అప్పులతోనే రాష్ట్రం మనుగడ : మండలి చైర్మన్ గుత్తా కీలక వ్యాఖ్యలు

ప్రతి నెల అప్పులతోనే రాష్ట్రం మనుగడ సాగుతుందని..కొత్త అప్పు తేస్తే తప్ప వచ్చే మూడు నెలలు సజావుగా సాగే పరిస్థితి లేదని..గత ప్రభుత్వం నిర్వాకంతోనే ఆర్థిక పరిస్థితి అధ్వాన్నంగా మారిపోయి ప్రస్తుత ప్రభుత్వంపై భారం పడుతుందని శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి వ్యాఖ్యానించారు.

అప్పులతోనే రాష్ట్రం మనుగడ : మండలి చైర్మన్ గుత్తా కీలక వ్యాఖ్యలు

విధాత : ప్రతి నెల అప్పులతోనే రాష్ట్రం మనుగడ సాగుతుందని..కొత్త అప్పు తేస్తే తప్ప వచ్చే మూడు నెలలు సజావుగా సాగే పరిస్థితి లేదని..గత ప్రభుత్వం నిర్వాకంతోనే ఆర్థిక పరిస్థితి అధ్వాన్నంగా మారిపోయి ప్రస్తుత ప్రభుత్వంపై భారం పడుతుందని శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి వ్యాఖ్యానించారు. శుక్రవారం నల్లగొండలో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆర్టీసీ సమ్మె, ధాన్యం కొనుగోలు, ప్రాజెక్టుల నిర్వహణ, ఉద్యోగుల సమస్యలు, ఎన్నికల హామీలు, విద్యార్థుల సమస్యలు…ఇలా అన్ని కూడా ఆర్థిక పరిస్థితులతోనే ముడిపడి ఉన్నాయన్న వాస్తవాలు మరిచి ప్రతిపక్షాలు ప్రభుత్వంపై రాజకీయ విమర్శలు చేయడం సహేతుకం కాదన్నారు. రిటైర్మెంట్ బెనిఫిట్స్ కోసం రిటైర్డ్ ఉద్యోగులు ఎదురు చూస్తున్నారు అని, ఈ బాధ నుండి తప్పించుకునేందుకు గత ప్రభుత్వం రిటైర్మెంట్ వయో పరిమితి పెంచిందని గుత్తా పేర్కొన్నారు.

ఆర్టీసీ కార్మికుల సమస్యలకు ప్రభుత్వం శాశ్వత పరిష్కారం చూపాలి

ఆర్టీసీ కార్మికులు తొందరపడి అనాలోచిత నిర్ణయాలు తీసుకోవద్దు అని, వారి సమస్యలను శాశ్వత ప్రాతిపదికన పరిష్కరించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని గుత్తా స్పష్టం చేశారు. ప్రతి ప్రభుత్వం లోనూ తమ సమస్యల పరిష్కారం కోసం కార్మికులు సమ్మె బాట పడుతున్నారని, వీలైనంత త్వరగా ప్రభుత్వం ఆర్టీసీ కార్మికుల సమ్మెను పరిష్కరించాలని గుత్తా సూచించారు. కార్మికుడు శంకరయ్య గౌడ్ ఆత్మహత్య పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ సమస్యలకు చర్చలే పరిష్కారమని, ఆత్మహత్యలు ఏ కుటుంబానికీ క్షేమ దాయకం కావని స్పష్టం చేశారు.

ఆర్టీసీ సమ్మె అయినా, ధాన్యం కొనుగోళ్లు అయినా వాస్తవాలు అన్ని పక్షాలకు తెలుసు అని, ప్రభుత్వం వైపు లోపం ఉంటే విపక్షాలు సలహాలు, సూచనలు చేయవచ్చు అని, కానీ ప్రతిదానికి విమర్శలు కరెక్ట్ కాదు అన్నారు.  రాష్ట్ర ఆర్థిక పరిస్తితి బాగోలేదు అని, వాస్తవాలను పక్కన పెట్టి ప్రతిపక్షాలు రాజకీయం చేయడం తప్పు అని, ప్రజలను, కార్మికులను, ఉద్యోగులను, యువతను రెచ్చగొట్టి ప్రయోజనం పొందాలి అని చూడవద్దు అని హితవు పలికారు.

కాళేశ్వరం ఆర్థిక భారం

కాళేశ్వరం ప్రాజెక్టు రాష్ట్రానికి ఆర్థిక భారం అని నిపుణులు చెబుతున్నారని, కాళేశ్వరంపై పీసీ ఘోష్ కమీషన్ చట్ట వ్యతిరేకం అని కేసీఆర్, హరీష్ రావు కోర్టుకు వెళ్ళారని, ఘోష్ కమీషన్ చట్టబద్ధమే అని కోర్టు స్పష్టం చేసిందని గుత్తా గుర్తు చేశారు.  కేవలం సెక్షన్ 8 కింద నోటీస్ ఇవ్వలేదు కాబట్టి వారిపై చర్యలు తీసుకోవద్దు అని మాత్రమే కోర్టు చెప్పిందని, అది సాంకేతిక అంశం మాత్రమేనని, వాస్తవాలు పక్కకు పెట్టి రాజకీయ పక్షాలు విమర్శ, ప్రతి విమర్శ చేసుకోవడం కరెక్ట్ కాదు అన్నారు. దాని వల్ల నష్టపోయేది ప్రజలేనని పేర్కొన్నారు. కాళేశ్వరం అంశంలో హైకోర్టు ఎవరికి క్లిన్ చిట్ ఇవ్వలేదని స్పష్టం చేశారు.

ఏకకాలంలో రైతు భరోసాతోనే రైతులకు ప్రయోజనం

రైతు భరోసా ఏకకాలంలో అందిస్తేనే రైతులకు ప్రయోజనం ఉంటుందని గుత్తా సుఖేందర్ రెడ్డి స్పష్టం చేశారు. కొన్ని ప్రాంతాల్లో బోనస్ వల్లే ప్రయోజనం ఉందని రైతులు అంటున్నారని, ఏదో ఒక స్కీమ్ ను పూర్తి స్థాయిలో అమలు చేస్తే రైతులకు ఉపశమనంగా ఉంటుందన్నారు. అకాల వర్షాలు కురిసే అవకాశం ఉన్నందునా యాసంగి ధాన్యం కొనుగోళ్లు త్వరగా పూర్తి చేయాలని, విత్తన రకాల వల్ల పలు చోట్ల ధాన్యంలో తాలు ఉందని మిల్లర్లు చెబుతున్నారని దీనిపై ప్రభుత్వం దృష్టి పెట్టాలని సూచించారు. ఇతర రాష్ట్రాల నుండి ధాన్యం వస్తుందని, మన దగ్గర పంట దిగుబడి పెరిగిందని ..అందుకే  బాయిల్డ్ రైస్ సేకరణ పెంచాలని కేంద్రానికి రాష్ట్రం విజ్ఞప్తి చేసిందన్నారు. దాని పట్ల కేంద్రం సానుకూలంగా స్పందించాలని కోరుతున్నానని తెలిపారు.  మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి , ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి  కేంద్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోలు విషయంలో సాయం చేయాలని కోరినప్పటికి కేంద్ర ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన లేకపోవడం విచారకరం అన్నారుే.

ఎన్నికల నాటి పరిస్థితుల మేరకు పోటీపై నిర్ణయం

యువత రాజకీయాల్లోకి రావాలని, వారికి అవకాశాలు రావాలని ఆకాంక్షించారు.  డీలిమిటేషన్ అమలు పరిణామాలు..అప్పటి రాజకీయ పరిస్థితు ఆధారంగా తాను  వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే విషయం  నిర్ణయిస్తానని గుత్తా  తెలిపారు.