కదిరి లక్ష్మీనరసింహుడి బ్రహ్మోత్సవాలు షురూ

శ్రీ సత్య సాయి జిల్లా కదిరి పట్టణంలో ప్రహ్లాద సమేత స్వయంభూగా వేలసియున్న శ్రీమత్ కదిరి(ఖాద్రీ) లక్ష్మీనరసింహస్వామి దేవస్థానము వార్షిక బ్రహ్మోత్సవాలు మంగళవారం శాస్త్రయుక్తంగా వైభవంగా ప్రారంభమయ్యాయి

  • By: Somu    latest    Mar 19, 2024 12:13 PM IST
కదిరి లక్ష్మీనరసింహుడి బ్రహ్మోత్సవాలు షురూ
  • బుధవారం స్వామివారి కల్యాణోత్సవం
  • కదిరికి పొటెత్తనున్న భక్తజనం


విధాత, హైదరాబాద్‌: శ్రీ సత్య సాయి జిల్లా కదిరి పట్టణంలో ప్రహ్లాద సమేత స్వయంభూగా వేలసియున్న శ్రీమత్ కదిరి(ఖాద్రీ) లక్ష్మీనరసింహస్వామి దేవస్థానము వార్షిక బ్రహ్మోత్సవాలు మంగళవారం శాస్త్రయుక్తంగా వైభవంగా ప్రారంభమయ్యాయి. అంకురార్పణంతో ప్రారంభమైన బ్రహ్మోత్సవాల్లో రెండవ రోజు బుధవారం ఏకాదశిన లక్ష్మీనరసింహుల కల్యాణోత్సవం వైభవంగా నిర్వహించేందుకు ఆలయ యంత్రాంగం భారీ ఏర్పాట్లు చేపట్టింది. స్వామివారి బ్రహ్మోత్సవాలు ఏప్రిల్ 2 వ తేదీ వరకు 15 రోజుల పాటు అత్యంత వైభోపేతంగా జరుగనున్నాయి.


బుధ‌వారం 20న స్వామివారి కల్యాణోత్సవం, 21న హంసవాహన సేవ, 22న సింహవాహన సేవ, 23న హనుమంత వాహన సేవ, 24న బ్రహ్మగరుడ సేవ, 25న శేష వాహన సేవ, 26న సూరప్రభ, చంద్రప్రభ వాహన సవేవ, 27న మోహిని ఉత్సవం, 28న ప్రజా గరుడ సేవ, 29న గజవాహన సేవ, 30న బ్రహ్మోరథోత్సవం, 31న అలుకోత్సవం, అశ్వవాహన సేవ, ఏప్రిల్ 1న తీర్ధావాది, 2న దేవతోద్వాసన, పుష్పయాగోత్సవంతో బ్రహోత్సవాలు పరిసమాప్తం కానున్నాయి. 13వ తేదీన వసంతోత్సవం నిర్వహించనున్నారు. ఈ వార్షిక బ్రహ్మోత్సవాలతో కదిరి క్షేత్రం భక్తులతో కిటకిటలాడనుంది. జై నారసింహ ధ్వానాలతో మార్మోగనుంది.


మహిమాన్వితం కదిరి నరసింహ క్షేత్రం


అనంతపురం జిల్లా కదిరి పట్టణంలో వెలసిన కదిరి ఆలయానికి ఒక చరిత్ర ఉంది. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి హిరణ్యకశిపుడుని వదించిన తర్వత ఆగ్రహంతో స్వామి అలానే సంచరించడం చూసిన దేవాదిదేవతలు భీతిల్లి, స్వామిని శాంతపరచడం నీవల్లే అవుతుందని ప్రహ్లాదునికి చెబుతారు. అప్పుడు ప్రహ్లాదుడు ఈ ఖాద్రీ ప్రదేశంలో స్వామిని శాంతపరచడంకోసం ప్రార్థనలు చేశాడని క్షేత్ర పురాణం. అందుకు నిదర్శనంగా ఇక్కడ స్వామి వారు ప్రహ్లాదుని సమేతంగా ఉంటారు. స్వామిని పూజిస్తున్నట్టు ప్రహ్లాదుడు స్వామికి ఎడమవైపు ఈ ఆలయంలో మనకు దర్శనమిస్తారు. శ్రీ లక్ష్మీనరసింహస్వామి విగ్రహం, స్వామిని పూజిస్తున్నట్టు ఉన్న ప్రహ్లదుని విగ్రహం ఖాద్రీ వృక్షం క్రింద కొలువై ఉంటాయి. 10వ శతాబ్దంలో పట్నం పాలగాడు అయిన రంగనాయకుల స్వామి వారి ఆదేశం మేరకు ఇక్కడ ఆలయం నిర్మించినట్టు చరిత్ర చెబుతోంది.


 


విగ్రహంలో దైవ రహస్యం: ఇక్కడ స్వామి వారి రూపంతో పాటు ఎవరికీ తెలియని ఒక దైవ రహస్యం కూడా ఉంది. ఈ క్షేత్రంలో మూలవిరాట్టుకు అభిషేకం చేసిన తర్వాత విగ్రహం నాభి నుంచి వచ్చే స్వేదాన్నే భక్తులు తీర్థంగా స్వీకరిస్తారు. అయితే ఆ స్వేదం ఎలా వస్తుందన్నది నేటికీ ఎవరూ చెప్పలేని పరిస్థితి. నేటికీ స్వామి వారు ఇక్కడ నిజరూపంలో ఉన్నారని చెప్పేందుకు ఇది ఒక సాక్షంగా భక్తులు నమ్ముతారు. అసలు కదిరి నరసింహా స్వామిని కాటమరాయునిగా ఎందుకు పిలుస్తారు.. అలాగే శ్రీ ఖాద్రీ నరసింహునిగా ఎందుకు పిలుస్తారో తెలుసుకుందా… కదిరికి దగ్గరలో ఉన్న గాండ్లపెంట మండలంలోని చండ్రవృక్షపు కొయ్య స్తంభం నుండి స్వామి ఉద్భవించారని భక్తుల నమ్మకం.


స్వామివారు ఉద్భవించిన ఈ కొండకి అనుకోని కాటం అనే కుగ్రామం ఉండటం వలన కాటమరాయుడుగా స్వామికి పేరు వచ్చింది. అలాగే ఖాద్రీ అని ఎందుకంటారంటే.. సంస్కృతంలో ఖా అనగా విష్ణు పాదం, అద్రి అనగా పర్వతం. విష్ణువు పాదాలు మోపడం వలన ఈ పర్వతానికి ఖాద్రీ అనే పేరు వచ్చిందంటారు. కాలక్రమేణా ఖాద్రీ కాస్త కదిరిగా మారిందని స్థానికుల కథనం. దేశంలోని నవ నరసింహాలయాలో ప్రహ్లాద సమేత కదిరి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయం అత్యంత ప్రాధాన్యత కలిగినదిగా పేరోందింది.


అలాగే ఉగ్ర నరసింహుడిని శాంతపరిచేందుకు దేవతలు ప్రహ్లాదుడితో సహా ఈ పర్వతం పైకి వచ్చి స్వామిని శాంతిపజేయడానికి అనేక స్త్రోత్రాలను పఠించారు. దీంతో నరసింహుడు శాంతించాడని, దేవతలు స్త్రోత్రాలను పఠించడం వల్లే ఈ పర్వతానికి స్త్రోత్రాద్రి అని పేరు వచ్చిందని మరో కథనం. కాటమ అంటే అడవి, రాయుడు అంటే అధిపతి. అడవికి అధిపతి సింహం. సింహం శిరస్సు ఉన్నందునే ఖాద్రి నరసింహుడికి కాటమరాయుడు అని పేరు వచ్చిందని జానపదుల కథనం. స్త్రోత్రాద్రిలో నివసించే చెంచులు పాడుకున్న జానపదల్లోని ఈ పాట అటు పై భక్తి తత్వమైన పాటగా ప్రాచుర్యంలోకి వచ్చిందని స్థానికులు చెబుతుంటారు.