Tulip Garden: భూతల స్వర్గంలో.. తెరుచుకున్న పూల వనం

విధాత : కాశ్మీర్‌ను ‘భూమిపై స్వర్గం’ అని కూడా పిలుస్తారు. కాశ్మీర్‌లో మంచుతో కప్పబడిన పర్వతాలు, పచ్చని లోయలు, సరస్సులు, జలపాతాలు, అడవులను వీక్షిస్తూ విహరించడం స్వర్గంలో విహరించిన అనుభూతినే కల్గిస్తుందంటారు. ప్రస్తుత సీజన్ లో కాశ్మీర్ లో తులిప్ పుష్పాల తోటలు కనువిందు చేస్తుంటాయి. ఇంద్రధనస్సును తలపించేలా రంగురంగుల తులిఫ్ పువ్వుల తోటలను తిలకించడం మరిచిపోలేని మధురానుభూతి. దాల్ సరస్సు కు, జబర్వాన్ పర్వత శ్రేణుల మధ్య ఉన్న ఆసియాలోనే అతిపెద్ద తులిప్ గార్డెన్‌గా కాశ్మీర్‌లో వసంతకాలం ఒక ప్రసిద్ధ ఆకర్షణ. ఇది కాశ్మీర్‌లోని ఫిరోజ్ బాగ్ ప్రాంతంలో దాల్ సరస్సుకి దగ్గరగా ఉంది. సిరాజ్ బాగ్ అని పిలువబడే ఈ ప్రదేశానికి ఇందిరా గాంధీ మెమోరియల్ తులిప్ గార్డెన్‌గా పేరు మార్చబడింది.
2007లో అప్పటి జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి గులాం నబీ ఆజాద్ ఇందిరా గాంధీ స్మారక తులిప్ గార్డెన్‌ను ఏర్పాటు చేశారు. ఈ గార్డెన్ లో దాదాపు 74 రకాల తులిప్ పువ్వులు, బంతి, గులాబీ మొదలైన 46 రకాల ఇతర పువ్వులకు నిలయంగా ఉంది. ఈ తోట మొత్తం 55హెక్టార్ల విస్తీర్ణంలో పొడవైన పొలాలు, ఉద్యానవనాలు, డాబాలతో విస్తరించి ఉంది. కాశ్మీర్ లోని తులిప్ గార్డెన్ ప్రకృతి సౌందర్యానికి ప్రతీక. ప్రపంచం నలుమూలల నుండి పర్యాటకులు తరచుగా దీనిని సందర్శిస్తారు. వసంతకాలం మార్చి మధ్య నుండి ఏప్రిల్ మధ్య వరకు లోయలో తులిప్ పువ్వులు వికసిస్తు కనువిందు చేస్తుంటాయి. వాతావరణం చాలా వేడిగా లేదా చాలా చల్లగా ఉండకుండా సందర్శనకు ఆహ్లాదకరంగా ఉంటుంది. తులిప్ పువ్వులు వికసించే ఈ కాలంలో కాశ్మీర్ లోయ మరింత అందంగా కనిపిస్తుంది.
ప్రారంభించిన ఒమర్ అబ్ధుల్లా
దాల్ సరస్సు మరియు జబర్వాన్ కొండల మధ్య ఉన్న ఆసియాలోనే అతిపెద్ద తులిప్ గార్డెన్ కాశ్మీర్ లోయలో పర్యాటక సీజన్ ప్రారంభానికి గుర్తుగా మార్చి 26న ప్రజల సందర్శన కోసం జమ్మూ కాశ్మీర్ సీఎం ఒమర్ ఒమర్ అబ్దుల్లా బుధవారం ప్రారంభించారు. ఒక దశాబ్దానికి పైగా విరామం అనంతరం నేను శ్రీనగర్‌లోని తులిప్ గార్డెన్‌ని అధికారికంగా సందర్శకులకు తెరవడానికి తిరిగి వచ్చానని తన ఎక్స్ ఖాతాలో వెల్లడించారు. రాబోయే కొద్ది వారాల్లో వేలాది మంది ప్రజలు ఆసియాలోనే అతిపెద్ద తులిప్ గార్డెన్‌ను సందర్శిస్తారన్నారు.
ఈ ఏడాది మరో రెండు కొత్త రకం తులిప్ లు
ఈ సంవత్సరం తోటలో రెండు కొత్త రకాల తులిప్‌లను విభాగం జోడించిందని తులిప్ గార్డెన్ అసిస్టెంట్ ఫ్లోరికల్చర్ ఆఫీసర్ ఆసిఫ్ అహ్మద్ తెలిపారు. దీంతో తోటలో మొత్తం తులిప్ రకాల సంఖ్య 74కి చేరుకుందని వివరించారు. హైసింత్స్, డాఫోడిల్స్, మస్కారి మరియు సైక్లామెన్స్ వంటి ఇతర వసంత పుష్పాలు కూడా ప్రదర్శనలో ఉంటాయని వెల్లడించారు. 55 హెక్టార్లలో విస్తరించి ఉన్న ఈ తోటలో దాదాపు 17 లక్షల ట్యూలిప్ బల్బులను నాటినట్లు అహ్మద్ తెలిపారు.”ఈ సంవత్సరం మా దగ్గర 1.7 మిలియన్ బల్బులు ఉన్నాయని.. పర్యాటకులు అవి వికసించడాన్ని చూడవచ్చన్నారు. నెదర్లాండ్స్ నుండి దిగుమతి చేసుకున్న 50,000 ట్యూలిప్ బల్బులతో చిన్న స్థాయిలో ప్రారంభమైన తులిప్ గార్డెన్ ప్రస్తుతం పూర్తి స్థాయి సామర్ధ్యానికి చేరుకుందన్నారు. 5.5లక్షల మంది పర్యాటకులు వస్తారని అంచన వేస్తున్నామన్నారు. టికెట్ల రేట్లు పెద్దలకు రూ.75 ఉండగా 12 ఏండ్ల లోపు పిల్లలకు రూ.30, విదేశీయులకు రూ.200 చెల్లించాల్సి ఉంటుంది. టికెట్ల కోసం https://tripmore.in/tulip-garden-kashmir-ticket-booking/ వెబ్‌సైట్‌ను సందర్శించాలని తెలిపారు.