Oscars 2026 | నిరాశలో ఇండియన్ ఫ్యాన్స్ … నామినేషన్స్‌లో చోటు దక్కించుకోలేకపోయిన హోమ్ బౌండ్,మహావతార్ నరసింహ
Oscars 2026 |ప్రతిష్టాత్మక ఆస్కార్ అవార్డుల వేడుకకు రంగం సిద్ధమవుతోంది. 98వ అకాడమీ అవార్డుల కార్యక్రమం 2026 మార్చి 15న లాస్ ఏంజెలెస్‌లోని డాల్బీ థియేటర్‌లో ఘనంగా జరగనుంది. ఇందుకు సంబంధించిన నామినేషన్ల జాబితాను 2026 జనవరి 22న అకాడమీ అధికారికంగా వెల్లడించింది.
Oscars 2026 |ప్రతిష్టాత్మక ఆస్కార్ అవార్డుల వేడుకకు రంగం సిద్ధమవుతోంది. 98వ అకాడమీ అవార్డుల కార్యక్రమం 2026 మార్చి 15న లాస్ ఏంజెలెస్‌లోని డాల్బీ థియేటర్‌లో ఘనంగా జరగనుంది. ఇందుకు సంబంధించిన నామినేషన్ల జాబితాను 2026 జనవరి 22న అకాడమీ అధికారికంగా వెల్లడించింది. 2025 జనవరి నుంచి డిసెంబర్ మధ్య విడుదలైన చిత్రాలు ఈ ఆస్కార్ పోటీలో నిలవనున్నాయి. ‘ఆర్ఆర్ఆర్’ సినిమా ఆస్కార్ విజయం తర్వాత భారతదేశంలో కూడా ఈ అవార్డులపై ఆసక్తి, క్రేజ్ మరింతగా పెరిగిన విషయం తెలిసిందే. అయితే ఈ సారి కూడా భారతీయ సినిమా ఆస్కార్స్‌లో సత్తా చాటుతుందని ఎన్నో ఆశలు పెట్టుకున్న ఫ్యాన్స్‌కి నిరాశే మిగిలింది.
కొద్ది రోజుల క్రితం 98వ అకాడమీ అవార్డుల కోసం మొత్తం 12 విభాగాల్లో ఎంపికైన చిత్రాల షార్ట్‌లిస్ట్‌ను అకాడమీ విడుదల చేసింది. ‘సంక్రాంతికి వస్తున్నాం’, ‘కుబేరా’, ‘పుష్ప 2’, ‘గాంధీతాత చెట్టు’, ‘కన్నప్ప’ వంటి సినిమాలు వివిధ దశల్లో పోటీ పడి చివరికి రేసు నుంచి తప్పుకున్నాయి. అయితే, ఈ జాబితాలో భారత్‌కు గర్వకారణంగా నిలిచింది ‘హోమ్ బౌండ్’ సినిమా. దర్శకుడు నీరజ్ ఘైవాన్ తెరకెక్కించిన ‘హోమ్ బౌండ్’ చిత్రాన్ని ఉత్తమ అంతర్జాతీయ ఫీచర్ ఫిల్మ్ కేటగిరీలో అకాడమీ షార్ట్‌లిస్ట్ చేయడం విశేషం. ఈ సినిమాలో జాన్వీ కపూర్, ఇషాన్ ఖట్టర్, విశాల్ జెత్వా ప్రధాన పాత్రల్లో నటించారు. కోవిడ్ లాక్‌డౌన్ నేపథ్యంలో తమ స్వగ్రామాలకు చేరుకునేందుకు ప్రయత్నించే ఇద్దరు నిరుపేద ఉత్తర భారతీయ యువకుల కథ ఈ చిత్రానికి ప్రాణం.
చందన్ అనే దళిత యువకుడు, షోయిబ్ అనే ముస్లిం యువకుడు ఎదుర్కొనే సామాజిక అసమానతలు, కుల వివక్ష, పేదరికం, ఉద్యోగాల కోల్పోవడం వల్ల కలిగే మానసిక వేదనలను ఈ సినిమా హృదయాన్ని తాకేలా చూపించింది. నిజ జీవిత సంఘటనల ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రం ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. షార్ట్ లిస్ట్‌కి ఎంపికైన ఈ చిత్రం నామినేషన్స్‌లో చోటు దక్కించుకోలేకపోయింది. దీంతో ఈ సారి భారతీయ చిత్రానికి ఆస్కార్ దక్కుతుందని ఎన్నో కలలుగన్న ఫ్యాన్స్ కి నిరాశే మిగిలింది. రేయాన్ కూగ్లర్ దర్శకత్వం వహించిన ‘సిన్నర్స్’ చిత్రం ఏకంగా 16 విభాగాల్లో నామినేషన్లు దక్కించుకుని సరికొత్త రికార్డ్ సృష్టించింది. గతంలో ‘టైటానిక్’, ‘లా లా ల్యాండ్’ పేరిట ఉన్న 14 నామినేషన్ల రికార్డును బ్రేక్ చేసింది.
మరోవైపు బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించిన యానిమేటెడ్ చిత్రం ‘మహావతార్ నరసింహ’ కూడా షార్ట్ లిస్ట్‌కి ఎంపిక కాగా, నామినేషన్స్‌లో మాత్రం చోటు దక్కించుకోలేకపోయింది. అశ్విన్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా మహావిష్ణువు అవతారమైన నరసింహుని కథాంశంతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. విడుదలైన కొద్ది రోజుల్లోనే రూ.300 కోట్లకు పైగా వసూళ్లు సాధించి అందరినీ ఆశ్చర్యపరిచిన ఈ చిత్రం నామినేషన్స్‌లో లేకపోవడం ఫ్యాన్స్‌కి నిరాశని కలిగించింది. మొత్తంగా 98వ ఆస్కార్ అవార్డుల్లో భారత్‌కు చెందిన ‘హోమ్ బౌండ్’, ‘మహావతార్ నరసింహ’ చిత్రాలు సత్తా చాటుతాయని ఎన్నో కలలు కనగా, వారి ఆశలు అడియాశలు అయ్యాయి.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram