Telangana Excess Rainfall | తెలంగాణలో సమృద్ధిగా వానలు.. వర్షపాతం ఎంత అధికంగా నమోదైందో తెలుసా?

ఈ సీజన్‌లో తెలంగాణలో 991.5 మి.మీ వర్షపాతం (telangana excess rainfall) నమోదైందని భారత వాతావరణ విభాగం (IMD) పేర్కొన్నది. ఇది సాధారణం కంటే 35% అధికం (above normal). ములుగు జిల్లా(mulugu district)లో రాష్ట్రంలోనే అత్యధిక వర్షపాతం రికార్డైందని భారత వాతావరణ విభాగం (IMD) తెలిపింది.

Telangana Excess Rainfall | తెలంగాణలో సమృద్ధిగా వానలు.. వర్షపాతం ఎంత అధికంగా నమోదైందో తెలుసా?

హైదరాబాద్‌, అక్టోబర్‌ 5 (విధాత ప్రతినిధి):

Telangana Excess Rainfall | నైరుతి రుతుపవనాల ప్రభావంతో తెలంగాణలో 31 శాతం అధికంగా వర్షపాతం నమోదైందని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఈశాన్య రుతుపవనాల ప్రభావంతో వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రకటించింది. అక్టోబర్ నెలలో కూడా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ అధికారులు చెబుతున్నారు.

అన్ని జిల్లాల్లో సాధారణం కంటే ఎక్కువే

తెలంగాణలో సాధారణంగా జూన్ 1 నుంచి అక్టోబర్ 4 వరకు రాష్ట్రంలో 756.7 మి.మీ. వర్షపాతం నమోదు కావాలి. కానీ, రాష్ట్రంలో 991. 5 మి.మీ. వర్షపాతం నమోదైందని భారత వాతావరణ విభాగం పేర్కొన్నది. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో దాదాపుగా సాధారణ వర్షపాతం కంటే ఎక్కువ నమోదైంది. నైరుతి రుతుపవనాల ఉపసంహరణ తర్వాత ఈశాన్య రుతుపవనాలతో వర్షాలు కురిసే అవకాశాలున్నాయి. రాష్ట్రంలోని 33 జిల్లాల్లోని ఏడు జిల్లాల్లో అధిక వర్షపాతం నమోదైంది. 16 జిల్లాల్లో సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం రికార్డైంది. మిగిలిన 10 జిల్లాల్లో సాధారణ వర్షపాతం నమోదైంది. హైదరాబాద్ జిల్లాలో సాధారణంగా 697.6 మి.మీ. వర్షపాతం నమోదు కావాలి. కానీ, 939 మి.మీ. వర్షపాతం కురిసింది. సాధారణం కంటే 35 శాతం అధిక వర్షం కురిసింది. రంగారెడ్డిలో 42 శాతం, మేడ్చల్ మల్కాజిగిరిలో 47 శాతం వర్షపాతం నమోదైంది. ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో కురిసిన వర్షాలతో రాష్ట్రంలో అధిక వర్షపాతం నమోదుకు కారణమని భూగర్భ జలవనరుల శాఖాధికారులు చెబుతున్నారు. రాష్ట్రంలోని 293 మండలాల్లో అధిక వర్షపాతం నమోదైంది.188 మండలాల్లో సాధారణ వర్షపాతం రికార్డైంది. 137 మండలాల్లో 60 శాతానికి పైగా అధిక వర్షపాతం నమోదైందని గణాంకాలు చెబుతున్నాయి.

ములుగు జిల్లాలో అత్యధిక వర్షపాతం

నైరుతి రుతుపవనాలతో ములుగు జిల్లాలో 1552.7 మి.మీ. వర్షపాతం నమోదైంది. సాధారణంగా ఈ జిల్లాలో 978.6 మి.మీ. వర్షపాతం నమోదు కావాలి. కానీ, సాధారణం కంటే 574.1 మి.మీ. వర్షపాతం రికార్డైంది. తర్వాతి స్థానంలో కామారెడ్డి జిల్లా నిలిచింది. ఈ జిల్లాలో 1331.1 మి.మీ. వర్షపాతం నమోదైంది. సాధారణంగా ఈ జిల్లాలో774.4 మి.మీ. వర్షపాతం నమోదు కావాలి. సాధారణం కంటే 566.7 మి.మీ. వర్షపాతం రికార్డు అయింది. ఆదిలాబాద్ లో 1375.8 మి.మీ. వర్షపాతం నమోదైంది. ఈ జిల్లా సాధారణ వర్షపాతం 941.9 మి.మీ.. మెదక్ లో సాధారణ వర్షపాతం 767.1 మి.మీ. అయితే 1375.5 మి.మీ. వర్షపాతం రికార్డైంది. నారాయణపేటలో 355.1 మి.మీ. వర్షపాతం అధికంగా కురిసింది. ఈ జిల్లాలో సాధారణ వర్షపాతం 464.5 మి.మీ.819.6 మి.మీ. వర్షం పడింది.

వరుసగా తెలంగాణలో అధిక వర్షపాతం

వరుసగా ఆరేళ్లుగా సాధారణ వర్షపాతం కంటే అధిక వర్షపాతం నమోదైందని రికార్డులు చెబుతున్నాయి. 2019లో సాధారణ వర్షపాతం కంటే 5 శాతం ఎక్కువ వర్షం కురిసింది. అయితే 2020 నుంచి సాధారణం కంటే అధిక వర్షపాతం కురిసింది. 2020లో జూన్ నుంచి సెప్టెంబర్ వరకు 1,094 మి.మీ. వర్షపాతం నమోదైంది. ఇది సాధారణం కంటే 46 శాతం ఎక్కువ. ఇది దశాబ్దంలో ఇంత వర్షపాతం కురవడం 2020లోనే ఫస్ట్. 2021లో కూడా 40 శాతం అధిక వర్షం కురిసింది. 1009.7 మి.మీ. వర్షపాతం రికార్డైంది. సాధారణ వర్షపాతం కంటే 40 శాతం ఎక్కువ వర్షపాతం కురిసింది. 2022లో కూడా 40 శాతం అధిక వర్షాలు కురిశాయి. ఆ ఏడాది 1,000 మి.మీ. వర్షం కురిసింది. 2023లో 16 శాతం అధిక వర్షపాతం నమోదైంది. ఆ ఏడాది హైదరాబాద్ లో 25 శాతం ఎక్కువ వర్షాలు కురిశాయి. 2024లో 32 శాతం అధిక వర్షాలు కురిశాయి. ఈ ఏడాది అంటే 2025లో కూడా 31 శాతం అధిక వర్షాలు రికార్డయ్యాయి.

ఏటూరు నాగరంలో అత్యధిక వర్షపాతం

రాష్ట్రంలోని చాలా మండలాల్లో సగటున ఐదు నుంచి పది సెంటిమీటర్ల వర్షపాతం నమోదైంది. ములుగు జిల్లాలోని ఏటూరు నాగారంలో 109.5 మి.మీ. వర్షపాతం నమోదైంది. సంగారెడ్డి జిల్లాలోని ముగ్దుంపల్లిలో 85.8 మి.మీ.వర్షం రికార్డైంది. నారాయణపేట జిల్లా కోస్గిలో 56.7 మి.మీ. వర్షం పడింది. వికారాబాద్ జిల్లాలోని బషీరాబాద్ లో 68.6 మి.మీ. వర్షపాతం, మోమిన్ పేటలో 51.0 మి.మీ. వర్షం పడింది. సూర్యాపేట జిల్లాలోని ఆత్మకూర్ ఎస్ లో 48.7 మి.మీ. వర్షపాతం నమోదైంది. సిద్దిపేట రూరల్ లో 47.3 మి.మీ. వర్షం పడింది. మెదక్ జిల్లా అల్లాదుర్గ్ లో 40.0 మి.మీ. వర్షపాతం నమోదైంది.