నేను పార్టీ మారలే.. వెళ్లగొట్టారు ఈట‌ల రాజేంద‌ర్‌

నేను పార్టీ మారలే.. వెళ్లగొట్టారు ఈట‌ల రాజేంద‌ర్‌

ఘర్‌ వాపసీకి 104మంది అసెంబ్లీలో మద్దతిచ్చారు

కేసీఆర్ ఇచ్చిన హామీలన్నీ నీటి మూటలే

నేను పార్టీ మారలే…వెళ్లగొట్టారు బీజేపీ ఎమ్మెల్యే ఈట‌ల రాజేంద‌ర్‌

విధాత, హైద‌రాబాద్‌ : పార్టీలు మారడం అంటే చొక్కాలు మార్చినంత ఈజీ కాద‌న్నారు బీజేపీ ఎమ్మెల్యే, పార్టీ ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్ ఈటల రాజేందర్. తాను పార్టీ మార‌లేద‌ని, పార్టీ నుంచి వెళ్లగొట్టారని, అసెంబ్లీలో ఘ‌ర్ వాప‌స్ ఈట‌ల అంటే 104 మంది స‌భ్యులు బ‌ల్ల‌లు గుద్ది చెప్పార‌న్నారు. దాన్ని బట్టి చూస్తే తెలుస్తుంది నా వ్య‌క్తిత్వం ఏంటో అని వెల్ల‌డించారు. గురువారం బీజేపీ రాష్ట్రకార్యాల‌యంలో ఆయ‌న మీడియా స‌మావేశంలో మాట్లాడారు. ప్రజల నమ్మకాన్ని ఒడిసి పట్టుకున్న నేతనని, నాకంటూ ఎవరూ శత్రువులు లేరన్నారు. ఒకవేళ అలా ఎవరైనా భావిస్తే వారిష్టానికే వదిలేస్తున్నాన‌ని తెలిపారు. ప్రజలను, ధర్మాన్ని, శ్రమను నమ్ముకున్న వ్యక్తి ఈటల రాజేందర్ అని చెప్పుకున్నారు.

తెలంగాణ ప్రజల హృదయాల్లో చోటు సంపాదించుకున్నారన్నారు. నా ఫోటో హుజూరాబాద్ ప్రజల గుండెల్లో ఉంటుందని పేర్కొన్నారు. ఈట‌ల‌ పార్టీ మారుతానని కొందరు భావిస్తున్నారు. ఇప్పటికే వంద సార్లు చెప్పాన‌ని, ఏ పార్టీలో చేరేది లేదని స్పష్టం చేశానన్నారు.. రాష్ట్రంలో కొన్ని పత్రికలు, చానళ్లు రోత రాత‌లు రాస్తున్నాయ‌ని ఆరోపించారు. ఏ రాజకీయ నాయకుడైనా హమీలు ఇచ్చాడంటే అమలు చేయాలి కానీ సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీలన్నీ నీటి మూటలయ్యాయని విమ‌ర్శించారు.

75 ఏళ్ల స్వతంత్ర భారతంలో మహిళల దశాబ్ధాల నిరీక్షణకు తెరదించుతూ, వారి ఆకాంక్షను నెరవేరుస్తూ, చట్టసభల్లో 33 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు ఉద్దేశించిన ‘నారీశక్తి వందన్‌ అధినియమ్‌’బిల్లును ప్రవేశపెట్టడంతో పాటు ఆమోదించేందుకు కృషిచేసిన ప్రధానినరేంద్ర మోదీకి ధన్యవాదాలు తెలిజేశారు. డిక్లరేషన్‌ల పేరుతో కొందరూ ఊదరగొడుతున్నారని, సంక్షేమ పథకాలను ఉద్దేశిస్తూ తన అమ్ముల పొదలో అనేక అస్త్రాలున్నాయని కేసీఆర్ స్వయంగా అసెంబ్లీ వేదికగా చెప్పిండన్నారు.

హుజురాబాద్ ఉపఎన్నికల సమయంలో రాజు తలచుకుంటే దెబ్బలకు కొదవా ఎన్ని కష్టాలైనా దళితబంధు కోసం రూ.2 లక్షల కోట్లు అమలు చేస్తానన్నాడని, మనసుంటే మార్గముంటదని చెప్పిన వ్యక్తీ కేసీఆరే అన్నారు. అనేక హామీలిచ్చిన కేసీఆర్ ఇప్పుడు ఆ హామీలు ఎందుకు అమలు చేయలేదు? మనసు లేకనా,..? డబ్బులు లేకనా..? అని ఎద్దేవా చేశారు. హామీలివ్వడం కాదు అమలు చేయడం ముఖ్యమని నేను చెప్తే కొద్దిమంది కత్తిలేనోడు, నెత్తిలేనోడు అంటూ కేసీఆర్ అవహేళన చేసిండన్నారు. కేసీఆర్ తీరు ఒడ్డు దాటే దాకా ఓడ మల్లన్న, ఒడ్డు దాటినాక బోడ మల్లన్న అన్న మాదిరిగా ఉందన్నారు.

రింగురోడ్డు, కోకాపేట భూమల అమ్మకం, మద్యం దుకాణాల టెండర్ల ద్వారా వచ్చిన ఆదాయంతో రుణమాఫీ చేస్తున్నారని విమ‌ర్శించారు. 3 నెలల ముందుగానే మద్యం దుకాణాల టెండర్లు వేయడమే కాకుండా వైన్ టెండర్ల పేరుతో వ్యాపారస్తుల నుంచి రూ. 2,600 కోట్లు జేబులు కత్తిరించారని తెలిపారు. గతంలో ఎమ్మార్వో కు దరఖాస్తు చేసుకుంటే పెన్షన్ వచ్చేది ఇప్పుడు కేసీఆర్ ఓకే చేస్తే తప్ప పెన్షన్ వచ్చే పరిస్థితి లేదన్నారు. డబ్బు లేకనే ఈ పథకాలను అమలు చేయడం లేదని ఈట‌ల విమ‌ర్శించారు.

రాష్ట్రం దివాళా తీసింది అని ప్రచారం చేసే కాంగ్రెస్ వారిచ్చే హామీలు ఎలా అమలు చేస్తారో ఎందుకు చెప్పడం లేదని ప్ర‌శ్నించారు. ప్రతి మహిళకు రూ. 2,500 చొప్పున పెన్షన్ ఇస్తామన్న కాంగ్రెస్ అందులో ఏ మహిళలకు ఇస్తారు, ఏ వయస్సు వారికి ఇస్తారు? ఎంత మందికి ఇస్తారనేది ఎందుకు చెప్పడం లేదన్నారు. గతంలో ఆర్థిక మంత్రి గా పనిచేసిన అనుభవంతో చెబుతున్నానని కాంగ్రెస్ వారు ఏది పడితే ఆ పథకం ప్రకటించకండని వెల్ల‌డించారు.

ఆర్థిక మంత్రి గా పని చేసిన తనకు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పై అవగాహన ఉందన్నారు. కేంద్ర ప్రభుత్వ అండ దండలతో సాధ్యమయ్యే మంచి స్కీమ్ లను తెలంగాణలో ప్రవేశ పెడతామ‌న్నారు. అధిష్టానంతో, పార్టీ ఏర్పాటు చేసిన కమిటీ ఆధ్వర్యంలో రైతులు, కౌలు రైతులు, మహిళలు అన్ని వర్గాల ప్రజలకు ఏం అవసర‌మో అమలుకు నోచుకునే అంశాలతో కూడిన మేనిఫెస్టోను రూపొందిస్తామ‌న్నారు. అలాగే జాతీయ నాయకత్వంతో మాట్లాడి ప్రజలకు మంచి చేసే పథకాలు ప్రకటిస్తామ‌ని ఈట‌ల రాజేంద‌ర్ వెల్ల‌డించారు. ఈ సమావేశంలో బీజేపీ రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ ప్రకాష్ రెడ్డి , మాజీ జడ్పీ చైర్మన్‌ తుల ఉమా , అశ్వద్ధామ రెడ్డి , సుభాషిణి , తదితర నాయకులు పాల్గొన్నారు.