Uttam Kumar Reddy: నోటీసులంటే భయమెందుకు?

– బీఆర్ఎస్ నేతల వికృత రాజకీయం
– కాళేశ్వరంతో 62 వేల కోట్లు వృథా
– ఆ డబ్బుతో ఇతర ప్రాజెక్టులు పూర్తయ్యేవి
– మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
Uttam Kumar Reddy: విధాత, హైదరాబాద్ః కాళేశ్వరం కమిషన్ నోటీసులు ఇస్తే బీఆర్ఎస్ నేతలు ఎందుకు వణికిపోతున్నారని నీటిపారుదలశాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రశ్నించారు. తాము ఇంకా చర్యలు తీసుకోలేదని.. ప్రస్తుతం విచారణ మాత్రమే జరుగుతున్నదని స్పష్టం చేశారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ పేరుతో భారీగా ప్రజాధనం దుర్వినియోగం అయ్యిందని పేర్కొన్నారు. వైఎస్ హయాంలో తమ్మిడిహట్టి వద్ద 38 వేల కోట్ల రూపాయలతో ఈ ప్రాజెక్ట్ కోసం రూపకల్పన జరిగిందని.. అక్కడ ప్రాజెక్ట్ కడితే ప్రభుత్వానికి చాలా డబ్బు ఆదాఅయ్యేదని పేర్కొన్నారు.
కానీ కేవలం కమీషన్ల కోసమే కాళేశ్వరం అంచనాలు పెంచి లక్ష కోట్లకు తీసుకెళ్లారని ఫైర్ అయ్యారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ పరిస్థితి ఏమిటో ఎన్డీఎస్ ఏ తేల్చి చెప్పిందని గుర్తు చేశారు. శుక్రవారం మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కాళేశ్వరం ప్రాజెక్టుపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. బీఆర్ఎస్ నేతలు రాష్ట్రంలో వికృత, వికార మైన విధానాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు.జ్యుడీషియల్ కమిషన్ విచారణలో భాగంగా కేసీఆర్, హరీష్ కు నోటీసులు పంపిస్తే తప్పుడు వ్యాఖ్యలు చేస్తున్నారన్నారు.
జేబులు నింపుకోవడానికే కాళేశ్వరం
కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టింది రైతులకు నీళ్లు ఇచ్చేందుకు కాదని.. బీఆర్ఎస్ నేతలు జేబులు నింపుకోవడానికే కట్టారని ఆరోపించారు. కేసీఆర్, హరీశ్ రావు ఏ తప్పు చేయకపోతే నోటీసులకు ఎందుకు భయపడతారని ప్రశ్నించారు. మేడిగడ్డ బరాజ్ బాంబులు పెట్టి పేల్చారంటూ కేటీఆర్ ఆరోపించారని.. ఆయన దగ్గర ఆధారాలు ఉంటే విచారణ కమిషన్ కు అందజేయాలని కోరారు. కేసీఆర్, హరీశ్ రావు విచారణకు హాజరై సహకరించాలని కోరారు. వాళ్ల దగ్గర ఉన్న ఆధారాలను కమిషన్ ముందు ఉంచాలని చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ నిజంగానే సదుద్దేశంతో కట్టి ఉంటే ఆ వివరాలను కమిషన్ కు తెలపాలని కోరారు.