Guttha Sukhender Reddy | సమావేశాలు సజావుగా సాగేందుకు సహకరించాలి

Guttha Sukhender Reddy విధాత: ఈనెల3వ తేది నుండి కొనసాగే శాసన సభ, శాసన మండలి సమావేశాలను సజావుగా, ప్రశాంతంగా నిర్వహించేందుకు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అధికార యంత్రాంగం అంతా సమన్వయంతో సాగి సహకరించాలని మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి, శాసన సభ స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డిలు కోరారు. మంగళవారం శాసనసభ ప్రాంగణంలోని కమిటీ హాల్ లో మండలి, అసెంబ్లీ సమావేశాల సన్నాహాకాలలో భాగంగా శాసన సభ వ్యవహారాల మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి, సీఎస్ శాంతికుమారి, డీజీపి అంజనీకుమార్ […]

  • By: krs    latest    Aug 01, 2023 1:01 AM IST
Guttha Sukhender Reddy | సమావేశాలు సజావుగా సాగేందుకు సహకరించాలి

Guttha Sukhender Reddy

విధాత: ఈనెల3వ తేది నుండి కొనసాగే శాసన సభ, శాసన మండలి సమావేశాలను సజావుగా, ప్రశాంతంగా నిర్వహించేందుకు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అధికార యంత్రాంగం అంతా సమన్వయంతో సాగి సహకరించాలని మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి, శాసన సభ స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డిలు కోరారు. మంగళవారం శాసనసభ ప్రాంగణంలోని కమిటీ హాల్ లో మండలి, అసెంబ్లీ సమావేశాల సన్నాహాకాలలో భాగంగా శాసన సభ వ్యవహారాల మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి, సీఎస్ శాంతికుమారి, డీజీపి అంజనీకుమార్ సహా ఉన్నతాధికారులతో ముందస్తు సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా గుత్తా సుఖేందర్ రెడ్డి మాట్లాడుతు దేశంలో ఏ రాష్ట్రం ప్రభుత్వం నిర్వహించని విధంగా ప్రశాంతంగా మన తెలంగాణ రాష్ట్ర శాసన మండలి, శాసన సభ సమావేశాలను నడుపుకుంటున్నామన్నారు. ఈ నెల 3 తేదీ నుండి జరిగే సమావేశాలను విజయవంతం చేయడానికి అందరూ సహకరించాలని కోరుతున్నామన్నారు. జిల్లాల్లో ప్రోటోకాల్ విషయంలో కొన్ని ఇబ్బందులు తలెత్తుతున్నాయని, ప్రోటోకాల్ విషయంలో వివాదాలు తలెత్తకుండా తగు చర్యలు తీసుకోవాలన్నారు. సమావేశాలు జరిగే సమయంలో అధికారులు తప్పక హాజరవ్వాలని, సమన్వయం తో రెండు సభలను సజావుగా నడిచేలా చూడాలని సూచించారు. సమావేశాలు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సజావుగా జరగడానికి పోలీసు శాఖ తరుపున చర్యలు తీసుకోవాలన్నారు.

సభ లోపలితో పాటుగా, పరిసరాలలో కూడా శాంతియుత వాతావరణం ఉన్నప్పుడే చర్చలు బాగా జరుగుతాయన్నారు. సభ్యులు సజావుగా శాసనసభకు చేరుకోవడానికి రహదారులపై అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు. స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతు తెలంగాణ రాష్ట్ర శాసనసభ సమావేశాల పనితీరు దేశంలోనే ఆదర్శంగా ఉన్నదన్నారు. ఈ ఘనత అధికార యంత్రాంగం సహకారంతోనే సాద్యమైందన్నారు. ప్రజాప్రతినిధులు, అధికారులు సమిష్టిగా పనిచేస్తే అద్భుతమైన ఫలితాలు వస్తాయన్నారు. అసెంబ్లీ సమావేశాలు పారదర్శకంగా జరిగి ప్రజలకు అన్ని విషయాలను తెలియజేయాల్సిన అవసరమున్నదన్నారు. గతంలో లాగానే ఈ సమావేశాలకు కూడా రాష్ట్ర ప్రభుత్వం, అధికారులు సహకారం అందించాలన్నారు. గత సమావేశాలకు సంబంధించిన ప్రశ్నలకు పెండింగులో ఉన్న జవాబులను వెంటనే పంపించాలని సూచించారు. సమావేశాలు జరిగినన్ని రోజులు ప్రభుత్వ శాఖల ఉన్నతాధికారులు అందుబాటులో ఉండాలన్నారు. ప్రతి శాఖ తరుపున ఒక నోడల్ అధికారిని నియమించాలని తెలిపారు.

సమావేశానికి ముందు సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు శాసనసభ భవనంలో నూతనంగా ఏర్పాటు చేసిన రెండు లిఫ్ట్ లను గుత్తా, పోచారం, మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డిలు ప్రారంభించారు. ఈ సమావేశంలో మండలి డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాశ్ ముదిరాజ్,శాసనసభ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్, శాసన , మండలి చీఫ్ విప్ భానుప్రసాద రావు, లెజిస్లేటివ్ సెక్రటరీ డా. వి. నరసింహా చార్యులు,
స్పెషల్ చీఫ్ సెక్రటరీ (ఫైనాన్స్) రామకృష్ణారావు, స్పెషల్ చీఫ్ సెక్రటరీ (ఎంఏ-యూడీ) అరవింద కుమార్, జీఎడి సెక్రటరీ శేషాద్రి, హోం శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జితేందర్, హైదరాబాద్ సిటీ పోలీసు కమిషనర్ సి.వి అనంద్, రాచకొండ కమీషనర్ డియస్ చౌహన్, సైబరాబాద్ కమీషనర్ స్టీఫెన్ రవీంద్ర, అసెంబ్లీ ఛీఫ్ మార్షల్ కరుణాకర్‌, కౌన్సిల్ చీఫ్ మార్షల్ సంజీవ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.