Congress | ఓరుగల్లు కాంగ్రెస్‌లో మూడు గ్రూపులూ.. ఆరు వర్గాలు
Congress ప్రజలకు దూరం, పదవులపై ఆరాటం గుణపాఠం నేర్వని నేతలు విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: తొమ్మిదేళ్ళుగా అధికారం కోల్పోయిన విషయాన్ని విస్మరించి ప్రతిపక్షపాత్రను సక్రమంగా పోషించడంలో విఫలైనమైన కాంగ్రెస్ పార్టీ నేతలు ఉమ్మడి వరంగల్ జిల్లాలో గ్రూపు తగదాలతో తన్నుకోవడంలో తలమునకలై ఉన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత రెండు టర్మ్ లు పూర్తయ్యి మూడవ పర్యాయం రాష్ట్రంలో సాధారణ ఎన్నికలు త్వరలో జరుగనున్నప్పటికీ జిల్లా నేతల మధ్య లొల్లి మాత్రం ఆగడంలేదు. కలిసికట్టుగా కొట్లాడాల్సిన […]

Congress
- ప్రజలకు దూరం, పదవులపై ఆరాటం
- గుణపాఠం నేర్వని నేతలు
విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: తొమ్మిదేళ్ళుగా అధికారం కోల్పోయిన విషయాన్ని విస్మరించి ప్రతిపక్షపాత్రను సక్రమంగా పోషించడంలో విఫలైనమైన కాంగ్రెస్ పార్టీ నేతలు ఉమ్మడి వరంగల్ జిల్లాలో గ్రూపు తగదాలతో తన్నుకోవడంలో తలమునకలై ఉన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత రెండు టర్మ్ లు పూర్తయ్యి మూడవ పర్యాయం రాష్ట్రంలో సాధారణ ఎన్నికలు త్వరలో జరుగనున్నప్పటికీ జిల్లా నేతల మధ్య లొల్లి మాత్రం ఆగడంలేదు. కలిసికట్టుగా కొట్లాడాల్సిన సమయంలో సైతం ఎవరికి వారు తన్నుకుంటూ ప్రజల్లో, పార్టీ శ్రేణుల్లో పలుచనవుతున్నారు.
రాష్ట్రంలో రెండు పర్యాయాలు అధికారం చేపట్టి, ముచ్చటగా మూడవసారి గెలిచేందుకు బీఆరెస్ పార్టీ వ్యూహ రచన చేస్తూ కాంగ్రెస్ ను, బీజేపీని కట్టడి చేసేందుకు ప్రణాళికలు రచిస్తుండగా, కాంగ్రెస్ వర్గాలు ఆధిపత్యం కోసం పరస్పరం బహిరంగంగానే కుమ్ములాడుకుంటున్నారు. కాంగ్రెస్ నేతల తీరు చూసి ఆయా నియోజకవర్గాల్లో ప్రజలు అసహ్యించుకుంటున్నారు. అయినా కనీస మార్పులేకుండా వ్యవహరిస్తున్నారు. పార్టీ విజయం, ప్రాధాన్యత కంటే ఆధిపత్యం సన్నగిల్లిపోకుండా, వచ్చే ఎన్నికల్లో టికెట్ చేజారకుండా ఎత్తులు వేస్తున్నాయి.
ఒక ఎమ్మెల్యేకే పరిమితమైన కాంగ్రెస్
ఉమ్మడి వరంగల్ జిల్లాలో 12 అసెంబ్లీ సెగ్మెంట్లు, ఖమ్మం, నల్లగొండ జిల్లాలోని కొన్ని అసెంబ్లీ సెగ్మెంట్లను కలుపుకుని మూడు వరంగల్, మహబూబాబాద్, భువనగిరి పార్లమెంట్ స్థానాలున్నాయి. ఎంపీగా కాంగ్రెస్ నుంచి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈ 12 అసెంబ్లీ సెగ్మంట్లలో కేవలం ఒకటి, రెండు సెగ్మెంట్ లు మినహా అన్నింటా మూడు గ్రూపులు, ఆరువర్గాలనే విధంగా కాంగ్రెస్ పార్టీ కొనసాగుతోంది. 2018 ఎన్నికల్లో ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి భూపాలపల్లి, ములుగు అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి గండ్ర వెంకటరమణారెడ్డి, ధనసరి సీతక్క ఇద్దరు ఎమ్మెల్యేలు మాత్రమే కాంగ్రెస్ నుంచి గెలుపొందారు. ఇందులో గండ్ర రమణారెడ్డి ఎన్నికలు జరిగిన కొద్ది రోజులకే బీఆరెస్ లోకి జంపయ్యారు.
మూడు గ్రూపులు… ఆరువర్గాలు
కాంగ్రెస్ పార్టీ పరిస్థితి జిల్లాలో దయనీయంగా ఉంటే ఒకరంటే ఒకరు గిట్టని పరిస్థితి జిల్లా నాయకుల్లో నెలకొంది. బహిరంగంగా విమర్శించుకోవడమే కాకుండా పలు సందర్భాల్లో తన్నుకోవడం అలవాటుగా మారింది. జనగామ అసెంబ్లీ సెగ్మెంట్లో మాజీ పీసీసీ అధ్యక్షడు పొన్నాల లక్ష్మయ్యకు, పిసీసీ మెంబర్ కొమ్మూరి ప్రతాప్ రెడ్డికి మధ్య విభేదాలు తారాస్థాయికి చేరుకున్నాయి. ఇటీవల సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పాదయాత్ర సందర్భంగా రెండు వర్గాలు పోటీపడి తన్నుకున్నాయి. వీరిద్దరిని సమన్వయం చేయలేక ఆ జిల్లా పార్టీకి అధ్యక్షుడిని నియమించే పరిస్థితి లేకపోవడం పార్టీ దుస్థితికి అద్దంపడుతోంది. ఇంకా ఇక్కడ మూడవ గ్రూపుగా ఉన్న జంగా రాఘవరెడ్డి మకాం మార్చారు.
స్టేషన్ ఘన్ పూర్ లో సింగారపు ఇందిర, పార్టీ నాయకుడు కిష్టయ్యలు రెండు వర్గాలుగా కొనసాగుతున్నారు. ఈ సెగ్మంట్ పై మాజీ పోలీసు అధికారి దొమ్మాటి సాంబయ్య దృష్టి కూడా ఉంది. వరంగల్ పశ్చిమలో ఈ దఫా నాకే టికెట్ అనే ధీమాతో ఉన్న హనుమకొండ జిల్లా పార్టీ అధ్యక్షుడు నాయిని రాజేందర్ రెడ్డికి పోటీగా గత ఎన్నికల్లో పాలకుర్తి నుంచి పోటీ చేసి ఓటమిపాలైన జంగారాఘవరెడ్డి రంగంలోకి దిగి పోటీ కార్యక్రమాలు కొనసాగిస్తున్నారు. కేడర్ అయోమయానికి లోనవుతున్నా పట్టించుకునేవారు కరువయ్యారు.
ఇక్కడ జంగా అనుచరులను పార్టీ నుంచి సస్పండ్ కూడా చేశారు. వరంగల్ తూర్పులో పార్టీ వరంగల్ జిల్లా అధ్యక్షురాలిగా నియమించబడిన ఎర్రబెల్లి స్వర్ణ, మాజీ మంత్రి కొండా సురేఖ మధ్య విభేదాలు తారాస్థాయికి చేరుకున్నాయి. గత ఎన్నికల్లో పరకాల నుంచి పోటీ చేసిన సురేఖ నాలుగేండ్లుగా తూర్పుకు దూరంగా ఉన్నారు. వర్ధన్నపేటలో ప్రస్తుతం ఇంచార్జ్ నమిండ్ల శ్రీనివాస్ పార్టీ కార్యకలపాలు నిర్వహిస్తున్నప్పటికీ ఈ సెగ్మెంట్ పైన మాజీ ఎంపీ సిరిసిట్ట రాజయ్య దృష్టి కేంద్రీకరించారు. ఇటీవల మాజీ పోలీసు ఆఫీసర్ నాగరాజు పార్టీలో చేరి వర్ధన్నపేట నుంచి పోటీ చేయాలని భావిస్తున్నారు.
నర్సంపేట నియోజకవర్గానికి వచ్చేసరికి మాజీ ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి ఇక్కడ కాంగ్రెస్ నేతగా కొనసాగుతున్నారు. మాధవరెడ్డి ఏకపక్ష విధానాల పట్ల అధిష్టానం అసంతృప్తితో ఉంది. పీసీసీ పాదయాత్ర సందర్భంగా మాధవరెడ్డి పట్టించుకోకపోవడంతో రేవంత్ గుర్రుగా ఉన్నారు. మాధవరెడ్డి స్థానంలో ఇతరులు చాపకింద నీరులా ప్రయత్నాలు చేస్తున్నారు.
జిల్లా నాయకత్వంతో కూడా ఆయనకు సయోధ్యలేదనే విమర్శలున్నాయి. మహబూబాబాద్ నియోజకవర్గంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు భరత్ చందర్ రెడ్డి, మాజీ కేంద్ర మంత్రి బలరామ్ నాయక్, ఆదివాసీ కాంగ్రెస్ రాష్ట చైర్మన్ బెల్లయ్యనాయక్, డాక్టర్ మురళీ నాయక్ లు ఎవరికివారు వర్గాలుగా కొనసాగుతున్నారు. ఎవరికి వారు టికెట్ ఆశిస్తున్నారు. పైకి కలిసి ఉన్నట్లు కనిపిస్తున్నా లోపల ఒకరికి వ్యతిరేకంగా మరొకరు పనిచేస్తున్నారు.
డోర్నకల్ నియోజకవర్గంలో నెహ్రూ నాయక్, రామచంద్ర నాయక్ లు రెండు వర్గాలుగా విడిపోయారు, నియోజకవర్గంలో తమ పట్టు సాధించుకునేందుకు పోటీపడుతున్నారు. ఇరువురూ వచ్చే ఎన్నికల్లో టికెట్ ఆశిస్తున్నారు. ములుగులో ఎమ్మెల్యే సీతక్కకు పార్టీలో వర్గపోరు లేదు. తాజాగా పాలకుర్తి కాంగ్రెస్ నాయకురాలిగా రంగంలోకి దిగిన ఎన్ఆర్ఐ ఝాన్సీరెడ్డి కి ప్రస్తుతానికి వర్గపోరులేనప్పటికీ ఈ నియోజకవర్గంపై రామసహాయం సురేందర్ రెడ్డి కుమారుడు రఘురాంరెడ్డి కన్నేసినట్లు చెబుతున్నారు.
భూపాలపల్లిలో ఇంచార్జ్ గండ్ర సత్యనారాయణరావుకు పార్టీలో పోటీలేదు. అయితే మాజీ మంత్రి శ్రీధర్ బాబు వర్గంతో అప్పుడప్పుడు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పరకాల నియోజకవర్గంలో పార్టీ ఇంచార్జ్ ఇనుగాల వెంకట్రాం రెడ్డి ఒక్కరుగా పార్టీ బలోపేతానికి ప్రయత్నిస్తున్నారు. అయితే ఆయనకు పార్టీలోని ఇతర నాయకుల నుంచి తగిన సహకారం లభించడంలేదు.
అధిష్టానం నిర్లక్ష్యం
వరంగల్ జిల్లాలో నాయకుల మధ్య విభేదాలు తారాస్థాయికి చేరుకున్నప్పటికి పరిష్కరించలేక చేతులెత్తేసినట్లు కన్పిస్తోంది. దీంతో పార్టీని నమ్ముకున్న నాయకులలో, శ్రేణుల్లో తీవ్ర నిరాశ వ్యక్తం అవుతోంది. ప్రజల్లో కాంగ్రెస్ పట్ల విశ్వాసం సన్నగిల్లుతోంది. ముఖ్యంగా ఆయా అసెంబ్లీ సెగ్మెంట్లలో నాయకులంటే అసహ్యించుకునే పరిస్థితి దాపురించింది. కొత్తగా పార్టీలో చేరేవారు ఈ దుస్థితిని చూసి వెనుకంజ వేస్తున్నారు. ఈ అవకాశాన్ని అధికార పార్టీలైన బీఆర్ఎస్, బీజేపీలు వినియోగించు కుంటున్నాయి. ఎన్నికలు సమీపిస్తున్నందున ఏ విధమైన ప్రణాళిక అమలు చేస్తారోననే ఆసక్తితో ఎదురుచూస్తున్నారు.