గవర్నర్ కోటా ఎమ్మెల్సీ కేసు విచారణ 14కు వాయిదా

గవర్నర్ కోటా ఎమ్మెల్సీల కేసు విచారణను ఈ నెల 14వ తేదీకి హైకోర్టు వాయిదా వేసింది. ఈ కేసులో విధించిన స్టేటస్ కో ఉత్తర్వులను సైతం 14వ తేదీ వరకు పొడగించింది

  • By: Somu    latest    Feb 12, 2024 11:51 AM IST
గవర్నర్ కోటా ఎమ్మెల్సీ కేసు విచారణ 14కు వాయిదా

విధాత : గవర్నర్ కోటా ఎమ్మెల్సీల కేసు విచారణను ఈ నెల 14వ తేదీకి హైకోర్టు వాయిదా వేసింది. ఈ కేసులో విధించిన స్టేటస్ కో ఉత్తర్వులను సైతం 14వ తేదీ వరకు పొడగించింది. గత బీఆరెస్ ప్రభుత్వం దాసోజు శ్రవణ్, కుర్ర సత్యనారయణలను గవర్నర్ కోటా ఎమ్మెల్సీ అభ్యర్థులుగా నామినేట్ చేసింది. అయితే వీరు రాజకీయ పార్టీలకు చెందిన వారని, గవర్నర్ కోటా ఎమ్మెల్సీ నిబంధనల పరిధిలో లేరన్న కారణంతో గవర్నర్ తమిళిపై గత ప్రభుత్వ ప్రతిపాదనను తిరస్కరించింది.


అనంతరం అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం గవర్నర్ కోటా ఎమ్మెల్సీలుగా.. కోదండరాం, అమీర్ అలీఖాన్‌లను నామినేట్ చేసింది. గవర్నర్ తమిళి సై వారి పేర్లకు ఆమోదం తెలిపింది. వారిలో కోదండరామ్ ఓ పార్టీ అధ్యక్షుడు కావడంతో గవర్నర్ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ దాసోజు శ్రవణ్ కోర్టును ఆశ్రయించారు. విచారణ చేపట్టిన హైకోర్టు గవర్నర్ కోటా ఎమ్మెల్సీలు కోదండరామ్‌, అలిఖాన్‌ల ప్రమాణ స్వీకారాన్ని తాత్కాలికంగా నిలిపివేయాలని స్టేటస్ కో ఉత్తర్వులు జారీ చేసింది.