ఖమ్మంలో పోటీ చేసే హక్కు నా ఒక్కదానిదే..మాజీ ఎంపీ రేణుకా చౌదరి
ఖమ్మంలో ఎంపీగా పోటీ చేసే హక్కు తన ఒక్కదానికే ఉందని మాజీ ఎంపీ రేణుకా చౌదరి స్పష్టం చేశారు.

విధాత : ఖమ్మంలో ఎంపీగా పోటీ చేసే హక్కు తన ఒక్కదానికే ఉందని మాజీ ఎంపీ రేణుకా చౌదరి స్పష్టం చేశారు. గురువారం ఖమ్మంలో ఆమె మీడియాతో మాట్లాడారు. ఖమ్మం ఎంపీగా పోటీ చేస్తానన్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సతీమణి నందిని వ్యాఖ్యలను మీడియా ప్రతినిధులు ఆమె ముందు ప్రస్తావించారు. దీనిపై ఘాటుగా స్పందించిన రేణుకా చౌదరి కొత్త కొత్తగా వచ్చిన వాళ్ళు చెప్పేవి అన్నీ కథలేనని, వాటిని నమ్మాల్సిన పనిలేదని చెప్పారు. అటువంటి వారి మాటల పట్ల భ్రమ పడొద్దన్నారు. రేణుకా చౌదరి కోరిందంటే కాదనే శక్తి ఎవరికీ లేదని స్పష్టం చేశారు. ఆమె తన వ్యాఖ్యల ద్వారా పరోక్షంగా భట్టి విక్రమార్క సతీమణి నందినికి గట్టి కౌంటర్ ఇచ్చేశారు. సోనియా గాంధీని ఖమ్మం నుంచి పోటీ చేయాలని కోరామని, ఆమె నిర్ణయం వెల్లడించే వరకు ఓపికతో ఉండాలని కార్యకర్తలకు సూచించారు. సోనియా గాంధీ పోటీ చేయకపోతే అభ్యర్థిని తానేనని, ఇంకెవరికీ పోటీ చేసే చాన్స్ లేదని స్పష్టం చేశారు.
అయోధ్య రామమందిరాన్ని ఎన్నికల కోసం వాడుకోవడానికి బీజేపీ ప్రయత్నిస్తోందని, ఆలయ నిర్మాణం పూర్తి కాకముందే ప్రాణప్రతిష్ఠ చేయడం సరికాదని రేణుకా చౌదరి అన్నారు. తన దృష్టిలో హిందువుగా పుట్టడం అదృష్టమని, తనకు బీజేపీ సర్టిఫికెట్ అవసరం లేదన్నారు. అయోధ్యకు వాళ్లు ఆహ్వానిస్తే వెళ్లాల్సిన అవసరం లేదని, తన ఇష్టం వచ్చినప్పుడు వెళ్తానన్నారు. మీ అనుమతులు అవసరం లేదు. మీ సర్టిఫికేట్ అవసరం లేదని వ్యాఖ్యానించారు. ఈ నెల 22 తరువాత పార్లమెంటు ఎన్నికల నోటిఫికేషన్ వస్తుందని తెలిపారు.
అసెంబ్లీ ఎన్నికల్లో హామీ ఇచ్చినట్టుగా వంద రోజులలో ఆరు గ్యారంటీలు అమలు చేస్తామని చెప్పారు. నిరుద్యోగ సమస్య పైనే రాష్ట్రంలో తమ ప్రభుత్వం ఏర్పడిందని, ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం కార్యాచరణ ప్రారంభించిదని తెలిపారు. ఉద్యోగం లేకపోతే యువతకు పెళ్లిళ్లు కావడం లేదన్నారు. జిల్లాకు చెందిన ముగ్గురు మంత్రులు ఖమ్మం అభివృద్ధికి పాటుపడతారన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. తమ పార్టీ కార్యకర్తలపై పువ్వాడ అజయ్ కేసులు పెట్టారని, ఆయన సాగించిన భూఅక్రమాలపై పోరాటం చేస్తామన్నారు. కాంగ్రెస్ కార్యకర్తలు పదవులు లేకుండా ఉన్నారని, వారికి న్యాయం చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి సూచించారు.
రాజకీయాల్లో గోడలు మారవచ్చు..పునాదాలు మారవు
రాజకీయాల్లో గోడలు మారొచ్చు కాని, పునాదులు మారవని రేణుకాచౌదరి అన్నారు. ఖమ్మంలో ఎన్‌టీఆర్ వర్ధంతి సభలో ఆమె నివాళుర్పించి మాట్లాడారు. పదేళ్లుగా రాక్షస పాలన కొనసాగించిన బీఆరెస్‌ను టీడీపీ మద్దతుతోనే ఇంటికి తరిమామన్నారు. అధికారంలో లేకపోయినా తెలుగుదేశం పార్టీ బతికి ఉందంటే అది ఎన్టీఆర్ నేర్పిన క్రమశిక్షణ వల్లే అని చెప్పారు. ఎలాంటి రాజకీయ నేపథ్యం లేని తనలాంటి ఎంతో మందిని ఎన్టీఆర్ రాజకీయాల్లోకి తీసుకొచ్చారన్నారు. తన పార్టీలో ఉన్న ఏకైక మగాడు రేణుక అని ఎన్టీఆర్ అనేవారని గుర్తు చేసుకున్నారు.
తాను ఖమ్మం జిల్లా ఆడబిడ్డనని, తనకు కొత్తకొత్త బిరుదులు ఇచ్చి ఈ ప్రాంతానికి దూరం చేయవద్దని రేణుక కోరారు. చంద్రబాబు, రేవంత్ రెడ్డి సీఎంలుగా రాణిస్తున్నారంటే అది దివంగత ఎన్టీఆర్ నేర్పిన నైపుణ్యమని కేంద్ర మాజీ మంత్రి రేణుకా చౌదరి అన్నారు. ఎన్టీఆర్ వర్ధంతి సభలో పాల్గొనే అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుతున్నానన్నారు.