ఇంటి కలలు ఇకనైనా తీరేనా!
కొత్తగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో తమ హయాంలో పేదలకు ఇండ్ల వసతి కల్పనకు అమలు చేసిన ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని పునరుద్ధరించేందుకు నిర్ణయించింది

- తెరపైకి మళ్లీ ఇందిరమ్మ ఇండ్లు
- గృహ నిర్మాణ శాఖ పునరుద్ధరణ
- లేదా ప్రత్యేకంగా నోడల్ వ్యవస్థ!
- సమాలోచనల్లో సర్కారు పెద్దలు
- రేషన్‌కార్డుల జారీకీ రంగం సిద్ధం
- అనర్హుల కార్డులు తొలగింపు
- కార్డుల్లో కొత్త పేర్ల నమోదు
- పేద ప్రజల్లో హర్షాతిరేకాలు
విధాత: కొత్తగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో తమ హయాంలో పేదలకు ఇండ్ల వసతి కల్పనకు అమలు చేసిన ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని పునరుద్ధరించేందుకు నిర్ణయించింది. అయితే ఈ పథకాన్ని అమలు చేసేందుకు గతంలో కాంగ్రెస్ హయాంలో ఉన్న హౌసింగ్ శాఖను గత బీఆరెస్ ప్రభుత్వం రద్దుచేసి, ఆర్‌అండ్‌బీ శాఖలో విలీనం చేసింది. ఇందిరమ్మ ఇండ్ల పథకం అమలు కోసం హౌసింగ్ శాఖను కాంగ్రెస్ ప్రభుత్వం తిరిగి పునరుద్ధరించాలని భావిస్తున్నదని సమాచారం.
ఎన్నికల్లో కాంగ్రెస్ ఇచ్చిన హామీ మేరకు ఐదు లక్షల ఆర్థిక సాయంతో అమలు చేయనున్న ఇందిరమ్మండ్ల పథకాన్ని పర్యవేక్షణ చేసేందుకు హౌసింగ్ శాఖను పునరుద్ధరించడం లేదా ప్రత్యామ్నాయ నోడల్ వ్యవస్థను ఏర్పాటు చేయడం దిశగా ఆలోచన చేస్తున్నట్టు తెలుస్తున్నది. హౌసింగ్ శాఖ పునరుద్ధరణతోనే ఇందిరమైన స్కీం అమలుకు మెరుగైన అవకాశాలు ఉంటాయనే అభిప్రాయాలు ఉన్నాయి.
గతంలో గృహ నిర్మాణ శాఖలో 500 మంది వరకు ఉన్న సిబ్బందిని ఆ శాఖను రద్దు చేసి ఇతర ప్రభుత్వ శాఖలకు బదిలీ చేశారు. హౌసింగ్‌ను ఆర్‌అండ్‌బీలో కలిపారు. ఉన్న సిబ్బందిలో కొంతమంది పదవీ విరమణ చేశారు. మండలాల్లో కాంట్రాక్ట్, అవుట్‌సోర్సింగ్ పద్ధతుల్లో నియమించిన సిబ్బందిని ఇంటికి పంపించారు. ఇప్పుడు హౌసింగ్ శాఖను ప్రభుత్వం మళ్ళీ పునరుద్ధరించిన పక్షంలో అందుబాటులో ఉన్న పాత సిబ్బందితోపాటు కొత్తగా మరికొందరినీ నియమించాల్సిన అవసరం కనిపిస్తుంది. రిటైర్డ్ ఉద్యోగుల కంటే నూతన నియామకాల ద్వారా హౌసింగ్ శాఖకు కావాల్సిన సిబ్బందిని తీసుకొని ఇండ్ల స్కీమ్‌ను సమర్ధవంతంగా ముందుకు నడిపించవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.
దశాబ్దం కాలంగా ఇళ్ళ కోసం పేదల ఎదురుచూపులు
కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఉమ్మడి రాష్ట్రంలో ఇచ్చిన ఇందిరమ్మ ఇండ్ల అనంతరం కొత్తగా గ్రామాల్లో పట్టణాల్లో ఇండ్ల మంజూరు మంజూరు జరగలేదు. బీఆరెస్ ప్రభుత్వం అమలు చేసిన డబల్ బెడ్ రూమ్ స్కీం ఆచరణలో విఫలమవడంతో మళ్లీ ఇందిరమ్మ ఇండ్ల తరహా పథకమే మంచిదనే వాదన బలపడింది. సొంత జాగా ఉన్న లబ్ధిదారులకు 3 లక్షల ఆర్థిక సహాయాన్ని మూడు దఫాలుగా అమలు చేస్తామని గతంలో బీఆరెస్ సర్కారు చెప్పింది.
తొలి విడతగా నియోజకవర్గానికి మూడు వేల చొప్పున 119 నియోజకవర్గాలలో 3లక్షల 57వేల ఇళ్లను మంజూరు చేసింది. లబ్ధిదారుల ఎంపికను చేపట్టింది. కొందరికి ప్రొసీడింగ్స్ కూడా జారీ చేసింది. ఎన్నికల్లో బీఆరెస్ ఓడిపోవడంతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. ఇప్పుడు వీటి పరిస్థితి ఏంటన్నదానిపై కొత్త ప్రభుత్వం స్పష్టతనివ్వాల్సి ఉన్నది.
కాంగ్రెస్ కట్టినవే 18 లక్షల ఇళ్లు
గతంలో వైఎస్ ప్రభుత్వ హయాంలో అత్యధికంగా తెలంగాణలో 14 లక్షల ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేసి పూర్తి చేశారు. అనంతరం 2014 వరకు కొనసాగిన కాంగ్రెస్ ప్రభుత్వాలు మరో నాలుగు లక్షల ఇండ్లు నిర్మించాయి. బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాక తొమ్మిదిన్నర ఏళ్లలో డబుల్ బెడ్ రూమ్ స్కీం ద్వారా లక్షన్నర ఇళ్లను కూడా పూర్తి చేయలేకపోయింది.
దశాబ్దం తర్వాత రేషన్ కార్డులు
ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ హయాంలో ఇచ్చిన రేషన్ కార్డులు మినహా మళ్లీ కొత్తగా రాష్ట్రంలో రేషన్ కార్డులు మంజూరు చేయలేదు. బీఆర్ఎస్ ప్రభుత్వం తొమ్మిదిన్నర ఏళ్లలో రేషన్ కార్డులను కొత్తగా మంజూరు చేయలేదు. దీంతో లక్షలాదిమంది కొత్తగా రేషన్ కార్డుల కోసం ఎదురుచూస్తున్నారు. దీంతోపాటు కొందరు తమ పాత కార్డులో కొత్త కుటుంబ సభ్యుల పేర్లను చేర్చడానికి దరఖాస్తు చేసుకున్నారు. ఉమ్మడి కుటుంబాల నుంచి వేరుపడిన వారు, కొత్తగా వివాహం చేసుకున్నవారు రేషన్ కార్డుల కోసం ఎదురుచూస్తున్నారు. ఒక్క హైదరాబాద్ నగరంలోని లక్ష ఇరవై ఐదు వేల రేషన్ కార్డు దరఖాస్తులు పౌరసరఫరాల శాఖకు అందాయి.
రాష్ట్రంలో ప్రస్తుతం 90 లక్షల 14 వేల రేషన్ కార్డులు ఉన్నాయి. వీటిలో అంత్యోదయ అన్న యోజన పథకం కింద 5.62 లక్షల కార్డులు ఉన్నాయి. అన్నపూర్ణ పథకం కింద 5.21 కార్డులు ఉన్నాయి. అటు ప్రభుత్వం కొత్త రేషన్ కార్డులను జారీ చేసే ముందు అనర్హులను గుర్తించే ప్రక్రియ కూడా చేపట్టనుంది. కార్డు దారులలో ఇప్పటికే 12 శాతం మంది రేషన్ సరుకులు తీసుకోవడం లేదని వారి కార్డులను తొలగించాల్సిన విషయమై కూడా కసరత్తు చేయనున్నారు. 9.88 లక్షల మంది కార్డుదారులు రేషన్ తీసుకోవడం లేదని పౌసరఫరాలశాఖ గుర్తించింది.
వీరి కార్డులను కొనసాగించాలా లేదా అన్న విషయాన్ని సీఎం, క్యాబినెట్ దృష్టికి కి తీసుకెళ్లాలని పౌసరఫరాలశాఖ నిర్ణయించింది. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం రేషన్ కార్డులు ఇచ్చే ప్రక్రియను చేపట్టడంతో పేద వర్గాల్లో హర్షం వ్యక్తం చేస్తున్నారు. కొత్త రేషన్ కార్డుల కోసం త్వరలోనే అప్లికేషన్లు స్వీకరించాలని నిర్ణయించింది. పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి నిర్వహించిన సమీక్షా సమావేశంలో సైతం కొత్త రేషన్ కార్డుల జారీకి సంబంధించి కసరత్తు చేపట్టాలని అధికారులకు సూచించారు.
రేషన్ లబ్ధిదారులు 2.85 కోట్ల మంది
రాష్ట్ర జనాభా 3.95 కోట్లు కాగా వీరిలో 2.85 కోట్ల మంది రేషన్ లబ్ధిదారులు ఉన్నట్లు గుర్తించారు. తెలంగాణలో 71. 47 శాతం మంది ప్రజలు ఆహార భద్రత కార్డుల పరిధిలో ఉన్నారని పౌరసరఫరాల శాఖ పేర్కొంది ఇప్పటికే ఉన్న కార్డులో కుటుంబ సభ్యుల పేర్లు చేర్చాలని 11.02 లక్షల దరఖాస్తులు వచ్చాయి. ఆరోగ్యశ్రీ సహా పలు సంక్షేమ పథకాలకు ఆహార భద్రతా కార్డు నిబంధన జత చేయడంతో ఆర్థికంగా బలంగా ఉన్న చాలా మంది ఆహార భద్రత కార్డులు కలిగి ఉన్నారు. వీరు రేషన్ తీసుకోవడం లేదని సమీక్షలో తేలింది. కొత్త రేషన్ కార్డును జారీ చేసే ముందు అనరులను రేషన్ తీసు కొని వారిని గుర్తించి కొత్త రేషన్ కార్డులను మంజూరు చేసిన పక్షంలో ప్రభుత్వానికి అదనపు భారం కొంత తగ్గవచ్చు అని భావిస్తున్నారు.