Bank | పట్టపగలే బ్యాంకులో చోరీ.. కేవలం 5 నిమిషాల్లో రూ.14 లక్షలతో ఉడాయించిన దొంగలు
Bank | Gujarat | Surat గుజరాత్‌లో దోపిడీ దొంగలు రెచ్చిపోయారు. పట్టపగలే బ్యాంకులోకి ప్రవేశించిన ఐదుగురు దొంగలు.. బ్యాంకు సిబ్బంది, కస్టమర్లను ఓ గది బంధించి, అందిన కాడికి దోచుకున్నారు. కేవలం 5 నిమిషాల్లోనే 14 లక్షలతో దొంగలు ఉడాయించారు. ఈ ఘటన గుజరాత్‌లోని సూరత్‌లో ఈ నెల 11వ తేదీన ఉదయం 11 గంటల సమయంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. సూరత్‌లో బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర వద్దకు ఐదుగురు దొంగలు రెండు బైక్‌లపై చేరుకున్నారు. […]

Bank | Gujarat | Surat
గుజరాత్‌లో దోపిడీ దొంగలు రెచ్చిపోయారు. పట్టపగలే బ్యాంకులోకి ప్రవేశించిన ఐదుగురు దొంగలు.. బ్యాంకు సిబ్బంది, కస్టమర్లను ఓ గది బంధించి, అందిన కాడికి దోచుకున్నారు. కేవలం 5 నిమిషాల్లోనే 14 లక్షలతో దొంగలు ఉడాయించారు. ఈ ఘటన గుజరాత్‌లోని సూరత్‌లో ఈ నెల 11వ తేదీన ఉదయం 11 గంటల సమయంలో చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే.. సూరత్‌లో బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర వద్దకు ఐదుగురు దొంగలు రెండు బైక్‌లపై చేరుకున్నారు. ఆ ఐదుగురు కూడా హెల్మెట్లు ధరించి బ్యాంకులోకి ప్రవేశించారు. రాగానే తుపాకులతో సిబ్బందిని, ఖాతాదారులను బెదిరించారు.
అనంతరం వారందరిని ఓ గదిలో బంధించారు. కౌంటర్లు, లాకర్లలో ఉన్న నగదును తమ బ్యాగుల్లో నింపుకున్నారు. ఈ క్రమంలో ఓ మహిళ తన ఇద్దరు పిల్లలతో బ్యాంకులోకి ప్రవేశించగా, ఓ దొంగ వారి వద్దకు వెళ్లి.. బయటకు వెళ్లనివ్వకుండా ఆపాడు. ఆ మహిళను కూడా సిబ్బంది వద్దే బంధించి, నగదుతో ఉడాయించారు.
సినీ ఫక్కీలో జరిగిన ఈ చోరీ దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. సీసీటీవీ ఫుటేజీల ఆధారంగా దొంగల కోసం గాలిస్తున్నారు. మొత్తం రూ. 14 లక్షలు దోచుకున్నట్లు బ్యాంకు అధికారులు పోలీసులకు తెలిపారు. ఈ చోరీ ఘటనతో సూరత్ ఉలిక్కిపడింది.