Rice | బియ్యం ఎగుమతులపై బ్యాన్?
Rice ప్రపంచంలోనే అతిపెద్ద ఎగుమతిదారు నిషేధంతో.. 80% ఎగుమతులకు బ్రేక్ ఎల్‌నిన్యోతో ముందు జాగ్రత్తల్లో కేంద్రం ఎన్నికల ఏడాదిలో బీజేపీలో టెన్షన్ ఇప్పటికే కొండెక్కిన టమాట ధరలు బియ్యం కొరత ఏర్పడితే ధరల మంటలే జనం నుంచి తీవ్ర వ్యతిరేకత ఖాయం న్యూఢిల్లీ: ఎల్‌నిన్యో వాతావరణ పరిస్థితులు క్రమంగా ఏర్పడుతున్నాయన్న సంకేతాల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ముందు జాగ్రత్త చర్యలపై ఆలోచనలు చేస్తున్నది. ప్రపంచంలోనే అతి పెద్ద బియ్యం ఎగుమతిదారుగా పేరున్న భారత్.. అన్ని రకాల బియ్యం […]

Rice
- ప్రపంచంలోనే అతిపెద్ద ఎగుమతిదారు
- నిషేధంతో.. 80% ఎగుమతులకు బ్రేక్
- ఎల్‌నిన్యోతో ముందు జాగ్రత్తల్లో కేంద్రం
- ఎన్నికల ఏడాదిలో బీజేపీలో టెన్షన్
- ఇప్పటికే కొండెక్కిన టమాట ధరలు
- బియ్యం కొరత ఏర్పడితే ధరల మంటలే
- జనం నుంచి తీవ్ర వ్యతిరేకత ఖాయం
న్యూఢిల్లీ: ఎల్‌నిన్యో వాతావరణ పరిస్థితులు క్రమంగా ఏర్పడుతున్నాయన్న సంకేతాల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ముందు జాగ్రత్త చర్యలపై ఆలోచనలు చేస్తున్నది. ప్రపంచంలోనే అతి పెద్ద బియ్యం ఎగుమతిదారుగా పేరున్న భారత్.. అన్ని రకాల బియ్యం ఎగుమతులపై ఆంక్షలు విధించే అవకాశం ఉన్నట్టు తెలుస్తున్నది. ఇప్పటికే ప్రపంచ మార్కెట్లలో బియ్యం ధరలు మండిపోతున్నాయి.
రానున్న రోజుల్లో మారే వాతావరణ పరిస్థితుల్లో ఇది ప్రపంచ దేశాలకు తీవ్ర విఘాతం కలిగించే అవకాశం ఉన్నదని పరిశీలకులు అంచనా వేస్తున్నారు. బాస్మతియేతర బియ్యం అన్ని వెరైటీల ఎగుమతులపై నిషేధం విధించే అవకాశం ఉన్నట్టు అధికార వర్గాలు చెబుతున్నాయి. రానున్న రోజుల్లో వరి ఉత్పత్తి తగ్గిన పక్షంలో దేశంలో బియ్యం ధరలు ఆకాశాన్ని అంటే అవకాశం ఉన్నది.
అసలే కేంద్ర ప్రభుత్వం త్వరలో ఎన్నికలను ఎదుర్కొనాల్సి ఉన్నది. ఇప్పటికే ధరల పెరుగుదల అనేది ప్రతిపక్ష రాజకీయ పార్టీలకు గొప్ప ఆయుధంగా మారింది. బీజేపీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలతో పాటు.. ధరల పెరుగుదల అంశాన్ని ప్రతిపక్షాలు ప్రధానంగా ప్రస్తావిస్తున్నాయి. ఈ నేపథ్యంలో రానున్న రోజుల్లో బియ్యం కొరత ఏర్పడి.. ధరలు పెరిగితే వ్యతిరేకత మరింత పెరుగుతుందని ప్రభుత్వంలోని పెద్దలు అభిప్రాయపడుతున్నట్టు సమాచారం.
ఈ సమయంలో రిస్క్ తీసుకోవడం మంచిది కాదని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. నిషేధం విధించిన పక్షంలో దేశం నుంచి బాస్మతి యేతర బియ్యం ఎగుమతులు దాదాపు 80శాతం వరకూ నిలిచిపోయే అవకాశం ఉన్నదని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ చర్య దేశంలో ప్రజలకు ఊరటనిచ్చినా.. ప్రపంచ మార్కెట్లను మాత్రం అతలాకుతలం చేయడం ఖాయమని అంటున్నారు. ప్రపంచంలో సగం జనాభాకు ప్రధాన ఆహారం బియ్యం. అందులోనూ ప్రపంచ వ్యాప్తంగా జరిగే దిగుమతుల్లో ఆసియా దేశాలు వాడేది 90శాతం పైనే.
ప్రపంచ రైస్ మార్కెట్‌లో భారత్ వాటా 40శాతం పైనే. గత ఏడాది మొదలైన రష్యా, ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో నూకల ఎగుమతిని భారత్ నిలిపివేసింది. తెల్ల, గోధుమ వర్ణ బియ్యం ఎగుమతులపై 20 శాతం సుంకం విధించింది. గోధుమలు, చక్కెర ఎగుమతులపైనా నియంత్రణ విధించింది. వందకు పైగా దేశాలకు భారత్ నుంచి బియ్యం ఎగుమతి అవుతుంటాయి. బెనిన్, చైనా, సెనెగల్, కోట్ డిల్‌వోయిర్, టాగో తదితర దేశాలు ఎక్కువగా భారత్ నుంచి దిగుమతి చేసుకుంటాయి.
ఎల్‌నిన్యో పరిస్థితులతో తగ్గనున్న దిగుబడి
దాదాపు ఏడేళ్ల తర్వాత మొదటిసారిగా ఎల్‌నిన్యో పరిస్థితులు నెలకొంటున్నాయి. దీని ప్రభావంతో వరి పండించే దేశాలు కరువుకాటకాలను ఎదుర్కొననున్నాయి. ఆహార ధరలు భారీగా పెరగడంతో ద్రవోల్బణం పెరిగిన నేపథ్యంలో భారత్ ఈ మేరకు ఆలోచనలు చేస్తున్నట్టు ఒక వార్తా సంస్థ పేర్కొన్నది. ఇప్పటికే దేశంలో టమాట ధరలు కొండెక్కి కూర్చున్నాయి.