ISRO | శ్రీ సూర్యనారాయణా.. మేలుకో! ఇస్రోకు సరికొత్త సవాలు.. చేరవలసిన లక్ష్యం అదిగో..

ISRO | 2023 సెప్టెంబరు 2న (శనివారం) ‘ఆదిత్య-ఎల్1’ ప్రయోగం. చేరవలసిన లక్ష్యం అదిగో.. ‘లగ్రాంజ్ పాయింట్ 1’. సూర్యుడు-భూమి వ్యవస్థలో భూమికి 15 లక్షల కిలోమీటర్ల దూరంలోని ఆ బిందువు చుట్టూ ఉండే కక్ష్యలో ‘ఆదిత్య-ఎల్1’ పరిశీలక ఉపగ్రహాన్ని (అబ్జర్వేటరీ) ప్రవేశపెట్టనున్న భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ‘ఇస్రో’. ఆ కక్ష్య చంద్రుడి కక్ష్యకు వెలుపల ఉంటుంది. అంటే.. సూర్యుడిని గ్రహణాలు ‘మింగలేవు’. రాహుకేతువుల ఆటలు సాగవ్! ఆదిత్యుడి దాగుడుమూతలూ చెల్లవ్! ఉపగ్రహం చూపు నుంచి […]

  • By: krs    latest    Aug 30, 2023 1:14 AM IST
ISRO | శ్రీ సూర్యనారాయణా.. మేలుకో! ఇస్రోకు సరికొత్త సవాలు.. చేరవలసిన లక్ష్యం అదిగో..

ISRO |

2023 సెప్టెంబరు 2న (శనివారం) ‘ఆదిత్య-ఎల్1’ ప్రయోగం. చేరవలసిన లక్ష్యం అదిగో.. ‘లగ్రాంజ్ పాయింట్ 1’. సూర్యుడు-భూమి వ్యవస్థలో భూమికి 15 లక్షల కిలోమీటర్ల దూరంలోని ఆ బిందువు చుట్టూ ఉండే కక్ష్యలో ‘ఆదిత్య-ఎల్1’ పరిశీలక ఉపగ్రహాన్ని (అబ్జర్వేటరీ) ప్రవేశపెట్టనున్న భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ‘ఇస్రో’. ఆ కక్ష్య చంద్రుడి కక్ష్యకు వెలుపల ఉంటుంది.

అంటే.. సూర్యుడిని గ్రహణాలు ‘మింగలేవు’. రాహుకేతువుల ఆటలు సాగవ్! ఆదిత్యుడి దాగుడుమూతలూ చెల్లవ్! ఉపగ్రహం చూపు నుంచి సూరీడు తప్పించుకోలేడు. ‘లగ్రాంజ్ పాయింట్ 1’ మన ఉపగ్రహం సదా రవిని గాంచు చోటు.

ప్రయోగానంతరం ‘ఎల్1’ కక్ష్యను చేరడానికి ‘ఆదిత్య’ ఉపగ్రహానికి నాలుగు నెలల సమయం పడుతుంది. ఈ వ్యవధిలో ఇస్రోకు సుదీర్ఘ కసరత్తు తప్పదు. శాటిలైట్ల రకాల ఆధారంగా వాటి ప్రయోగాలకు రోదసిలో చాలా కక్ష్యలు ఉన్నాయి.

ధృవ కక్ష్య సహా దిగువ కక్ష్యలు (LEO), సూర్య అనువర్తిత (సన్ సింక్రనస్) కక్ష్య (SSO), భూస్థిర కక్ష్య (GEO), ఉపగ్రహాన్ని మొదట ప్రవేశపెట్టిన కక్ష్య నుంచి.. చేర్చాల్సిన తుది కక్ష్యకు అంటే.. ఇంకో ఎగువ కక్ష్యకు మార్చేందుకు వీలు కల్పించే భూస్థిర ‘బదిలీ’ కక్ష్య (GTO) వంటి మధ్యంతర ‘బదిలీ’ కక్ష్యలు ఇలా బోలెడు ఉన్నాయి. ‘ఆదిత్య-ఎల్1’ వెళ్లనున్న ‘లగ్రాంజ్ పాయింట్ 1’కు ఇస్రో ఇంతకుముందెన్నడూ ఉపగ్రహాలను పంపలేదు. ఈ ప్రయోగం ఇస్రోకు కొత్త అనుభవం, సరికొత్త సవాలు!