MLA Maganti Gopinath: జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ ఆరోగ్యం విషమం?

MLA Maganti Gopinath: జూబ్లీహిల్స్(Jubilee Hills) బీఆర్ఎస్(BRS) ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్(MLA Maganti Gopinath) ఆరోగ్యం విషమించింది. ఆయన కొంతకాలంగా కిడ్నీ వ్యాధితో బాధపడుతున్నాడు. తీవ్ర అనారోగ్యంతో మాగంటి గోపీనాథ్ ప్రస్తుతం ఏఐజీ ఆసుపత్రిలో వెంటిలెటర్ పై చికిత్స పొందుతున్నారు. మాగంటి గోపీనాథ్ 2014, 2018, 2023లో వరుసగా జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేగా గెలిచారు. ఎమ్మెల్యే గోపినాథ్ అస్వస్థత సమాచారం తెలుసుకున్న మాజీ మంత్రి టి.హరీష్ రావు సహా బీఆర్ఎస్ మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, బీఆర్ఎస్ నేతలు హుటాహుటిన ఏఐజీ ఆసుపత్రికి చేరుకున్నారు. మాగంటి గోపినాథ్ 1963 జూన్ 2న కృష్ణమూర్తి, మహానంద కుమారి దంపతులకు హైదరాబాద్ హైదర్ గూడలో జన్మించారు. 1983లో ఉస్మానియా యూనివర్సిటిలో గ్రాడ్యూయేట్ పూర్తి చేశారు. ఆయనకు భార్య సునిత, ఒక కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.
మాగంటి గోపీనాథ్ 1983లో తెలుగుదేశం పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చాడు. ఆయన 1985 నుంచి 1992 వరకు తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడిగా, 1987, 1988లో హైదరాబాద్ అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ (హుడా) డైరెక్టర్‌గా, 1988 నుంచి 93 వరకు వినియోగదారుల ఫోరం అధ్యక్షుడిగా, టీడీపీ హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడిగా వివిధ హోదాల్లో పని చేశాడు. 2014 సార్వత్రిక ఎన్నికల్లో జూబ్లీహిల్స్ నుంచి టీడీపీ నుంచి విజయం సాధించారు. అనంతరం టీఆర్ఎస్ చేరి 2018, 2023ఎన్నికల్లో ఇదే నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా హ్యాట్రిక్ విజయాలు నమోదు చేశారు.