్వం నివేదిక ఇచ్చింది.

తక్షణ సాయం కింద రూ. 1000 కోట్లు సహాయం అందించాలని కేంద్రాన్ని కోరింది. పంట నష్టం వివరాలు అడిగితే మాత్రం లెక్కలు తీయ లేదని తేల్చి చెప్పింది. కేంద్రం సాయం కోసం పంట న‌ష్టం లెక్క‌లు పంపక‌పోవ‌డం ప‌ట్ల రైతాంగం తీవ్ర ఆందోళ‌న వ్య‌క్తం చేస్తోంది. రాష్ట్ర ప్ర‌భుత్వ తీరుపై గుర్రు మంటోంది.

పంట లెక్క‌లు తీయ‌డం లేద‌న్న కేటీఆర్‌

శుక్రవారం అసెంబ్లీలో కాంగ్రెస్ ఎమ్మెల్ల్యే దుద్దిళ్ల శ్రీధర్ బాబు అడిగిన ప్రశ్న కు సమాధానంగా పుర‌పాల‌క శాఖ మంత్రి కేటీఆర్ రాష్ట్రంలో తాము పంట నష్టం లెక్కలు తీయడం లేదని స్ప‌ష్టం చేశారు. పంట నష్టంపై లెక్కలు వేయ లేదని హైకోర్టుకు కూడా రాష్ట్ర ప్రభుత్వం తెలుపడం గమనార్హం.

దీనిపై కోర్టు సీరియస్ అయింది. రెండు రోజులు గడువు ఇచ్చి వివరాలతో కూడిన నివేదిక ఇవ్వాలని రాష్ట్ర ప్ర‌భుత్వాన్ని ఆదేశించింది. పంట న‌ష్టం లెక్క‌లు తీయ‌డంలో రాష్ట్ర ప్ర‌భుత్వం ఎందుకు నిర్లిప్తంగా ఉంటోంద‌న్న ప్ర‌శ్న‌కు స‌మాధానం మాత్రం దొర‌క‌డం లేద‌ని రైతాంగం వాపోతోంది.

భారీ వ‌ర్షాలు.. భారీ న‌ష్టాలు

మొన్న‌టి భారీ వ‌ర్షాల‌కు రాష్ట్రంలో వాగులు, నదులు పొంగిపొర్లడంతో అనేక పంట భూములు నీట మునిగాయి. పంట పొలాల్లో ఇసుక మేటలు వేసింది. చెరువుల కట్టలు తెగి నీరంతా పొలాల మీదకు వెళ్లడంతో ఆయా భూముల్లో వేసిన పంట పొలాలు కరాబయ్యాయి. ఈ పొలాల‌ను బాగు చేయడం రైతులకు తలకు మించిన భారంగా తయారైంది.

భారీ వర్షాల వల్ల 15 లక్షల ఎకరాల్లో దాదాపు రూ. 1500 కోట్ల పంట నష్టం జరిగిందన్న అంచ‌నాల‌కు ప్ర‌తిప‌క్షాలు, రైతు సంఘాలు వ‌చ్చాయి. ఈ వివ‌రాలు అసెంబ్లీలో శ్రీధర్ బాబు చెప్పడంతో తాము లెక్కలే వేయనప్పుడు మీకెలా వచ్చాయని కేటీ ఆర్ అభ్యంతరం వ్యక్తం చేశాడు. ఈ సంద‌ర్భంలోనే రాష్ట్రంలో పంట నష్టం లెక్కలను తాము సేక‌రించ‌డం లేదని మంత్రి కేటీఆర్‌ చెప్పారు.

తెలంగాణకు పంటల బీమా ఏది?

రైతు బంధు, రైతు బీమా పథకాలను అమలు చేస్తున్నందున పంట నష్టానికి ప్రత్యేకంగా పరిహారం ఇవ్వాల్సిన అవసరం లేదని, అందుకే లెక్కలు తీయడం లేదని రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన సీనియర్ ఐఏఎస్ అధికారి ఒక‌రు తెలిపారు. రైతు బంధు, రైతు బీమా ఇస్తున్నందున పంటలకు ప్రత్యేకంగా నష్టపరిహారం ఇవ్వాల్సిన అవసరం ఏముందని సదరు అధికారి మీడియాకు వెల్ల‌డించారు.

అందుకే కేంద్ర బృందానికి ఈ లెక్క‌లు ఇవ్వ‌లేద‌ని చెప్పుకొచ్చారు. ఈ అధికారి మాట‌ల‌ను బ‌ట్టి, రైతు బంధు, రైతు బీమా ఇస్తున్నందున‌ రాష్ట్ర ప్రభుత్వం పంటల బీమా అమలు చేయడం లేదని అర్థ‌మ‌వుతోంది.

ఫ‌స‌ల్ బీమాలో చేర‌ని ప్ర‌భుత్వం

కేంద్రం తీసుకువచ్చిన ఫసల్ బీమాలో కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేరలేదు. కేంద్రం ప్రవేశ పెట్టిన ఫసల్ బీమా సరిగ్గాలేదు. ఫసల్ బీమా బోగస్ అని 2021 అక్టోబర్8వ తేదీన అసెంబ్లీలో సీఎం కేసీఆర్ చెప్పారు. రాష్ట్రానికి ప్రత్యేక పంటల‌ బీమా పథకం తీసుకు వస్తామని హామీ ఇచ్చారు. కానీ నేటి వరకు బీమా పథకం తీసుకురాలేదు. దీంతో రైతులకు ఇలాంటి విపత్తుల ద్వారా నష్టం జరిగినప్పుడు పరిహారం అందించే పరిస్థితి లేదు.

రాష్ట్రంలో రైతు బంధు పథకం అమలులోకి వచ్చిన తరువాత విత్తనాల సబ్సిడీ కూడా బంద్ అయిందని, మార్కెట్ రేటుకే విత్తనాలు కొనుక్కోవాల్సి వస్తున్న‌దని రైతులు చెబుతున్నారు. ఇప్పుడు పంటల నష్టానికి పరిహారం కూడా ఇవ్వక‌పోతే ఎలా అని ప్ర‌శ్నిస్తున్నారు. క‌నీసం పంట నష్టం లెక్కలు తీయ‌క‌పోవ‌డంపై రైత‌న్న‌లు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. గత ఏడాది అకాల వర్షాలు కురిసినప్పుడు దాదాపు 5 లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగిందని అంచనా వేసింది రాష్ట్ర ప్ర‌భుత్వం.

ఎకరాకు రూ. 10 వేలు ప‌రిహారం ఇస్తామని అప్ప‌ట్లో ప్రకటించారు. దాదాపు లక్షన్నర ఎకరాలకు రూ. 10 వేలు చొప్పున ప‌రిహారం పంచి మమ అనిపించారని తెలిసింది. రాష్ట్ర ప్ర భుత్వం అన్నింటికి సర్వరోగ నివారిణిగా రైతు బంధు డబ్బులనే చూపిస్తోందన్న వాద‌న రైతుల్లో క‌న‌బ‌డుతోంది.