Gutta Sukhender Reddy | విధాత, ఉమ్మడి నల్లగొండ బ్యూరో : ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణను దోచుకున్న వారు మళ్లీ రాష్ట్రంలో పాగా వేసేందుకు కుట్రలు చేస్తున్నారని, అనేక దురాలోచనలతో తెలంగాణకు వస్తున్నారని తెలంగాణ సమాజం తస్మాత్ జాగ్రత్త అంటూ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. సోమవారం నల్లగొండలో ఆయన విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ కాంగ్రెస్ రైతే రాజు పుస్తక ఆవిష్కరణ కార్యక్రమంలో కేవీపీ లాంటి వ్యక్తి నేను తెలంగాణ వాణ్ణి […]
Gutta Sukhender Reddy |
విధాత, ఉమ్మడి నల్లగొండ బ్యూరో : ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణను దోచుకున్న వారు మళ్లీ రాష్ట్రంలో పాగా వేసేందుకు కుట్రలు చేస్తున్నారని, అనేక దురాలోచనలతో తెలంగాణకు వస్తున్నారని తెలంగాణ సమాజం తస్మాత్ జాగ్రత్త అంటూ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.
సోమవారం నల్లగొండలో ఆయన విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ కాంగ్రెస్ రైతే రాజు పుస్తక ఆవిష్కరణ కార్యక్రమంలో కేవీపీ లాంటి వ్యక్తి నేను తెలంగాణ వాణ్ణి అని, ఇదే మట్టిలో కలిసిపోతానని చెప్పుకోవడంలో ఓ పెద్ద కుట్ర దాగి ఉన్నదన్నారు.
రాష్ట్ర విభజన సమయంలో కేవీపీ తెలంగాణ రాకుండా అడ్డుపడి కుట్ర పన్నిన సంగతిని తెలంగాణ ప్రజలు ఇంకా మరువలేదన్నారు. ఇక షర్మిల వ్యవహారం మరో పెద్ద జోక్ అంటూ ఎద్దేవా చేశారు. ఆంధ్రలో రాజకీయాలు చేతగాక తెలంగాణలో రాజకీయ ఆధిపత్యం, దోపిడి కోసం షర్మిల కుట్రలు చేస్తుందన్నారు. షర్మిల చెబుతున్న రాజన్న రాజ్యం కంటే సీఎం కేసీఆర్ రాజ్యంలో ప్రజలు, రైతులు వందశాతం సంతోషంగా ఉన్నారన్నారు.
కేవీపీ, షర్మిల, రేణుకా చౌదరి లాంటి వాళ్లు హైద్రాబాద్లో ఉంటాం..తెలంగాణకు ద్రోహం చేస్తాం, కుట్రలు చేస్తామంటే ప్రజలు సహించబోరన్నారు. తెలంగాణపై దండయాత్రలా వారి వ్యాఖ్యలు కనిపిస్తున్నాయని, మళ్లీ సమైక్య వాదుల కబంధ హస్తాల్లోకి తెలంగాణ పోకుండా ప్రజలు జాగ్రత్త పడాలన్నారు. చంద్రబాబు కూడా హైదరాబాద్ లో ఉంటూ ఆంధ్రలో రాజకీయాలు చేస్తున్నాడని, హైదరాబాద్ లో ఉంటూ తెలంగాణ పై కుట్రలు చేస్తాం అంటే మాత్రం కుదరదన్నారు.
జమిలి ఎన్నికలు సమాఖ్య పార్లమెంటరీ విధానం అమలులో ఉన్న భారత దేశంలో అస్సలు సాధ్యం కాదన్నారు. బీజేపీ రాజకీయ ప్రయోజనాల కోసమే జమిలి ఎన్నికలను తెరపైకి తెస్తుందని, దక్షిణాది రాష్ట్రాలకు, తెలంగాణ వంటి రాష్ట్రాలకు జమిలి నష్టదాయకమన్నారు. ప్రధాని మోడీకి ఆది నుంచి తెలంగాణపై అక్కసు ఉందని, బీజేపీని దూరం పెట్టే దక్షిణాది రాష్టాలాంటే కూడా మోడీకి నచ్చదన్నారు