మద్యం మత్తులో కారులో నుంచి బయటకు తోసి.. 25 కి.మీ. ఈడ్చుకెళ్లారు
మందు బాబు అత్యుత్సాహానికి పాల్పడ్డాడు. తన వెంట కారులో ప్రయాణిస్తున్న బంధువును బలవంతంగా కారులో నుంచి బయటకు తోసేశాడు.

భోపాల్ : ఓ మందు బాబు అత్యుత్సాహానికి పాల్పడ్డాడు. తన వెంట కారులో ప్రయాణిస్తున్న బంధువును బలవంతంగా కారులో నుంచి బయటకు తోసేశాడు. అనంతం అతన్ని 25 కిలోమీటర్ల ఈడ్చుకెళ్లడంతో అతను ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లోని సీహోర్ జిల్లాలో ఆదివారం రాత్రి చోటు చేసుకోగా, ఆలస్యంగా వెలుగు చూసింది.
వివరాల్లోకి వెళ్తే.. భోపాల్‌లోని అవధ్‌పురి ప్రాంతానికి చెందిన సందీప్ నక్వాల్(33), తన బంధువులైన సంజీవ్ నక్వాల్, రాజేశ్ చాదర్‌లతో కలిసి రాజస్థాన్‌లోని ఓ ఫ్యామిలీ ఫంక్షన్‌కు హాజరయ్యారు. తిరుగు ప్రయాణంలో సీహోర్ వద్ద కారు ఆపారు. అక్కడ మద్యం, ఆహారం కొనుగోలు చేశారు. కారులోనే మద్యం సేవించారు. అయితే కారు వెనుక సీటులో కూర్చొన్న సందీప్, సంజీవ్ మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. దీంతో సంజీవ్ ఆగ్రహంతో సందీప్‌ను కారు నుంచి బయటకు తోశాడు.
అయితే సందీప్ సీట్ బెల్ట్ పెట్టుకోవడంతో అతను రోడ్డుపై పడిపోలేదు. తల భాగం బయటకు వేలాడుతూ ఉంది. అయినప్పటికీ కారును 25 కిలోమీటర్ల దూరం తీసుకెళ్లారు. సందీప్‌ను కూడా ఈడ్చుకెళ్లారు. ఇతర వాహనదారులు గమనించి కారును ఆపారు. అనంతరం పోలీసులకు సమాచారం అందించారు.
స్థానికంగా ఉన్న టోల్ ప్లాజా వద్ద పోలీసులు కారును అడ్డుకున్నారు. కారులో ఉన్న సంజీవ్, రాజేశ్‌ను అదుపులోకి తీసుకున్నారు. అప్పటికే మరణించిన సందీప్ డెడ్‌బాడీని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనకు ముందు సందీప్ భార్య ఫోన్ చేయడంతో కారులో జరిగిన సంభాషణ ఆమె విన్నది. సందీప్ భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు