Independence Day | ప్రధాని ఎర్రకోట పైనే జెండా ఎగరేయాలా? అసలు దాని ప్రాధాన్యం ఏంటి?
Independence Day | విధాత: స్వాతంత్య్ర దినోత్సవం అనగానే అందరికీ గుర్తొచ్చే తొలి అంశం ఎర్రకోట (Red Fort). చరిత్రలో ఎన్నో పోరాటాలు, తిరుగుబాట్లు, కుట్రలు కుతంత్రాలకు సజీవ సాక్ష్యంగా నిలిచిన ఈ 16వ శతాబ్దపు కట్టడం.. ప్రస్తుతం ప్రజాస్వామ్య భారత విజయగాథను ఏటా దగ్గరుండి నడిపిస్తోంది. స్వాతంత్య్రం వచ్చిన 1947 ఆగస్టు 15 నుంచి ఇప్పటి వరకు అక్కడే ప్రతి ప్రధాని జెండాను ఎగరేస్తున్నారు. దీనికి కారణం ఏమిటి? అసలు ఎర్రకోట చరిత్ర ఏంటి? మొఘలుల […]

Independence Day |
విధాత: స్వాతంత్య్ర దినోత్సవం అనగానే అందరికీ గుర్తొచ్చే తొలి అంశం ఎర్రకోట (Red Fort). చరిత్రలో ఎన్నో పోరాటాలు, తిరుగుబాట్లు, కుట్రలు కుతంత్రాలకు సజీవ సాక్ష్యంగా నిలిచిన ఈ 16వ శతాబ్దపు కట్టడం.. ప్రస్తుతం ప్రజాస్వామ్య భారత విజయగాథను ఏటా దగ్గరుండి నడిపిస్తోంది. స్వాతంత్య్రం వచ్చిన 1947 ఆగస్టు 15 నుంచి ఇప్పటి వరకు అక్కడే ప్రతి ప్రధాని జెండాను ఎగరేస్తున్నారు. దీనికి కారణం ఏమిటి? అసలు ఎర్రకోట చరిత్ర ఏంటి?
మొఘలుల కాలం నాటిది
తాజ్‌మహల్ (Taj Mahal) ను నిర్మించిన మొఘల్ చక్రవర్తి షాజహానే (Shajahan) ఎర్రకోటనూ నిర్మించాడు. 1638 – 1649 మధ్య కాలంలో దీని నిర్మాణం జరిగి ఉంటుందని పరిశోధకులు అంచనా వేశారు. ఈ నిర్మాణం పూర్తయిన దగ్గర నుంచి సిపాయిల తిరుగుబాటు జరిగిన 1857 వరకు దిల్లీనే రాజధానిగా చేసుకుని మొఘలులు పరిపాలించారు. అయితే ఔరంగజేబు హయాం తర్వాత ఈ కోట ప్రభ మసకబారడం ప్రారంభించింది. ఆయన తర్వాత వచ్చిన మొఘల్ రాజులు సరైన వారు కాకపోవడంతో ఇరాన్ నుంచి దెండెత్తి వచ్చిన నాదిర్ షా ఎర్రకోటను దొరికిన కాడికి దోచుకుని లూటీ చేశాడు.
అలాగే 18వ శతాబ్దంలో మరాఠాలు, జాట్‌లు, సిక్కులు, గుజ్జర్లు వరస దాడులు చేయడంతో మరింత కళావిహీనంగా మారింది. ఆఖరికి 1803లో దిల్లీని చేజిక్కించుకున్న ఆంగ్లేయులు.. ఎర్రకోటను చేజిక్కించుకున్నాకా గానీ భారత్‌పై పూర్తి పట్టు సాధించినట్లు చెప్పుకోలేదు.
అయితే అందులోనే మొఘల్ చక్రవర్తిని పేరుకు పరిపాలకుడిగా పెట్టారు. 1857 తిరుగుబాటు నేపథ్యంలో తిరుగుబాటు దారులు ఎర్రకోటకు వచ్చి అప్పటి చక్రవర్తి బహదూర్ షా జాఫర్‌ను తమకు నేతృత్వం వహించాలని అడగడంతో బ్రిటిషర్లు ఎర్రకోటను పూర్తిగా స్వాధీనం చేసుకుని దానినే తమ పరిపాలనకు కేంద్రంగా మార్చేశారు.
ఈ తిరుగుబాటునే చరిత్రకారులు తొలి స్వాతంత్య్ర ఉద్యమంగా పేర్కొనడంతో ఎర్రకోట కూడా భారతీయుల స్వాతంత్య్రానికి గుర్తుగా మారిపోయింది. నేతాజీగా పిలుచుకునే సుభాష్ చంద్రబోస్ సైతం ఎర్రకోటను ఆంగ్లేయుల శ్మశానంగా మార్చిన తర్వాతే స్వాతంత్య్రం వచ్చినట్లని వ్యాఖ్యానించడం విశేషం. అంతేకాకుండా ఆయన స్థాపించిన ఐఎన్ఏ సైనికులు ముగ్గురిని విచారించింది కూడా ఎర్రకోటలోనే. ఈ విచారణ జరిగిన 1945-46ల మధ్య అక్కడ అనేక ఘర్షణలు, నిరసనలు, ఆందోళన కార్యక్రమాలు జరిగాయి.
ప్రస్తుత కాలంలో నిరసనలకు జంతర్‌మంతర్ ఎలానో.. అప్పటికి ఎర్రకోటను అలా దేశభక్తులు భావించేవారు. అనంతరం స్వాతంత్య్రం సిద్ధించాక 1947లో వలస వాద జెండాను తొలగించిన భారత తొలి ప్రధాని పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ.. త్రివర్ణ పతాకాన్ని సగర్వంగా ఎగరేశారు.
లక్షల మంది ప్రజలు అక్కడకి వచ్చి నెహ్రూ ప్రసంగాన్ని విని ఉప్పొంగిపోయారు. ఎర్రకోటపై త్రివర్ణ పతాకం ఎగరడంతో తమ స్వాతంత్య్ర పోరాటం సంపూర్ణమైందని భారతీయులు నమ్మారు. అలా మనం ఇంకా స్వతంత్య్ర, సార్వభౌమ దేశంగా ఉన్నామనే దానికి గర్తుగా ఎర్రకోటపైనే ప్రధాని జెండా ఎగరేయడమనేది సంప్రదాయంగా వస్తోంది.