KTR: మిల్లా మ్యాగీ ఆరోపణలపై దర్యాప్తు జరిపించాలి : కేటీఆర్

KTR: మిల్లా మ్యాగీ ఆరోపణలపై దర్యాప్తు జరిపించాలి : కేటీఆర్

KTR: మిస్ వరల్డ్(Miss World) కంటెస్టెంట్ మిస్ ఇంగ్లాండ్ మిల్లా మ్యాగీ(Milla Maggi)ప్రపంచ సుందరి పోటీల్లో కంటెస్టెంట్‌లను వేశ్యల్లా..ఆటబొమ్మల్లా చూస్తున్నారని.. ఇది తనకు నచ్చలేదని, అందుకే పోటీల నుంచి తాను తప్పుకుంటున్నానని చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) ఎక్స్ వేదికగా స్పందించారు. మిస్ ఇంగ్లాండ్ మ్యాగీ మిస్ వరల్డ్ పోటీలలో ఎదురైన అనుభవంపై చేసిన వ్యాఖ్యల పట్ల చింతిస్తున్నానని తెలిపారు. మిస్ వరల్డ్ లాంటి అంతర్జాతీయ వేదికలపై మహిళల పట్ల వివక్షపూరిత ఆలోచనలు ఉన్న మెంటాలిటీని ఎదిరించడానికి చాలా ధైర్యం కావాలన్నారు. మిల్లా మ్యాగీ ఒక బలమైన మహిళ అని..మా తెలంగాణలో మీరు ఇలాంటి అనుభవాన్ని ఎదుర్కొన్నందుకు మేము చింతిస్తున్నామని కేటీఆర్ పేర్కొన్నారు. తెలంగాణలో మహిళలను గౌరవించే గొప్ప సంస్కృతి ఉందని.. ఇక్కడ మహిళలను పూజిస్తాం గౌరవిస్తాం వారి అభివృద్ధికి సమాన అవకాశాలు కనిపిస్తామన్నారు.

రాణి రుద్రమ, ఐలమ్మ వంటి గొప్ప నాయకులు మా తెలంగాణ మట్టిలో పుట్టిన వారేనని కేటీఆర్ గుర్తు చేశారు. దురదృష్టవశాత్తు మీరు ఎదుర్కొన్న ఈ చేదు అనుభవం నిజమైన తెలంగాణను ప్రతిబింబించేది కాదన్నారు. మీరు త్వరగా ఈ బాధ నుంచి కోలుకోవాలని ఆశిస్తున్నానని.. ఏ ఒక్క మహిళ గానీ, యువతులు గాని ఇలాంటి భయానక అనుభవాలను ఎదుర్కొనకూడదని ఒక కూతురి తండ్రిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని కేటీఆర్ తెలిపారు. బాధితురాలిని విమర్శించడం.. ఆమెను తప్పుగా చూపించడాన్ని ఖండిస్తున్నాను అన్నారు. అలాగే మిస్ ఇంగ్లాండ్ మిల్లా మ్యాగీ చేసిన ఆరోపణలపై సమగ్ర విచారణ జరగాలని డిమాండ్ చేస్తున్నా అని కేటీఆర్ పేర్కొన్నారు.