ఆధార్ ప‌నితీరు, గోప్య‌త ప్ర‌శ్నార్థ‌క‌మే : మూడీస్‌, తిప్పికొట్టిన భార‌త ప్ర‌భుత్వం

  • By: krs    latest    Sep 26, 2023 8:47 AM IST
ఆధార్ ప‌నితీరు, గోప్య‌త ప్ర‌శ్నార్థ‌క‌మే : మూడీస్‌, తిప్పికొట్టిన భార‌త ప్ర‌భుత్వం

ఆధార్ విశ్వ‌స‌నీయ‌త‌, గోప్య‌తల‌పై అంత‌ర్జాతీయ క్రెడిట్ రేటింగ్ సంస్థ మూడీస్ (Moody’s) ప‌లు అనుమానాలు వ్య‌క్తం చేసింది. ఆధార్ (Aadhaar) స‌ర్వ‌ర్లు ఎక్కువ సార్లు నిలిచిపోవ‌డం వ‌ల్ల పౌరులు నానా ఇబ్బందులు ప‌డుతున్నార‌ని తన తాజా నివేదిక‌లో విమ‌ర్శించింది. ముఖ్యంగా రోజువారీ కూలీలు, తేమ, వేడి ఎక్కువ‌గా ఉండే ప్ర‌దేశాల్లో ఉంటున్న ప్ర‌జ‌ల‌కు ఈ క‌ష్టాలు ఎదుర‌వుతున్నాయ‌ని పేర్కొంది.

అంతే కాకుండా ఆధార్ వ్య‌వ‌స్థ ఏకీకృతంగా కేంద్రీకృత‌మై ఉంద‌ని, ఆన్‌లైన్‌లో ఆ స‌మాచారం హ్యాక్‌కు గుర‌య్యే అవ‌కాశాలు పుష్కలంగా ఉన్నాయ‌ని తెలిపింది. ‘ద యూనిక్ ఐడెంటిఫికేష‌న్ అథారిటీ ఆఫ్ ఇండియా (యూఐడేఏఐ) ఆధార్‌ను నిర్వ‌హిస్తోంది. ఈ స‌ర్వర్‌లు నిలిచిపోయి ఆధార్ అప్‌డేట్ కాక‌పోవ‌డం త‌ర‌చుగా జ‌రుగుతోంది. భార‌త్‌లో ఎక్కువ‌గా ఉండే తేమ‌, వేడి వాతావ‌ర‌ణంలో బ‌యోమెట్రిక్ టెక్నాల‌జీ ప‌నితీరుపై ప్ర‌శ్నార్థ‌క‌మే’ అని మూడీస్ పేర్కొంది.

అయితే మూడీస్ నివేదిక‌ను భార‌త ప్ర‌భుత్వం తిప్పికొట్టింది. కేవ‌లం యూఐడీఏఐ సైట్‌ను చూసి మాత్ర‌మే మూడీస్ ఈ నివేదిక‌ను త‌యారు చేసింద‌ని త‌న స్పంద‌నలో పేర్కొంది. క్షేత్ర‌స్థాయిలో ఆధార్ ప‌నితీరును వారు ప‌రీశీలించ‌లేద‌ని, ఎటువంటి అధ్య‌య‌నం చేయ‌కుండానే ఇలాంటి ఆరోప‌ణ‌లు చేశార‌ని మండిప‌డింది. స‌రైన అధ్య‌య‌నం, రుజువులు లేకుండా ఆరోప‌ణ‌ల‌ను అంగీక‌రించ‌లేమ‌ని తెలిపింది.

ప్రైవ‌సీ గురించి ప్ర‌స్తావిస్తూ.. ఇప్ప‌టి వ‌ర‌కూ ఆధార్ డేటాబేస్‌ను ఎవ‌రూ హ్యాక్ చేయ‌లేద‌ని, దొంగిలించ‌లేద‌ని పున‌రుద్ఘాటించింది. అంతే కాకుండా న‌రేగా ప‌థ‌కం కింద ప‌నిచేస్తున్న కూలీలు త‌న వేత‌నాల‌ను అందుకోవ‌డానికి బ‌యోమెట్రిక్ అవ‌స‌రం లేద‌ని తెలిపింది. ద‌శాబ్ద కాలంగా 100 కోట్ల మందికి పైగా భార‌తీయులు ఆధార్‌ను విశ్వ‌సిస్తున్నారని గుర్తుచేసింది. కాగా ఎంజీన‌రేగా కూలీల‌కు ఆధార్ బ‌యోమెట్రిక్ అవ్వ‌క‌పోవ‌డం వ‌ల్ల కూలీ డ‌బ్బులు ప‌డ‌టం లేద‌ని వార్త‌లు వ‌స్తున్నాయి.