TSPSC Paper Leakage I ఉన్నతాధికారుల ఉదాసీనతే నిరుద్యోగులకు శాపం

సర్వీస్‌ కమిషన్‌ ఉద్యోగులు ఏ పరీక్ష రాయాలన్నా కార్యదర్శి అనుమతి తప్పనిసరి అంతేకాదు అనుమతి పొందిన ఉద్యోగులను సెలవులపై పంపాలి గ్రూప్‌-1 మెయిన్స్‌కి అర్హ‌త సాధించిన 8మంది సర్వీస్‌ కమిషన్‌ ఉద్యోగులు సిట్‌ దర్యాప్తులో సంచలన విషయాలు ఈ కేసును ఇద్దరికే పరిమితం చేసి చేతులు దులుపుకున్న‌ మంత్రి కేటీఆర్‌ ప్రభుత్వం, సర్వీస్‌ కమిషన్‌ చైర్మన్ ఏం సమాధానం చెబుతార‌ని ప్ర‌శ్నిస్తున్న నిరుద్యోగులు విధాత‌: టీఎస్‌పీఎస్సీ(TSPSC) ప్రశ్నపత్రాల లీకేజీ(Leakage of question papers)వ్యవహారంపై మంత్రి కేటీఆర్‌(KTR) స్పందిస్తూ.. […]

TSPSC Paper Leakage I ఉన్నతాధికారుల ఉదాసీనతే నిరుద్యోగులకు శాపం
  • సర్వీస్‌ కమిషన్‌ ఉద్యోగులు ఏ పరీక్ష రాయాలన్నా కార్యదర్శి అనుమతి తప్పనిసరి
  • అంతేకాదు అనుమతి పొందిన ఉద్యోగులను సెలవులపై పంపాలి
  • గ్రూప్‌-1 మెయిన్స్‌కి అర్హ‌త సాధించిన 8మంది సర్వీస్‌ కమిషన్‌ ఉద్యోగులు
  • సిట్‌ దర్యాప్తులో సంచలన విషయాలు
  • ఈ కేసును ఇద్దరికే పరిమితం చేసి చేతులు దులుపుకున్న‌ మంత్రి కేటీఆర్‌
  • ప్రభుత్వం, సర్వీస్‌ కమిషన్‌ చైర్మన్ ఏం సమాధానం చెబుతార‌ని ప్ర‌శ్నిస్తున్న నిరుద్యోగులు

విధాత‌: టీఎస్‌పీఎస్సీ(TSPSC) ప్రశ్నపత్రాల లీకేజీ(Leakage of question papers)వ్యవహారంపై మంత్రి కేటీఆర్‌(KTR) స్పందిస్తూ.. ఇద్దరు వ్యక్తులు చేసిన దుర్మార్గపు పనికి వ్యవస్థను ఆపాదిస్తారా? అన్నారు. కానీ సిట్‌(SIT) విచారణలో అనేక అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. మంత్రి నిరుద్యోగులకు భరోసా కల్పించాలనే ఉద్దేశంతో ప్రెస్‌మీట్‌(Pressmeet)లో ప్రతిపక్ష నేతలపై విరుచుకు పడ్డారు. కానీ ప్రభుత్వ వైఫల్యాన్ని అంగీకరించకపోవడం విషాదం. కమిషన్‌లో ఉన్నత ఉద్యోగుల ఉదాసీనత, అజమాయిషీ లేకపోవడం వల్ల నిందితులు ఇష్టారాజ్యంగా వ్యవహరించారని సిట్‌ దర్యాప్తు ద్వారా తెలుస్తున్నది. దీనికి ప్రభుత్వం ఏం సమాధానం చెబుతుంది? అని నిరుద్యోగులు ప్రశ్నిస్తున్నారు.

నిబంధనలు గాలికి వదిలి..

తాజాగా సిట్‌ దర్యాప్తులో వెల్లడవుతున్నవిషయాలు చూస్తుంటే తెలంగాణ సమాజమంతా విస్తుపోయేలా ఉన్నాయి. వాస్తవానికి సర్వీస్‌ కమిషన్‌ పనిచేసే ఉద్యోగులు ఏ పరీక్ష రాయాలన్నా కార్యదర్శి నుంచి ముందస్తు అనుమతి తీసుకోవాలి. అనుమతి పొందిన ఉద్యోగులను సెలవులపై పంపించాలి. లేకుంటే పరీక్షల వ్యవహారాలకు సంబంధించిన సెక్షన్ల నుంచి వారిని దూరంగా ఉంచాలనే నిబంధనలు ఉన్నాయి.

కానీ ఈ విషయాల్లో కమిషన్‌లోని ఉన్నతాధికారులు ఉదాసీనంగా వ్యవహరించినట్టు తెలుస్తోంది. గ్రూప్‌-1 రాయడానికి అనుమతి పొందిన ఉద్యోగులపై ఎలాంటి ఆంక్షలు పెట్టలేదు. ఫలితంగా వారు ఇష్టానుసారంగా వ్యవహరించారు. నిరుద్యోగులు, ఉద్యోగార్థులు రాత్రింబవళ్లూ కష్టపడుతూ.. ఏండ్ల తరబడి పోటీ పరీక్షలకు ప్రిపేర్‌ అవుతున్నారు. వాళ్ల ఆశలపై నిందితులు నీళ్లు చల్లారు. కానీ టీఎస్‌పీఎస్సీలో పనిచేసే ఉద్యోగులు తమ ఉద్యోగాలు చేసుకుంటూ పరీక్షలు రాయడం గమనార్హం

ఇద్దరు కాదు.. ఇరవై మంది ఉన్నారు..

ఇక మంత్రి గారు చెప్పినట్టు ఈ వ్యవహారం ఇద్దరితోనే ముడిపడి లేదు ఇరవై మంది ఉన్నారు. టీఎస్‌పీఎస్సీ ఉద్యోగుల్లో 20 మంది గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ పరీక్షలు రాసినట్టు సిట్‌ దర్యాప్తులో తేలింది. వారిలో 8 మంది మెయిన్స్‌కు అర్హత సాధించారు. అందులో ఇద్దరికి 100 పైగా మార్కులు వచ్చినట్టు వెల్లడైంది. అంతేకాదు వాళ్లిద్దరికి ఈ లీకేజీ వ్యవహారంతో సంబంధం ఉన్నదని సిట్‌ దర్యాప్తులో తేలడంతో వారిని అదుపులోకి తీసుకున్నారు.

ప్రశ్నపత్రాలు లీకేజీ అంశంపై సర్వీస్‌ కమిషన్ చైర్మన్‌ మాట్లాడుతూ.. ఈ కేసులో నిందితుడికి 103 మార్కులు వచ్చిన మాట వాస్తవమేనని, ఆయన అర్హత సాధించలేదు అన్నది నిజమని, అంతేకాదు ఆ మార్కులే అత్యధికం కాదు అంతకంటే ఎక్కువ వచ్చాయని వాదించారు.

అంతకంటే ఎక్కువ మార్కులు వచ్చిన వాళ్లు సర్వీస్‌ కమిషన్‌లో పనిచేసే రెగ్యులర్‌ ఉద్యోగి షమీమ్‌ 127, మరో ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగి రమేష్‌కు 122 మార్కులు వచ్చాయి. గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ పరీక్షలో మొత్తం 121 మందికి 100 మార్కులకు పైగా వచ్చాయి. అందులో ముగ్గురికి వందకు పైగా మార్కులు రాగా.. మరో 5 గురు కూడా మెయిన్స్‌కు అర్హత సాధించారు.

ప్రశ్నిస్తున్న విపక్ష నేతల గొంతు నొక్కే ప్రయత్నం

కమిషన్ నిర్వహించిన అత్యధిక మార్కులు సాధించిన మొదటి 20 మంది అభ్యర్థుల ఓఎంఆర్‌ పత్రాలు మరోసారి మాన్యువల్‌గా పరిశీలిస్తారు. కంప్యూటర్‌ మూల్యాంకనంలో ఏమైనా లోపాలు జరిగాయా? మార్కులు సరైనవేనా? అన్నది పరిశీలిస్తారు. కమిషన్‌ కార్యాలయంలో పనిచేసే ఇద్దరు ఉద్యోగులు షమీమ్‌, రమేష్‌లకు 120 పైగా మార్కులు వచ్చినా పరిపాలన, కాన్షిడెన్షియల్‌ విభాగాలకు చెందిన ఉన్నతాధికారులు గుర్తించకపోవడం వారి అలసత్వానికి నిదర్శనం.

సిట్‌ దర్యాప్తు ప్రారంభించముందే మంత్రి కేటీఆర్‌ ఈ కేసును ఇద్దరికే పరిమితం చేసి చేతులు దులుపుకునే ప్రయత్నం చేశారు. ఈ విషయంపైనే మంత్రిని రేవంత్‌ తప్పుపట్టారు. ప్రతిపక్ష నేతలుగా నిరుద్యోగుల పక్షాన ప్రభుత్వాన్ని నిలదీస్తున్న నేతలకు సిట్‌ నోటీసులు ఇచ్చి వారి గొంతు నొక్కాలనే ప్రయత్నం కంటే వాస్తవాలు తెలుసుకుని మంత్రి మాట్లాడితే బాగుండేదన్న అభిప్రాయం వ్యక్తమౌతున్నది.

30 లక్షల మంది నిరుద్యోగుల జీవితాలతో ప్రభుత్వం ఆడుకుంటున్నదని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సర్వీస్‌ కమిషన్‌లో 20 మంది గ్రూప్‌-1 పరీక్ష రాసినట్టు తేలింది. మొత్తం కమిషన్‌ ను పూర్తిగా ప్రక్షాళన చేయకుండా పరీక్షలు పారదర్శకంగా జరుగుతాయనే నమ్మకం తమకు లేదని వారు ఆరోపిస్తున్నారు.