చెంప దెబ్బ కొట్టించుకుంటేనే రెస్టారెంట్‌లోకి ప్రవేశం.. పోటెత్తిన కస్టమర్లు !
వినియోగదారులను ఆకర్షించడానికి ఎక్కడైనా హోటళ్లు, రెస్టారెంట్లు ఏం చేస్తాయి? రుచి, శుచిగా ఉండే ఆహారాన్ని వడ్డించడం, కస్టమర్లను గౌరవంగా ఆహ్వానించడం, డిస్కౌంట్లు ఇవ్వడం వంటి మార్గాలను ఆశ్రయిస్తాయి

విధాత: వినియోగదారులను ఆకర్షించడానికి ఎక్కడైనా హోటళ్లు, రెస్టారెంట్లు ఏం చేస్తాయి? రుచి, శుచిగా ఉండే ఆహారాన్ని వడ్డించడం, కస్టమర్లను గౌరవంగా ఆహ్వానించడం, డిస్కౌంట్లు ఇవ్వడం వంటి మార్గాలను ఆశ్రయిస్తాయి. కానీ వింతలు, విడ్డూరాలకు నెలవైన జపాన్ (Japan) లో ఓ హోటల్ మాత్రం వింత మార్గాన్ని ఎంచుకుంది. తమ హోటల్‌కు వచ్చిన ప్రతి ఒక్కరినీ చెంప దెబ్బలు కొడతామని కొన్ని నెలల కిందట బయట బోర్డు పెట్టింది.
పైగా తమకు కావల్సినట్లు కొట్టించుకునే వారు రూ.150 (2 డాలర్లు ) నుంచి రూ. 300 (3.5 డాలర్లు) వరకు చెల్లించుకోవాల్సి ఉంటుందని కూడా రాసింది. అలాంటి కస్టమర్లకు కాంప్లిమెంట్‌గా కొన్ని స్నాక్ ఐటమ్స్‌నూ ఉచితంగా ఇస్తామని తెలిపింది. డి నగోయా అనే నగరంలో ఉన్న షాచిహోకో యా ఇజాకాయా అనే రెస్టారెంట్ ఈ వింత నిర్ణయాన్ని తీసుకుంది. కొట్టించుకోవడానికి (Slapping restaurant) హోటల్‌కు ఎవరొస్తారని.. మనలాగే అక్కడి వారందరూ ఆశ్చర్యపోయారు. కానీ ఆశ్చర్యకరంగా వినియోగదారులు ఈ హోటల్‌కు పోటెత్తారు.
జపాన్ సంప్రదాయ దుస్తుల్లో ఉండే అందమైన వెయిట్‌రెస్.. రెస్టారెంట్ ఎంట్రన్స్‌లో నుంచుని.. వచ్చిన వారందరినీ కావాల్సినన్ని సార్లు చెంప దెబ్బలు కొట్టేవారు. ఆ తర్వాతే లోపలికి పంపేవారు. దీనికి సంబంధించిన వీడియోలు ఇప్పుడు నెట్‌లో వైరల్‌గా మారాయి. తమ చెంపను ఎర్రగా మార్చాలనే వారికి స్పెషల్ ధరలతో ప్రత్యేక వెయిట్‌రెస్‌ను కేటాయించేవారు. ఆమె మెరుపు వేగంతో దెబ్బ మీద దెబ్బ వేస్తూ చెంప అంతా ఎరుపెక్కిపోయేలా కొట్టేది.
స్వదేశీయులే కాకుండా విదేశీయులూ ఈ చెంపదెబ్బల కోసం పోటెత్తారు. వారిలో కొందరు మీడియాతో మాట్లాడుతూ.. ఆ దెబ్బలు తిన్న తర్వాత తమ ఒత్తిడి దూది పింజలా ఎగిరిపోయిందని.. అది ఒక వింత అనుభవమని చెప్పుకొచ్చారు. కస్టమర్లను సాదరంగా, గౌరవపూర్వకంగానే ఎందుకు ఆహ్వానించాలనే ప్రశ్న తలెత్తి.. ఇలాంటి ఆలోచన చేసినట్లు రెస్టారెంట్ యాజమాన్యం వెల్లడించడం గమనార్హం. తాజాగా అయితే ఈ చెంప దెబ్బ వీడియోలు బయటకు రావడంతో స్థానిక అధికారులు ఆ రెస్టారెంట్‌ను హెచ్చరించినట్లు సమాచారం.
దీంతో ఇక చెంప దెబ్బల ఐడియాకు స్వస్తి చెబుతున్నామని… వినియోగదారులు ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలని సదరు రెస్టారెంట్ యాజమాన్యం ఎక్స్‌లో ప్రకటించింది. సుమారు గత నెల రోజుల నుంచి ఆ ప్రక్రియను నిలిపివేసింది. కాగా.. చెంప దెబ్బలు ఒక్కోసారి ప్రాణాంతకం కావొచ్చని వైద్యులు హెచ్చరిస్తున్నారు. చెవి దగ్గర ఉండే సున్నిత ప్రాంతంలో చెంప దెబ్బ గట్టిగా తగిలితే.. వెంటనే మరణం తప్పదని పేర్కొన్నారు.