IPL Betting | ఐపీఎల్ బెట్టింగ్‌కు బానిసైన భర్త.. కోట్లలో అప్పులు.. ఆత్మహత్య చేసుకున్న భార్య..!

IPL Betting | ఐపీఎల్ బెట్టింగ్‌కు బానిసైన భర్త.. కోట్లలో అప్పులు.. ఆత్మహత్య చేసుకున్న భార్య..!

IPL Betting : ఐపీఎల్‌ బెట్టింగ్ బూతం ఓ నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. బెట్టింగ్‌కు బానిసగా మారిన ఓ టెకీ సర్వం పోగొట్టుకున్నాడు. కోట్ల రూపాయలు అప్పులు తెచ్చి మరీ బెట్టింగ్‌లో ధారపోశాడు. అప్పులోళ్లు ఒత్తిడి చేయడంతో తప్పించుకుని తిరుగుతున్నాడు. దాంతో అప్పులోళ్లు ఇంటి మీద పడి ఆయన భార్యను నిలదీయడం మొదలుపెట్టారు. వారి సూటిపోటి మాటలు భరించలేక ఆమె ఆత్మహత్య చేసుకుంది. కర్ణాటక రాష్ట్రంలోని చిత్రదుర్గలో ఈ విషాద ఘటన చోటుచేసుకుంది.

వివరాల్లోకి వెళ్తే.. చిత్రదుర్గకు చెందిన దర్శన్‌ బాబు వృత్తి రీత్యా సాఫ్ట్‌ వేర్‌ ఇంజినీర్‌. సులువుగా డబ్బు సంపాదించాలనే ఆశతో ఐపీఎల్‌ బెట్టింగ్‌కు బానిసగా మారాడు. ఈ క్రమంలోనే 2020లో రంజిత (23) అనే మహిళను వివాహం చేసుకున్నాడు. భర్త బెట్టింగ్‌ వ్యసనం గురించి రంజితకు 2021లో తెలిసింది. దాంతో ఆమె వద్దని హెచ్చరించినా దర్శన్‌ బాబు వినిపించుకోలేదు. కోట్ల రూపాయలు అప్పులు చేసి మరీ బెట్టింగ్‌లో పెట్టాడు. చివరికి ఆస్తిపాస్తులు అమ్మి అప్పులు కట్టాడు.


అయినా మరో రూ.84 లక్షల అప్పు మిగిలిపోయింది. ఆ అప్పు తీర్చడానికి ఏ మార్గం కనిపించలేదు. దాంతో గత కొన్ని రోజులుగా అప్పులవాళ్లకు కనిపించకుండా తప్పించుకుని తిరుగుతున్నాడు. దాంతో అప్పులోళ్లు తరచూ ఇంటికి వచ్చి రంజితను నిలదీయడం మొదలుపెట్టారు. సూటిపోటి మాటలతో వేధించసాగారు. దాంతో తీవ్ర మనస్తాపానికి గురైన రంజిత ఆత్మహత్య చేసుకుంది. ఇంట్లో ఫ్యాన్‌కు ఉరేసుకుని ఉసురు తీసుకుంది. అప్పులోళ్ల వేధింపులే తన ఆత్మహత్యకు కారణమని సూసైడ్‌ నోట్‌ రాసింది.


ఘటనపై మృతురాలి తండ్రి వెంకటేశ్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. వడ్డీ వ్యాపారుల వేధింపుల వల్లే తన కూతురు తీవ్ర మనస్తాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడిందని ఫిర్యాదులో పేర్కొన్నాడు. డబ్బు అప్పుగా ఇచ్చిన 13 మంది వ్యక్తుల పేర్లను ఫిర్యాదులో చేర్చాడు. తన అల్లుడికి బెట్టింగ్‌ అంటే ఇష్టం లేదని, అప్పు ఇచ్చిన వారే డబ్బు ఆశ చూపి అతడిని బలవంతంగా ఇందులోకి దింపారని వాపోయాడు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కాగా, మృతురాలు రంజితకు రెండేళ్ల కొడుకు ఉన్నాడు.