గూగుల్ చాట్‌బాట్ బార్డ్‌కు శక్తివంతమైన ఏఐ దన్ను.. పేరు జెమిని!
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అభివృద్ధిలో గూగుల్ మరో అడుగు ముందుకు వేసింది. తన చాట్‌బాట్ బార్డ్‌కు సరికొత్త తరం కృత్రిమ మేధ మోడల్‌ను అనుసంధానించింది

విధాత: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అభివృద్ధిలో గూగుల్ (Google) మరో అడుగు ముందుకు వేసింది. తన చాట్‌బాట్ బార్డ్‌కు సరికొత్త తరం కృత్రిమ మేధ మోడల్‌ను అనుసంధానించింది. ఈ న్యూ జనరేషన్ ఇంటెలిజెన్స్‌కు జెమిని (Gemini) అనే పేరు పెట్టింది. దీని రాకతో ఏఐ చాట్‌బాట్‌ల రంగంలో తాము మొదటి స్థానానికి వస్తామని గూగుల్ నమ్మకంగా చెబుతోంది.
సెర్చ్ ఇంజిన్ రంగంలో ఏకఛత్రాధిపత్యం గూగుల్‌దే అయినప్పటికీ.. ఏఐ చాట్‌బాట్‌లలో ఓపెన్ఏఐకు చెందిన చాట్‌జీపీటీ లీడర్‌గా ఉంది. ఈ స్థానం కోసం గూగుల్ విశ్వప్రయత్నాలు చేస్తోంది. తాజాగా ఓపెన్ఏఐ సీఈఓకు ఉద్వాసన పలకడం, ఉద్యోగుల తిరుగుబాటు అనంతరం తిరిగి చేర్చుకోవడం వంటి పరిస్థితులు ఉన్నప్పుడే తాను ఆ స్థానం సాధించాలని గూగుల్ ప్రయత్నిస్తున్నట్లు నిపుణులు చెబుతున్నారు.
ఇది ఒక అద్భుతమైన సమయం. అయినప్పటికీ ఇంకా మేము తొలి దశలోనే ఉన్నామని చెబుతా అని జెమిని విడుదల సందర్భంగా గూగుల్ సీఈఓ సుందర్‌పిచాయ్ చెప్పారు. గణిత, భౌతిక, సమస్యలకు పరిష్కారం, చరిత్ర, లా, మెడిసిన్, ఎథిక్స్ వంటి అంశాల్లో జెమిని బార్డ్ మేధావులను సైతం ఓడించడగలదని గూగుల్ డీప్ మైండ్ వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ప్రొడక్ట్ ఎలీ కాలిన్స్ పేర్కొన్నారు.
జెమిన్ పరిచయ కార్యక్రమంలో బార్డ్ అనేక కళ్లు చెదిరే ప్రదర్శన చేసింది. మ్యాట్రిక్స్ సినిమా సీన్ విశ్లేషించడం, దానిపై తన వివరణ, విమర్శలు ఇవ్వడంతో పాటు సూచనలు కూడా చెప్పింది. జెమిని అల్ట్రా వెర్షన్ దీని కన్నా కొన్నివందల రెట్లు శక్తిమంతమైనదని గూగుల్ తెలిపింది. దీని నానో వెర్షన్‌ను గూగుల్ స్మార్ట్‌ఫోన్లలో ఇస్తామని.. విడుదల కానున్న పిక్సల్ 8 ఫోన్లలో ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నామని వెల్లడించింది.