నీలాకాశంలో తెల్లని మేఘాల్లా మంచుఫలకాలు.. అంతరిక్షం నుంచి ఆస్ట్రోనాట్ ఫొటో
అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్)లో పరిశోధనలకు వెళ్లిన వ్యోమగాములు అప్పుడప్పుడూ భూమికి సంబంధించిన ఫొటోలను పంచుకుంటూ ఉంటారు
అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్)లో పరిశోధనలకు వెళ్లిన వ్యోమగాములు అప్పుడప్పుడూ భూమికి సంబంధించిన ఫొటోలను పంచుకుంటూ ఉంటారు. అవి ఆకట్టుకునేలా ఉండటంతో పాటు ఎన్నో కొత్త విషయాలను తెలియజేస్తాయి. తాజాగా యురోపియన్ స్పేస్ ఏజెన్సీ (ఈఎస్ఏ)కు చెందిన ఆస్ట్రోనాట్ ఆండ్రియాస్ మోజెన్‌సేన్ ఐఎస్ఎస్ నుంచి తీసిన ఓ ఫొటో అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది.
సముద్రంలో తేలుతున్న అనేక మంచుఫలకాల ఫొటో తీసి ఆయన ఎక్స్‌లో పంచుకున్నారు. ఆ ఫొటోలో ఉన్నది దక్షిణ అట్లాంటిక్ సముద్రం కాగా.. దానిపై తేలుతున్నవి భారీ మంచుఫలకాలు అని పేర్కొన్నారు. ఈ ఫొటోను హఠాత్తుగా చూస్తే నీలాకాశం మీదుగా నెమ్మదిగా కదిలిపోతున్న తెల్లని మేఘమాలికలా కనిపిస్తూ కనువిందు చేస్తోంది.
ఐఎస్ఎస్ (International Space Station) కు రాకముందు నన్ను ఎవరైనా అంతరిక్షం నుంచి ఐస్‌బర్గ్స్ (Ice Burgs) కనపడతాయా అని అడిగితే లేదు అనే చెప్పేవాణ్ని..కానీ ఇక్కడకు వచ్చాక ఒక కొత్త విషయం నేర్చుకున్నా అని ఆండ్రియాస్ తన ట్వీట్‌లో పేర్కొన్నారు.
అయితే ఈ ప్రకృతి గీసిన చిత్రాన్ని చూశాక తనకు వాతావరణ మార్పుల పట్ల ఆందోళన కలుగుతోందని ఆయన అన్నారు. పెరుగుతున్న ఉష్ణోగ్రతల వల్ల ఐస్‌బర్గ్స్ కరిగిపోవడం, సముద్ర జలాల ఎత్తు పెరగడం వంటి పరిణామాల వేగం పెరిగిందని.. ఇది ఇలానే కొనసాగితే మరో 70 ఏళ్లకు మాల్దీవుల వంటి ద్వీపాలు సముద్రగర్భంలో కలిసిపోతాయని పేర్కొన్నారు.
మెల్లగా ముందుకు సాగుతున్న భారీ ఐస్‌బర్గ్
మూడు దశాబ్దాలుగా కదలకుండా ఒక చోట ఉండిపోయిన భారీ ఐస్‌బర్గ్ తన ముందుకు కదిలినట్లు శాస్త్రవేత్తలు గత నెలాఖరులో ప్రకటించారు. ఏ23ఎ అనే పేరుతో పిలిచే ఈ ఐస్‌బర్గ్ ప్రపంచంలోనే అతి పెద్దది అని సమాచారం. దీని వైశాల్యం 4 వేల చ.కిమీ కాగా ఇంచుమించుగా న్యూయార్క్ నగరాన్ని దీనిపై నిర్మించవచ్చు.
ఇంత పెద్దదైన మంచుఫలకం కదలడమే ఒక అరుదైన విషయం కావడంతో శాస్త్రవేత్తలు దీని గమనంపై ఒక కన్నేసి ఉంచారు. ఇది ప్రస్తుతం క్రమంగా వేగం పుంజుకుని అంటార్కిటిక్ సర్కంపోలార్ కరెంట్ అనే ప్రాంతం వైపు పయనిస్తోంది.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram