Heavy Rains | ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పొంగిపొర్లుతున్న వాగులు
Heavy Rains ప్రాజెక్టుల గేట్ల ఎత్తివేత గోపాలపూర్ ఇసుక క్వారీలో చిక్కుకున్న పదిమంది కార్మికులు ఓసీపిల్లో 12 వేల టన్నుల బొగ్గు ఉత్పత్తికి అంతరాయం కాళేశ్వరం వద్ద 9 మీటర్లకు చేరుకున్న గోదావరి పరివాహక ప్రాంతాల్లో ప్రమాద హెచ్చరికలు జారీ విధాత బ్యూరో, కరీంనగర్: ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా రెండు రోజులుగా కురుస్తున్న కుండపోత వానలకు.. చాలా ప్రాంతాలు జలమయమయ్యాయి. ఓవైపు వాగులు, వంకలు పొంగి పొర్లుతుండటంతో పలు గ్రామాలు, మండల కేంద్రాల మధ్య రాకపోకలకు అంతరాయం […]

Heavy Rains
- ప్రాజెక్టుల గేట్ల ఎత్తివేత
- గోపాలపూర్ ఇసుక క్వారీలో చిక్కుకున్న పదిమంది కార్మికులు
- ఓసీపిల్లో 12 వేల టన్నుల బొగ్గు ఉత్పత్తికి అంతరాయం
- కాళేశ్వరం వద్ద 9 మీటర్లకు చేరుకున్న గోదావరి
- పరివాహక ప్రాంతాల్లో ప్రమాద హెచ్చరికలు జారీ
విధాత బ్యూరో, కరీంనగర్: ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా రెండు రోజులుగా కురుస్తున్న కుండపోత వానలకు.. చాలా ప్రాంతాలు జలమయమయ్యాయి. ఓవైపు వాగులు, వంకలు పొంగి పొర్లుతుండటంతో పలు గ్రామాలు, మండల కేంద్రాల మధ్య రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఇంకోవైపు వరద పోటెత్తడంతో గోదావరి ఉప్పొంగుతోంది. హుజూరాబాద్, జమ్మికుంట, పెద్దపెల్లి, రామగుండం, వేములవాడ వంటిచోట్ల భారీవానకు కాలనీలు జలమయమయ్యాయి.
ఇండ్లలోకి నీరు చేరి ప్రజలు అవస్థలు పడుతున్నారు. ఆ నీటిని తొలిగించేందుకు నానా తిప్పలు పడుతూ.. మోటార్లు, పైపుల ద్వారా ఎత్తిపోస్తున్నారు. హుజూరాబాద్ ఉర్థూభవన్ కాలనీలో ఈ తీవ్రత ఎక్కువగా కనిపించింది. అటు జమ్మికుంటలోనూ కాలనీలు జలమయమయ్యాయి. మరోవైపు రామగుండం, పెద్దపెల్లిలోనూ కాలనీలు జలమయమై..ఇండ్లలోకి వాన నీరు వచ్చి చేరుతోంది.
ఇక ప్రాజెక్టులకు వరద పోటెత్తుతోంది. లోయర్ మానేరు డ్యాం పరివాహక ప్రాంత ప్రజలతో పాటు.. అటు ఎల్లంపల్లి, పార్వతీ బ్యారేజ్ పరివాహక ప్రాంతాల్లో అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ప్రజలు, గొర్లకాపరులు, మత్స్యకారులు, రజకులు ఎవరూ నదీ పరివాహక ప్రాంతాల్లో ఉండొద్దని సూచిస్తున్నారు. గోదావరికి కడెం నుంచి భారీగా వరద వస్తుండటంతో జగిత్యాల, పెద్దపెల్లి జిల్లాల్లోని గ్రామాలవారిని అప్రమత్తం చేస్తున్నారు.
ప్రాజెక్టులకు భారీ వరద..
భారీ వర్షాల కారణంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని ప్రాజెక్టులకు వరద నీరు పోటెత్తుతోంది.
కాళేశ్వరం వద్ద గోదావరి నీటిమట్టం 9 మీటర్లకు చేరుకోగా, లక్ష్మీ బ్యారేజ్ నుంచి ఐదు లక్షల క్యూసెక్కులు, అన్నారం బ్యారేజ్ నుంచి 1,30,000 క్యూసెక్కుల నీటిని దిగువకు వదిలి వేస్తున్నారు.
రామగుండం మండలం ఎల్లంపల్లి ప్రాజెక్టుకు భారీ వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో 32 గేట్లను అధికారులు ఎత్తివేశారు. ప్రాజెక్టులోకి 4,11,315 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతుండగా, 3,48,204 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు.
ఎల్లంపల్లి నీటి సామర్థ్యం 20.175 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 15.4788 టీఎంసీల నీరు నిల్వ ఉంది. కాళేశ్వరం అనుబంధ పార్వతి బ్యారేజ్ కు వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో 74 గేట్లగాను 54 గేట్లను ఎక్కిన అధికారులు నీటిని దిగువకు వదులుతున్నారు.
ప్రాజెక్టులోకి 1,74,000 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతుండగా, అదే స్థాయిలో నీటిని దిగువకు వదులుతున్నారు. ప్రాజెక్టు సామర్థ్యం 8.83 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 3.78 టీఎంసీల నీరు నిల్వ ఉంది. కరీంనగర్ లోని లోయర్ మానేరు డ్యామ్ కు క్రమేపి వరద నీరు వచ్చి చేరుతోంది.
ప్రాజెక్టులోకి 91,952 క్యూసెక్కుల వరద నీరు వస్తుండగా, 267 క్యూసెక్కుల వరద నీరు బయటకు వదులుతున్నారు. లోయర్ మానేరు నీటి సామర్థ్యం 24.34 టీఎంసీలు కాగా, ప్రస్తుతం15. 385 టీఎంసీల నీరు నిల్వ ఉంది.
రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలంలోని నర్మాల( ఎగువ మానేరు) ప్రాజెక్టుకు భారీగా వరద నీరు వచ్చిచేరుతుంది. ప్రాజెక్టుకు 1350 క్యూసెక్కుల వరద నీరు వస్తుండగా అదే స్థాయిలో నీరు బయటకు వెళ్తోంది. ప్రాజెక్టు నీటి సామర్థ్యం 2.20 టీఎంసీలు కాగా, ప్రస్తుతం పూర్తిస్థాయి నీటిమట్టంతో ఉంది.
ఇసుక క్వారీలో..
మంథని మండలం గోపాలపూర్ ఇసుక క్వారీలో పదిమంది కార్మికులు చిక్కుకుపోయారు. క్వారీ చుట్టూ వరద నీరు చేరుకోవడంతో వారిని రక్షించే ప్రయత్నాలు జరుగుతున్నాయి.
ఓసీపిల్లోకి వరద నీరు…
సింగరేణి రామగుండం రీజియన్ పరిధిలోని నాలుగు ఉపరితల గనుల్లో 1,20,000 టన్నుల బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. భారీ వర్షాల కారణంగా ఉపరితల గనుల్లోకి వర్షపు నీరు రావడంతో ఉత్పత్తికి అంతరాయం వాటిల్లింది. ఎడతెరిపిలేని వానల కారణంగా పలు ప్రాంతాలు జలమయం అయ్యాయి. వరద నీటిలో మునిగిన ఎన్ టి పి సి పరిధిలోని ఆటోనగర్, న్యూ పోరటపల్లి ప్రాంతాల ప్రజలను అక్కడి నుండి తరలించారు. వీరందరికీ పునరావాస శిబిరాల్లో సౌకర్యాలు కల్పించారు.
జమ్మికుంట, సిరిసిల్లలు జలమయం
కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణంలోని హౌసింగ్ బోర్డ్ కాలనీ చెరువులను తలపిస్తోంది.
రహదారులు జలమయమయ్యాయి. ఇళ్లలోకి భారీగా వర్షం నీరు వచ్చి చేరింది. గతంలోనూ ఇలాంటి పరిస్థితి ఏర్పడినా, అధికారుల పట్టింపులేని ధోరణి వల్ల తిరిగి పునరావృతం అయ్యిందని స్థానికులు ఆరోపిస్తున్నారు.
సిరిసిల్లలోనూ భారీ వర్షాల కారణంగా రాజన్న సిరిసిల్ల జిల్లా అతలాకుతలం అవుతోంది. ఫాజల్ నగర్ కల్వర్టుపై నుండి ఉధృతంగా వరద నీరు ప్రవహిస్తుండడంతో వేములవాడ, జగిత్యాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. వేములవాడ పట్టణంలోని మూలవాగు ఉధృతంగా ప్రవహిస్తోంది.
మల్లారం కల్వర్టుపై వరద నీటి కారణంగా వేములవాడ, హనుమాజీపేట మధ్య రాకపోకలను నిలిపివేశారు. వర్షాలతో భక్తులు రాకపోవడంతో నిత్యం రద్దీగా ఉండే వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయం వెలవెల పోతుంది. వేములవాడ మండలంలో అత్యధికంగా 12 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయింది.
వేములవాడ పట్టణానికి శాతరాజు పల్లి, మల్లారం గ్రామాలతో సంబంధాలు తెగిపోయాయి. ఇల్లంతకుంట మండలంలో బిక్కవాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో జవారిపేట గాలిపల్లి, నర్సక్క పేట గ్రామాల్లోని ఇళ్లలోకి వరద నీరు వచ్చి చేరింది. కోనరావుపేట మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, పోలీస్ స్టేషన్ వరదనీటిలో చిక్కుకున్నాయి.
మంథని డివిజన్ లో..
కరీంనగర్, భూపాలపల్లి జిల్లాల పరిధిలోకి వచ్చే మంథని నియోజకవర్గం గత మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలతో అతలాకుతలం అవుతోంది. మలహర్ మండలంలో మానేరు ఉధృతంగా ప్రవహిస్తుండడంతో, పివి నగర్, కుంభంపల్లి గ్రామాల్లోకి వరద నీరు వచ్చి చేరుకుంది. మండలంలోని ఆరెవాగు ఉదృతంగా ప్రవహిస్తోంది. మల్హర్ తహసిల్దార్ కార్యాలయం వరదనీటిలో చిక్కుకోవడంతో, అధికారులు సిబ్బంది అక్కడికి వెళ్లలేని పరిస్థితి.
ఇదే మండలంలోని ఖమ్మం పల్లి వంతెన పై నుండి వరద నీరు ప్రవహిస్తోంది. మహాముత్తారం మండలంలో పెద్దవాగు ఉధృతి దృశ్యా కాటారం మేడారం మధ్య వాహనాలు నిలిపివేశారు. గోదావరి సమీపంలో ఉండే పలివెుల మండలంలో మత్స్యకారులు చేపల వేటకు వెళ్లరాదని పోలీసు అధికారులు డప్పు చాటింపు వేయించారు. మహదేవపూర్ మండలంలో చింతపల్లి వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది