IIT బాంబే క్యాంపస్‌లో భారీ మొసలి హల్‌చల్! విద్యార్ధులు, స్థానికుల పరుగులు
ఐఐటీ విద్యార్ధులు చదువులు ఎట్లా సాగుతున్నయో చూడాలనుకుందో ఏమోగాని ఓ భారీ మొసలి ముంబైలోని ప్రముఖ విద్యా సంస్థ ఐఐటీ బాంబే క్యాంపస్ లోకి ఎంటర్ ఇచ్చి అందరిని షాక్ కు గురి చేసింది. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది.

Crocodile In IIT Bombay Campus:
మహారాష్ట్ర రాజధాని ముంబైలోని ప్రముఖ విద్యా సంస్థ ఐఐటీ బాంబే క్యాంపస్ కు ఓ ఊహించని అతిధి రాక కలకలం రేపింది. ఐఐటీ విద్యార్ధులు చదువులు ఎట్లా సాగుతున్నయో చూడాలనుకుందో ఏమో గానీ ఓ భారీ మొసలి క్యాంపస్ లోకి ఎంటర్ ఇచ్చి అందరిని షాక్ కు గురి చేసింది. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. రాత్రి వేళ క్యాంపస్ లోకి చొరబడిన భారీ మొసలిని గమనించిన విద్యార్ధులు, స్థానికులు భయాందోళనలతో పరుగులు తీశారు. తను మాత్రం మెల్లగా క్యాంపస్ లో సంచరించ సాగింది.
సమాచారం అందుకున్న పోలీసులు, అటవీ శాఖ సిబ్బంది అక్కడకు చేరుకున్నారు. దానిని క్రమంగా అదిలించి స్వయంగా సమీపంలోని పావై(పద్మవతి ఆలయం) సరస్సులోకి వెళ్లిపోయేలా చేశారు. దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. తాజాగా జరిగిన ఈ ఘటనను కొందరు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా అది కాస్తా వైరల్ అయ్యింది.
ఈ వీడియోపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. ఐఐటీ బాంబేకి మొసలి కూడా చదువుకోవడానికి వచ్చి ఉంటుందని కొందరు సరదాగా వ్యాఖ్యానించారు. మరికొందరేమో పావై సరస్సు సమీపంలో ఉండటం వల్ల ఇలాంటి సంఘటనలు సాధారణమని కామెంట్ చేశారు. రెస్కింక్ అసోసియేషన్ ఫర్ వైల్డ్ లైఫ్ వెల్ఫేర్ వ్యవస్థాపక అధ్యక్షుడు, వన్యప్రాణుల సంరక్షుడు పవన్ శర్మ మాట్లాడుతూ ఆ మొసలి గుడ్లు పెట్టడానికి గూడు కట్టుకునే స్థలాన్ని వెతుకుతున్న ఆడ మొసలి కావచ్చుని అభిప్రాయపడ్డారు. కావాల్సిన స్థల ఎంపిక శోధనలో సరస్సు విడిచి పాకుతూ సమీప క్యాంపస్ లోకి వచ్చి ఉండవచ్చని తెలిపారు.